|

జిల్లాలకు ఐటీ

it-ktrఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కేవలం రాజధానికే పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తున్నామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఆగస్టు 18న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌, హుజూరాబాద్‌లో తెలెకా సంస్థలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లాలో 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు, మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఉండడంతో అందులో చదువుకునే వారికి ఉద్యోగావకాశాల కోసం జిల్లా కేంద్రంలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కరీంనగర్‌లో మార్క్‌ఫెడ్‌ పరిధిలో ఉన్న స్థలాన్ని కేటాయిస్తే అందులో ఐటీ పార్కు ఏర్పాటుచేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఐటీ శాఖ నుంచి నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఐటీ రంగం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వరంగల్‌లో 1800 మందికి, జనగాంలో 60 మందికి, ప్రస్తుతం కరీంనగర్‌, హుజూరాబాద్‌లో 260 మందికి ఐటీ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించామన్నారు. త్వరలో నిజామాబాద్‌లో ఐటీ సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పాలసీలలో రూరల్‌ టెక్నాలజీ అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు కేటీఆర్‌.

రానున్న రోజుల్లో డిజిటల్‌ లిటరసీ కీలక పాత్ర పోషించనుందని, దీని ద్వారా ఇప్పటికే లక్ష మందికి శిక్షణనిచ్చామని, ప్రస్తుతం హైదరాబాద్‌లో మరో 5వేల మంది బ్యాచ్‌ శిక్షణ ముగింపు దశలో ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి కుటుంబాలు ఉండగా, కనీసం ఒక్కో కుటుంబం నుంచి ఒక్కరినైనా డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రెండేండ్లలో మిషన్‌ భగీరథతో పాటు ఫైబర్‌ గ్రిడ్‌ కూడా పూర్తి చేసి ఇంటింటికి ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.