|

జలావిష్కరణ

tsmagazine

నిట్ట నిలువ నీడలేక
పొట్ట చేతపట్టుకోని
బతుకు దెరువుకై ఊరిడ్సినోళ్ళం
కపిస్కెడు నీళ్ళకై
రందిపడి కోర్టు కెక్కినోళ్ళం
బతుకడమే హక్కుగా
అనంత త్యాగాలతో మట్టిపాలైనోళ్ళం!

ఈ నేలన
చెదలు పట్టిన ఏ మొద్దునడిగినా
కరువు గోసల్ని,పన్నిన మోసాల్ని
నడిపిన ద్రోహాల్ని
కుండలు కుండలుగా ఎత్తిపోస్తది
నోటికి బువ్వే కాదు
తాగునీళ్ళను
దక్కనియ్యని వలస కంసుల పాలన

పగుల్లిచ్చిన నేలన
ప్రాజెక్టు మొగులు కందుతున్నది
గోదావరి పొడవూ జలాశయం
లక్షల ఎకరాల సాగు తాగు నీరు
ఏడాది పొడవునా నిల్వ నీళ్ళు
తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం
మహాద్బుతం కాళేశ్వరం

పలుగు పార భుజాన పెట్టి
యుద్ద కావడిని దించని సైనికుల్లా
ఇంజనీర్లు టెక్నిషియన్లు ఆపరేటర్లు కార్మికులు…
కరువు కాలం మీద నడుస్తున్న చరిత్ర
నేల తడి నవ్వులకై

పొద్దును నిలబగట్టి….
మండే ఎండల్ల మూడు షిప్టులు పని…
ఊహాల కందని అండర్‌ టన్నెల్‌ సర్జ్‌పూల్‌
మహాత్తర నిర్మాణంలో భాగస్వాములై ఉప్పొంగుతున్న జన హదయాలు …
సూర్యచంద్రులే బిత్తరపోతున్నారు

ఏ కాలమైనా ఆకుల్లా రాలిపోవొద్దు
విత్తనాలై మొలకెత్తాలి
చిత్తుకాగితాల్లా విసిరేయబడొద్దు
చారిత్రులమై నిలువాలి
నీటిని నిలబెట్టుకోవడం
జీవితాన్ని నిలబెట్టుకున్నట్లే

కాళేశ్వరం పుట్ట బంగారమై
నీటి నిర్మాణానికి కొత్త అడుగులు
కాలాన్ని నిలబెట్టే కొత్త జలావిష్కరణలతో
కాళేశ్వరాన్ని
జాతీయ జెండగా ఎగురేస్తున్నది!

ప్రతి చెరువు
పాల సముధ్రమై పొంగాలి
ప్రతి మడి
వరి గొలుసులతో బొడ్డెమ్మలేయాలి
ప్రతి కుండ
బువ్వ కుండై ఉడుకాలి
ప్రతి గడప బోనమై ఎల్లాలి
ప్రతి గుండె పండుగై నవ్వాలి !

వనపట్ల సుబ్బయ్య