| |

చెట్లు పిట్టలు గుట్టలు… సూస్తేనే కండ్ల సంబురం

enneela– అన్నవరం దేవేందర్‌
పచ్చని ప్రకృతిని సూస్తే ఎవలకైనా కండ్ల పండుగ. పచ్చని చెట్లు ఊరి సుట్టు గుట్టలు, చెల్కలు, కంచెలు, వాగులు, చెర్లు, నదులు తీరొక్క పిట్టలను సూస్తే కడుపు నిండినట్టే అయితది. భూమి, గాలి, నీళ్ళు, మొగులు ఇవన్ని మనిషి పుట్టక ముందు పుట్టినయి. సకల జంతు జాలాలు ప్రకృతిలో మెదులుతాయి. కని ఈ మనిషి మాత్రం ప్రకృతిని వికృతం చేస్తుండు. అడవులను నాశనం చేసిండు, చెట్లను నాశనం చేసిండు, గుట్టలను కూడా నాశనం చేస్తుండు. గందుకే వానలు సక్కంగ పడుతలేవు భూమి మీద. ముప్పై ఒక్క శాతం ఉండాల్సిన అడవులు ఇరువై ఒక్కశాతమే ఉన్నయి. ఇగ ఉబ్బర పొయ్యదా! ఎండలు మండిపోవా.. వానలు అస్తయా! రావు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. అయిన ప్రకృతికి వికృతమయిన పనులు చేస్తున్నడు. చెట్లు అడవులు పురాగపోయినంక ఊర్లల్లకు కోతులు కొండెంగలు వస్తన్నయి. మల్ల మనిషి సక్కంగ జీవునం గడవాలంటే చెట్లను పెంచాలె లేకుంటే మనుగడలేదు. చెట్లతోనే మనిషికి సోపతి. ప్రకృతిల ఉండే సకల జీవరాశులతోనే మనిషి నడవడి. పైసకు ఎగవడి మనిషి పురాగ శెడి పోతండు ఎన్కటి నుంచి ఎన్ని చెట్లను కొట్టినం, ఎన్నిచెట్లను నరికినం, ఇప్పుడు అవ్వే చేతులతోనే ఊరూరిల మొక్కలు నాటాలె, మొక్క మొక్కకు నీళ్ళు పొయ్యాలె, మొక్క ఎనుగునాటాలె, ఇగ చెట్లను పెంచుకుంటే వానలు రావు ఊల్లెకు కోతులు పోవు, కొండెంగలు పోవు. గందుకే ఇప్పుడు ఊర్లు వాడలన్ని పచ్చని చెట్ల కోసం తండ్లాడ్తన్నయి.

చెట్లకు మానవునికి విడదీయరాని బంధం ఉన్నది. చెట్ల కిందికి వంటలకు పోయే ఆచారం ఉన్నది. శ్రావణ మాసంల ‘చెట్లల్లకు పోవుడు’ లేదా ‘వండుక తిన పోవుడు’ లేదా ‘వంటలకు’ వనభోజనాలకు, పోవుడు అనే సంప్రదాయం ఇప్పటికీ ఊర్లల్ల కొనసాగుతంది. నిజానికి ఊర్లల్ల ఎవుసం చేసుకునేటోల్లు ఎక్కువ మంది ఒక పూట బాయికాన్నే అన్నం తింటరు. పెనిమిటి పొద్దుగాలనే ఎడ్ల కొట్టుకొని నాగలి దున్నకపోతె, అంబటాల్ల వరకు ఆ ఇంటామె గంపల సద్దిగిన్నె సల్ల తొక్కు అన్ని పట్టుకపోతది. ఆయన దున్నుడు అయినంక అక్కన్నే యాపశెట్టు కింద మయ్యర మయ్యర తింటడు మస్తు ఆకలి ఉంటది. చేన్ల మధ్యల బువ్వ తింటే మస్తు అన్పిస్తది. అక్కడ అట్ల అన్నం తినే అలవాటు ఉండనే ఉన్నది. ఆ ఎవుసం కాన్నే ఇంటామె సుత తిని గిన్నెలు కడుక్కుంటది ఇది నడుస్తున్న ముచ్చటనే. ఇక చెట్లల్లకు వంటలకు పోవుడు అంటే ఆ ఊరువాడోల్లు లేకపోతె కులపోల్లు అనుకోని ఓ యాట పిల్లను పట్టుకొని పోతరు. బాయిలకాడికి లేకుంటే మామిడి తోటలల్లకు పోయి అక్కన్నే గొర్రెపోడేలు కోసుకుంటరు. ఎవలకువాల్లు ఒగలు మూడు రాళ్ళు తెచ్చి పొయ్యి పొందిస్తరు. ఇంకొకలు కట్టె పిడ్క ఏరకస్తరు. కొందరు కూరగాయలు కోసుడు, చింతపడునాన పెట్టుడు చేసి జర వంట మంచిగ వండచ్చినోల్లు ఇద్దరు కల్సి కూర పొయ్యిమీద ఏస్తరు. అన్నం తయారు చేస్తరు. ఇంక కొందరు పెద్ద మనుషులు గౌండ్లాయనకు ముందే చెప్పి ఉంచి కల్లు తెప్పిస్తరు. ముందుగాల ఆడ కొబ్బరి కాయ కొడుతరు. ఇవన్ని సామానులు తీసెకవచ్చే గంపలకు సున్నంతోని పుదిస్తరు.

ఇట్ల వంటలకు పోతండ్రు అంటే బిడ్డలను అల్లుండ్లను, మనుమలను మనుమరాండ్లను, మ్యానత్తలను మామలను, మ్యాన మామలను సుత పిలుస్తరు. యాటను కోస్తన్న, చెట్లల్లకు వంటలకు పోతన్నం అని చెప్పి పంపుతె అందరు వస్తరు. అదొక పండగ పబోజనం లెక్క నడుస్తది. ఎన్కటి కాలం ఎటు పోయినా ఎడ్ల బండి మీదనే పోయేది. ఆ బండికే యాట పిల్ల పగ్గంతోని కట్టుకొని నడిపిచ్చుకపోయేది. చెట్ల కింద శ్రావణంల వాతావరణం మంచిగ ఉంటది. అందరు కూసోని ఇస్తార్ల తినేది. అక్కన్నే మోత్కు చెట్లకు ఆకులు తెంపుకచ్చి ఇస్తార్లు కుట్టి అండ్ల బువ్వ తినుడు ఒక అనుభవం. మోత్కాకు దొప్పల్ల కల్లు తాగడం మరొక అనుభవం. చెట్లల్లకు యేటేట పోవుడే. అన్నం తిన్నంక పిల్లగాండ్ల తోని గుట్టలు ఎక్కుడు దిగుడు కంచెలల్లకు పోవుడు, బాయిల మోటర్‌ నడువంగ పడే నీళ్లదారకు మూతి పెట్టి తాగుడు, ఇదంత పచ్చ వాతావరణం. కల్తీలేని గాలి, కల్తీలేని కలివిడి తనం.

గుట్టలు, ఒర్రెలు, వాగులు, ఏనెల దగ్గర ఉన్నవాటిని సూస్తే అదొక అందమైన అనుభూతి. కొంచెం పెద్ద గట్లల్ల నెమల్లు, కొంగలు, కుందేల్లు, కంజులు కన్పిస్తయి. మనుషుల అలికిడికి అటూ ఇటూ పోతయి. పిట్టలకైతే కొదువే లేదు కర్రెపిట్టలు, బుర్కపిట్టలు, కాకులు, గద్దలు, కొంగలు, పాల పిట్టలు, ఊరవిష్కలు, రామచిలుకలు ఇవన్ని కండ్ల ముందు అడవిల తిరిగే ప్రకృతి. గుట్టల కున్న రాళ్ళు, గుట్టల నెరిసిన దేవుళ్ళు అండ్లల్లి వచ్చే నీళ్ళ ధారలు, ఊట చెలిమెలు అదొక ప్రకృతి రమణీయత అట్లనే వాగుల నీళ్ళు పారుతాంటే పక్కకు కూసొని సూస్తే గమ్మతిగ వినిపించే సప్పుడు, ఎదురెక్కే శాపలు, చెర్ల తిరిగే ఎండ్రికాయలు, తాబేళ్ళు, కొర్రమట్టలు, జల్లలు నీళ్ళల్ల తిరుగుతూ కనువిందు చేస్తయి.

చెర్లు నిండాలెనన్నా, వాగులు పారాలనన్నా, మత్తడి దునుకాలెనన్న నీళ్ళే ప్రధానం. నీళ్ళు కావాలంటే వానలు రావాలె, వానలు రావాలంటే చెట్లు పెరుగాలె చెట్లను పెంచాలె. చెట్ల మీద ప్రేమ పెరుగాలె. కొన్ని చోట్ల ఇంటి కాడ ఈ చెట్టు ఉండద్దు ఈ మూలకు పెద్ద చెట్టు పెరగొద్దు, చెట్ల ఏర్లు గోడను పగులగొడుతయి అని మూఢ నమ్మకాల దీర్ఘాలు తీస్తరు ఇవి ఎన్కటలెవ్వు నడుమనే పుట్టినయి. అన్ని చెట్లు అంతట పెట్టుకోవచ్చు ఇంటి ముందల ముప్పై ఏండ్ల యాపచెట్టు ఉంటె ఎన్నో ఏసిలు పెట్టుకున్నా రాని సల్లదనం వస్తది. మల్ల దాని ఇత్తులతోని పర్యావరణంకు అనుకూలమైన పెంట తయారు అయితది.

ఇంటికి అవసరమైన చెట్లను కొట్టుకుంటే ఏం పోదు. అట్లనే ఇంటి, ఊరి అవసరానికి అక్కెరున్న ఉసికె తెచ్చుకుంటే వాగులకు ఏం కాదు కాని అదే పని చెట్ల కలప వాగు ఉసికె పట్నాలకు అమ్ముకుంటేనే పర్యావరణం దెబ్బతింటది. గుట్టలు కూడ లక్షల సంవత్సరాల కింద పుట్టినయి అవ్వి సుత అట్లనే కాపాడుకోవాలె. మనిషంటేనే ప్రకృతి సోపతిగానిగ బతకాలె. ప్రకృతిలో మమేకమవ్వాలె. ప్రకృతి చెట్టు చేమా పుట్ట గుట్టలతోనే మన పండుగలు సంస్కృతి ముడిపడి ఉన్నది.

మనిషి ప్రకృతిని నాశనం పట్టిస్తే ప్రకృతిలో ఓజోన్‌ పొర కరిగి మానవాళికి ఉపద్రవం తెస్తది. చెట్టు, గుట్ట, పుట్ట, వాగు వంక వరద పిట్ట ఇవన్నీ మానవుని స్నేహితులు. ఇవ్వి ధ్వంసం అయినందునే ఇప్పుడు ఊరూరికి ‘హరితహారం’ చేస్తన్నం.