జనవికాసం మెండుగ ‘వికారి’ ఉగాది పండుగ

‘ప్రభవ’ మొదలుకొని కొనసాగే భారతీయుల సంవత్సర కాలమానంలో 33వ స్థానాన్ని ఆక్రమించిన సంవత్సరం ‘వికారి’. ‘వికారి’ అనే పేరును వికృతం అని కాకుండా, విశేషంగా లాభకారిగా అన్వయించుకోవాలి. కాలం మార్పుకు సంకేతం. దిన దినానికి కొత్తదనం సంతరించుకోవడమే కాలరహస్యం. కాలచక్ర భ్రమణంలో కల్పాలూ, యుగాలే బిందువులైనప్పుడు, సంవత్సరాలు, మాసాలూ ఎంత స్వల్పమైనవో ఊహించుకోవచ్చు.

డా|| అయాచితం నటేశ్వర శర్మ
ఉగాది నుండి ఆయా దేవతలకు వసంత నవరాత్రోత్సవాలను కూడా జరపడం సంప్రదాయం. విశేషించి శ్రీరామ నవరాత్రోత్సవాలు ఈ శుభదినాననే ప్రారంభమౌతాయి.

సూక్ష్మం నుండి మొదలుకొని బ్రహ్మాండం దాకా అనేక కాలగణనలున్నాయి. భూమిపై ఉన్న మానవాళికి సంబంధించిన కాలమానం ఇతరలోకాలకు వర్తించదు. పృథివీ కాల మానం ప్రకారం ప్రభవ నుండి అక్షయదాకా సాగే అరవై సంవత్సరాలను ఒక చక్రంగా భావిస్తారు. ఇలాంటి చక్రాలెన్నో ఈ భూమిపై గడిచిపోయాయి. ఇకపై రాబోతున్నాయి. కాలం అనంతం, కనుక వీటిని లెక్కించడం మానవాళికి సాధ్యం కాదు.

ప్రాచీన కాలం నుండి ప్రకృతిలో వికాసానికి మూలమైన వసంతరుతువుతోనే మానవాళికి సంవత్సర కాల గణనం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘వికారి’ నామ సంవత్సరం ప్రకృతిలో ప్రవేశిస్తున్నది. వసంతం వికాసానికి మూలం. జీవితం కూడా వసంతంలా నిత్యనూతనం కావాలని మనిషి కోరుకుంటాడు. చిగుళ్లు వేస్తున్న చెట్లను చూసి మురిసిపోతాడు. చెవులకు ఇంపుగా వినబడే కోకిలకూతలు విని మైమరచిపోతాడు. అభ్యుదయకరమైన మార్పు తన జీవితంలో రావాలని ఆశిస్తాడు. అలాంటి ఆశలకు ప్రతిరూపమే ఉగాది పండుగ. ‘యుగాది’ అనే పేరు వాడుకలో ఉగాదిగా మారింది. సంవత్సరారంభ దినాన్ని పంచాంగ పరిభాషలో ‘యుగాది’ అనడం సంప్రదాయం. ‘యుగాది’ అందరికీ పర్వదినం.


ఉగాదినాడు ప్రభాతవేళలో తైలాభ్యంగనం (తలకు నూనెను అంటుకోవడం)తో కూడిన మంగళస్నానం చేయాలని సంప్రదాయం చెబుతోంది. ఇలా చేయడం వల్ల శరీరానికీ, మనస్సుకూ ఉల్లాసం కలిగి,

ఉత్తమాలోచనలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ మంగళస్నానం చేయకుంటే నరకలోకం సంప్రాప్తిస్తుందని కూడా శాస్త్రం చెప్పింది. మంగళస్నానానంతరం కొత్త బట్టలు ధరించాలి. ఇష్టదేవతలను ఆరాధించాలి. తీర్థ, క్షేత్ర, దేవాలయాలను దర్శించాలి. పెద్దలూ, గురువుల ఆశీస్సులు తీసుకోవాలి. ఉగాది నాడు భగవంతునికి నివేదనగా ఆరు రుచుల పచ్చడిని చేస్తారు. వసంతకాలంలో వేపచెట్టు చక్కగా పూత పూస్తుంది. ఈ పూత చాలా ఆరోగ్యదాయకం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

‘యద్వర్షాదౌ నింబసుమం / శర్కరామ్లఘృతైర్యుతమ్‌

భక్షితం పూర్వయామే స్యాత్‌/ తద్వర్షం సౌఖ్యదాయకమ్‌ ‘

సంవత్సరాది అయిన ఉగాది నాడు చక్కెర, లేదా బెల్లం, మామిడి ముక్కలు, నెయ్యి మొదలైన పదార్థాలను కలిపి, వేప పూతతో చేసిన పచ్చడిని ఎవరు స్వీకరిస్తారో వారికి సంవత్సరకాలం అంతా ఆయురారోగ్య సౌఖ్యాలను ప్రసాదిస్తుందని తాత్పర్యం. ‘నింబకుసుమం’ అంటే వేపపూత. పంచాంగాలలో ఉగాది నాడు ‘నింబకుసుమ భక్షణం’ చేయాలనే సూచన ఉంటుంది.

ఉగాది నాడు చేయవలసిన మరొక కర్తవ్యం ‘పంచాంగ శ్రవణం! పంచాంగంలో కాలాన్ని అయిదు భాగాలుగా విభజించి లెక్కించడం కనబడుతుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు పంచాంగాలు. ప్రతి దినం ఏ పని చేయడానికైనా ఈ ఐదింటిని పరిగణనలోనికి తీసుకోవాలని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. ఉగాది నాడు కాల శుద్ధి కోసం పంచాంగాలను పఠిస్తారు. పంచాంగ శ్రవణం వల్ల అనేక ప్రత్యక్ష, పరోక్ష లాభాలున్నాయని శాస్త్రం ప్రవచిస్తోంది.

‘శ్రీకల్యాణగునావహం రిపుహరం దుస్వప్న దోషాపహం

గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణామ్‌

ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతానసంపత్ప్రదం

నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్‌ ‘

పంచాంగం వింటే సకల సంపదలు లభిస్తాయి. సమస్త మంగళాలూ ప్రాప్తిస్తాయి. ఎన్నో గుణాలు దరిజేరుతాయి. శత్రువుల బాధలు తొలగిపోతాయి. చెడుకలలు దూరమౌతాయి. గంగానదిలో స్నానం చేసినంతటి పుణ్యం లభిస్తుంది. విశేష ఫలితాలు కలుగుతాయి. గోవులను దానం చేసినంతటి పుణ్యం లభిస్తుంది. ఆయుష్యం పెరుగుతుంది. మనస్సు నిర్మలమౌతుంది. సంతానం లభిస్తుంది. ఐశ్వర్యాలు సమకూరుతాయి. ఎన్నో పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. కనుక ఉగాది నాడు ఎంతో యుక్తమైన పంచాంగ విషయాలను తప్పక వినాలి. మనిషి తనకు శ్రేయస్సు కలగాలని నిత్యం కోరుకుంటాడు కనుక అతడు తప్పకుండా ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసి, అన్ని లాభాలూ పొందాలని పెద్దలమాట.

ఉగాది ఎండలు మండే కాలంలో వస్తుంది కనుక దాహార్తులైన జీవులకోసం చలివేంద్రాలను పెట్టి జలదానం చేస్తే అపార పుణ్యం లభిస్తుంది. ఈ దినాన చేసే అన్ని దానాలూ దాతలకు అపారపుణ్యాన్ని అందిస్తాయి.

ఉగాది నుండి ఆయా దేవతలకు వసంత నవరాత్రోత్సవాలను కూడా జరపడం సంప్రదాయం. విశేషించి శ్రీరామ నవరాత్రోత్సవాలు ఈ శుభదినాననే ప్రారంభమౌతాయి. ఉగాదినాడు కవి కోకిలలు వసంతానికి మైమరచి, మధుమాసానికి స్వాగతం చెబుతూ కవితాగానాలు చేయడం సంప్రదాయం. కమ్మని పాటలతో కోకిలలు చెవులకు ఇంపును కలిగించినట్లే, మధురకవితా గానాలతో కవులు కవి సమ్మేళనాలలో పాల్గొంటూ, నూతనానుభూతిని పొందుతారు.

యజుర్వేదంలోని తైత్తిరీయ బ్రాహ్మణంలోని ఒక మంత్రంలో వసంతావిర్భావ సమయ ప్రస్తావన ఇలా ఉన్నది –

‘వసంతేనర్తునా దేవాః / వసవస్త్రివృతా స్తుతమ్‌

రథంతరేణ రజసా / హవిరింద్రే వయో దధుః’

ఈ మంత్రాన్ని అనుసరించి వసంతావిర్భావ సమయంలో దేవతలు సైతం ఇంద్రుణ్ణి స్తుతిస్తూ రథంతరావృత్తంలో స్తుతించారనీ, హోమంలో హవిస్సులను అర్పించారనీ తెలుస్తోంది.

ఆధునిక కవులు సైతం వసంతావతార సమయాన ఉగాది వేళ ఉప్పొంగిన హృదయంతో –

‘నా మానసమందేదో

ఆమని కాలిడె వినూతనానందముతో

ఏమని పాడెద కవితా

శ్రీమోహన రాగరసపరిప్లుత గీతుల్‌’

ఈ వాసంతము నా హృదంతరమునందెన్నెన్ని గీతాలకో

ఆవాసమ్ముగ నిల్చి జీవికను దివ్యానంద సందోహధీ

రావేశమ్మున ముంచి పద్యరచనా వ్యాసక్తినింబెంచి, కా

వ్యావిష్కార రసమ్మునించి, పరమాహ్లాదమ్ము పండించెరా !’

-(ఋతుగీత)

అని ఉగాది వైభవాన్ని కొనియాడారు.

మనిషి ఎప్పుడూ కొత్త దనాన్ని కోరుతాడు. తన జీవితం మూడు పూవులూ, ఆరు కాయలుగా విస్తరించాలని ఆకాంక్షిస్తాడు. కొత్త అడుగులు వేయడానికి ప్రయత్నిస్తాడు. కనుక మనిషి కోరే నిత్య నూతనత్వాన్ని ఉగాది పండుగ సార్థకం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.