|

చెట్టంత మనిషి!

పర్యావరణ పరిరక్షణ అనేది ఎదో ఒకరోజు చెప్పే నినాదంగా కాకుండా ప్రతీ ఒక్కరి జీవన విధానంగా మార్చుకోవాలి అని బలంగా నమ్మి పాటించే వ్యక్తి నల్లగొండ పట్టణానికి చెందిన మిట్టపల్లి సురేష్‌ గుప్తా. భారతీయ జీవన విధానం, ఆచార వ్యవహారాలు, మన సంస్క తిలో పర్యావరణంలో భాగమైన గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పరిరక్షించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయంటారు ఆయన.

పర్యావరణంపై మేధావుల మాటలకు ప్రభావితం అయిన సురేష్‌ గుప్తా తన బ్యాంక్‌ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తనకెంతో ఇష్టమైన పర్యావరణం, పరిసరాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ గ్లోబల్‌వార్మింగ్‌ సదస్సులో పర్యావరణ సమస్యలపై వక్తల మాటలకు మరింత ప్రభావితం అయిన సురేష్‌ గుప్తా అప్పటినుండి ప్లాస్టిక్‌కి దూరంగా ఉండసాగాడు. ప్లాస్టిక్‌ వల్ల అనర్ధాలను ప్రజలందరికి తెలియచెప్పే ప్రయత్నంలో మొదట బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ సెలవు దినాల్లో మాత్రమే కార్యక్రమాలు చేపట్టేవాడు. తర్వాత పర్యావరణంలో మార్పులు సకల జీవరాశుల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుందని గమనించి, ఉద్యోగం చేస్తూ కార్యక్రమాలు చెయ్యలేనని భావించి, ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సమాజం కోసం ప్రకతికోసం తన జీవితాన్ని అంకితం చేశారు.

నల్లగొండ జిల్లా శేషమ్మగూడెం సురేష్‌ గుప్తా స్వస్థలం కాగా నల్లగొండలో నివాసం ఉంటున్నాడు. ఇతని ఆదాయంలో మూడొంతులు మొక్కలు కొనడానికే ఖర్చుచేస్తాడు. ఎవ్వరిని కలవడానికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా మొక్కలను, ఎల్‌ఇడి బల్బులను బహుమతిగా ఇవ్వడం అలవాటు. దీనితో పాటు సేవ్‌ వాటర్‌ ప్రతిజ్ఞ పత్రాన్ని కూడా అందిస్తాడు. భూమిని, నీటిని, చెట్లను, విద్యుత్తును కాపాడాలని తెలియచేస్తాడు. నల్లగొండ యన్‌జీ కళాశాలలోని ఖాళీ స్థలంలో ఇంకుడుగుంతను నిర్మించడంతో పాటు కాలేజీ ఆవరణలో మొక్కలను పెంచి సంరక్షించాడు. నల్గొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో, మసీదులలో లయన్స్‌ క్లబ్‌ సాయంతో ఇంకుడు గుంతలను నిర్మింపచేశాడు. ప్రవేటు హస్పిటళ్ళలో విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉన్న వారి ఇండ్లలో సోలార్‌ ప్యానెల్లను ఏర్పాటు చేయడం ద్వారా సోలార్‌ విద్యుత్‌ వాడకాన్ని ప్రోత్సహించాడు.

రాష్ట్రంలోనే అతితక్కువ అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న జిల్లా నల్లగొండ జిల్లా. ఈ జిల్లాలో జాతీయ రహదారులు, రోడ్ల విస్తరణలో తొలగించిన చెట్లు ఎన్నో. హరితహారంలో భాగంగా ప్రతీ సంవత్సరం ఉపాధిహామీ కూలీల సహాయంతో మొక్కలను నాటుతున్నప్పటికీ ఇంకా పచ్చదనం పరుచుకోవాలంటే ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలను నాటాల్సిఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా యువకులను, విద్యార్థులను చైతన్య పరిచేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతుంటారు సురేష్‌ గుప్తా. విద్యార్థులలో చెట్ల పెంపకం పై అవగాహన కల్పించడం కోసం వారితో ప్రత్యేకంగా సీడ్‌ బాల్స్‌ను తయారుచేయిస్తారు. ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో విద్యార్థులతో విత్తనాలను ఆవుపేడ, గోమూత్రం, మట్టి

ఉపయోగించి సీడ్‌ బాల్స్‌గా తయారు చేయించి ఊరిలో అక్కడక్కడ నాటడం అలవాటు చేశాడు. పుట్టిన రోజు నాడు ప్రతీ ఒక్కరు ఒక మొక్కనాటేలా పిల్లలకు అవగాహన కల్పించాడు. అంతటితో ఆగకుండా ‘నో ప్లాస్టిక్‌ డే’ నినాదంతో ప్లాస్టిక్‌ వాడకానికి వ్యతిరేకంగా తనదైన శైలిలో కార్యక్రమాలు రూపొందించి ఫాలో అవుతుంటారు. ఎక్కడైనా ఫంక్షన్లలో ప్లాస్టిక్‌ వాడుతున్నట్టు తెలిస్తే వెంటనే అక్కడకు చేరుకుని వారికి ప్లాస్టిక్‌ వాడకం వల్ల నష్టాలపై అవగాహన కల్పిస్తారు. దీనితో పాటు

ఉచితంగా స్టీల్‌ ప్లేట్లను, గ్లాసులను సప్లయ్‌ చేస్తాడు. స్టీలు ప్లేట్లు వద్దన్న వారికి మోదుగు ఇస్తరాకు కట్టలను ఉచితంగా అందిస్తారు. మనకు చాలా ఇష్టమైన చుట్టాలను, స్నేహితులను శుభకార్యానికి పిలిచి క్యాన్సర్‌ కు కారకం అయిన ప్లాస్టిక్‌ ప్లేట్లలో ఆహారాన్ని వడ్డించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు.

ప్రతీ రోజు మనం వాడే ప్లాస్టిక్‌ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు భూమిలో కలిసిపోక రిసైక్లింగ్‌కి ఉపయోగపడక భూమి కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ సురేష్‌ గుప్తా ప్రతీ రోజు ఉదయాన్నే కూరగాయల మార్కెట్‌ కు వెళ్ళి అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించే వారికి ఉచితంగా చేతి సంచులను అందిస్తుంటాడు. ఇంతేకాకుండా సింథటిక్‌, షిఫాన్‌, నైలాన్‌ దుస్తులను కాకుండా భూమికి హానిచేయని చేనేత వస్త్ర్రాలను మాత్రమే ఉపయోగించేలా అందరిని మోటివేట్‌ చేస్తున్నారు. వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల వాడకం తగ్గించి వీలయినంత వరకు సైకిళ్ళను, ఎలక్ట్రికల్‌ వాహనాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ప్రతీ ఇంటిలో వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలలో ఇంటిపై కప్పుపై మొక్కలను పెంచడం, సోలార్‌ విద్యుత్‌ వాడకాన్ని ప్రోత్సహించడం లాంటి పనులను నిరంతరం చేస్తుంటారు. ప్రతీ ఇంటిలో చిన్న చిన్న అనారోగ్యాలకు ఉపయోగపడే విధంగా ఔషధ మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటారు. తన చుట్టు ప్రక్కల

ఉండే ప్రతీ ఒక్కరికి తలలో నాలుకలా ఉంటూ కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. సురేష్‌ గుప్తా ఆలోచనలు నచ్చిన పలువురు వారిని ఆదర్శంగా తీసుకుని వారి బాటలోనే నడుస్తున్నారు.

పర్యావరణాన్ని ప్రకతిని కాపాడక పోయినట్లయితే మన తర్వాత తరం వారికి కలుషితమైన భూమి, నీరు, ఆహారం ఇచ్చినవాళ్ళం అవుతాం. అధికంగా క్రిమి సంహారక మందులు వాడటం వల్ల భూమి, పంటలు కలుషితం అయి పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ముసలితనంలో రావాల్సిన షుగర్‌, బిపి లాంటి వ్యాధులు చిన్నతనంలోనే సంక్రమిస్తున్నాయి. దీనికి తోడు మనం వాడే ప్లాస్టిక్‌ వ్యర్థాలు, భూమిలోను నీటిలోను కలవక జీవప్రాణులకు హాని చేస్తున్నాయి. ఎదో ఒక రోజు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుని కేవలం ఆరోజు మాత్రమే పర్యావరణ పరిరక్షణ, మన బాధ్యత గురించి మాట్లడుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరు దానిని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అప్పుడే స్వచ్ఛమైన పర్యావరణాన్ని భావితరాలకు అందించగలుగుతాం. గ్రామానికి ఒకరు సురేష్‌ గుప్తాలా ఆలోచిస్తే త్వరితగతిన స్వఛ్చభారత్‌, స్వచ్ఛ తెలంగాణ కల సాకారం అవుతుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి.