జీవన సౌందర్యం

tsmagazine
ఆయన బొమ్మగీస్తే ఎవ్వరైనా ఒకసారి ఆగి చూడవలసిందే. ఆ బొమ్మలలో బంతిపూల్లాంటి గ్రామీణ సౌందర్యం తొణికిసలాడుతుంది. మరీ ముఖ్యంగా పల్లెపడతుల అమాయకత్వానికి, అందానికి, నిత్య జీవితానికి అవి అద్దం పడతాయి. ఒక్కమాటలో – అవి వారి జీవనశైలికి నిలువెత్తు ప్రతిబింబాలు.

అసలు ఆ చిత్రకారుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు – ఆగయ్య. ఆయనలోని ‘కళ’ను గుర్తించిన గురువు పెట్టిన పేరు – ఆగాచార్య. నిజానికి ఆయనను ‘ఆగాచార్య’ అని పిలిచినా, ప్రవృత్తిరీత్యా ఆగిపోకుండా సాగిపోవడం ఆయన తత్వం.

ప్రకృతికి ప్రతిరూపాలు పడతులు. మరీ ముఖ్యంగా గ్రామీణ మహిళలు కాబట్టి వారి చిత్రాలు వేయడంలోనే తన జీవితకాలం సాగిపోయిందనీ, ఇటీవలి కాలంలో ప్రకృతికి తోడు పురుషుడు ఉండి తీరాలని-జంటల చిత్రాలు గీస్తున్నానని ఆగాచార్య అన్నారు. త్వరలో న్యూఢిల్లీలో నిర్వహించాలనుకుంటున్న వ్యష్టిచిత్రకళా ప్రదర్శనకు సుమారు పాతిక-ముప్ఫై చిత్రాలు వేసే నిరంతర సాధనలో ఆయన ఉన్నారు.
tsmagazine

తొలి రోజులలో 1969లో కథలకు, కవితలకు కమనీయ చిత్రాలు వేయడం వల్ల పలు వార, మాస పత్రికల పాఠక జనానికి ఆగాచార్య పరిచయమయ్యారు. చూడచక్కని చిత్రాలు వేస్తున్నందున అనంతరకాలంలో ఆయా పత్రికల నిర్వాహకులు పండగలు-పబ్బాల సందర్భంగా కోరికోరి ఆగాచార్యతో ముఖ చిత్రాలు వేయించుకున్నారు. దాదాపు వేయిమంది రచయితలు, కవులు తమ గ్రంథాలకు స్ఫూర్తిదాయకమైన ముఖ చిత్రాలు గీయించుకున్నారు. ఒక వారపత్రికలో చిత్రకారుడుగా చేరమని ఎంత ఒత్తిడివచ్చినా, తన మిత్రులకు చెప్పి చేర్పించాడు తప్ప, తాను ముప్ఫైఐదు సంవత్సరాలపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చిత్రకళ బోధించే అధ్యాపకుడుగా కొనసాగి ఎందరో యువ చిత్రకారులను తయారు చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసినందున వేసవి సెలవుల్లో మనమలు, మనుమరాండ్రలను చెంత కూర్బోబెట్టుకుని, రేఖలు గీసే పద్ధతి, రంగులు అద్దే తీరు తెన్నులు శ్రద్ధగా నేర్పుతూ తన కుతి తీర్చుకుంటున్నాడు. తన చిన్నతనంలో బ్రష్‌ కొనలేక స్వంతగా తయారు చేసుకుని, రంగులను డబ్బులు లేక పద్మశాలీలువాడే రంగులు అడిగి తెచ్చుకుని బొమ్మలు వేసిన పరిస్థితి ఈనాడు లేదని, పిల్లలకు అన్నీ అందుబాటులో ఉన్నాయని సంతృప్తిపడ్డారు. తాను ఉద్యోగ విరమణ చేసి, పూర్తి సమయం చిత్రకళా రంగంలోనే గడపాలని ఉవ్విళ్ళూరుతున్న తరుణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉన్న సహధర్మచారిణి ఆకస్మికంగా కన్నుమూయడంతో ఆగాచార్య ఆగమాగమైపోయాడు. ఆయన చిత్ర రచన ఆగిపోయింది. అనారోగ్యంతో ఆసుపత్రులచుట్టూ తిరగవలసి వచ్చింది. తిరిగి ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం ఏదో పనిలో నిమగ్నం కావాలనీ, సహజంగా మీరు చిత్రకారులు కాబట్టి ఆ చిత్ర లేఖన విద్యనే కొనసాగించమని డాక్టర్‌ సలహా ఇచ్చారు.
tsmagazine

డాక్టర్‌ మాటమీద పూర్తిస్థాయిలో చిత్రకారుడై తైలవర్ణచిత్రాలు వేయడం ప్రారంభించాడు. సాంకేతికపరమైన వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం క్యాన్వాస్‌పై ఆక్రాలిక్‌ చిత్రాలు గీస్తున్నాడు.

ఆగాచార్య చిత్రాల్లోని మహిళలు-తెలంగాణ ప్రాంతంలోని మహిళలను చిత్రించడంలో తమ ముద్రవేసిన సుప్రసిద్ధ చిత్రకారులు-కాపు రాజయ్య, తోట వైకుంఠం, ఏలె లక్ష్మణ్‌ చిత్రాలకంటే భిన్నంగా ఉన్నాయి. ఆగాచార్య చిత్రించే స్త్రీలకు అంతగా అలంకరణలు-నిండుగా ఆభరణాలు ఉండవు. అవి సాదాసీదా చిత్రాలు. అప్పుడప్పుడు ఆడపడతులతో, చిలకలు, నెమళ్ళు, ఆట బొమ్మలు ఉంటాయి. ఏ చిత్రం వేసినా ఆ వస్తువు-ఆయన జ్ఞాపకాల్లోంచి ఉట్టిపడేదే.

కరీంనగర్‌ జిల్లా గట్టు బూతుకూరులో పాలోజు వీరయ్య-రమ దంపతులకు ఏడు దశాబ్దాల క్రితం జన్మించిన ఆగాచార్య స్వంతూరులో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. ఆయన రెండో తరగతిలో ఉన్న రోజులలోనే చక్కని చిత్రాలు వేయడం గమనించిన ప్రధానోపాధ్యాయుడు-నారాయణరావు ‘ఆగయ్య-నీ పేరు’ ఆగాచార్య’గా మార్చుతున్నాడన్నాడంట.
tsmagazine
ఆనాటినుంచి ఆగాచార్య అయిపోయాడు. ఐదవ తరగతినుంచి అక్కడికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వెదిరెకు ప్రతి రోజు నడిచివెళ్ళివస్తూ ఎనిమిదో తరగతివరకు చదివాడు. తొమ్మిదినుంచి కరీంనగర్‌లో బహుళార్థసాధకోన్నత పాఠశాలలో చదివాడు. అక్కడ డ్రాయింగ్‌ టీచర్‌ కడార్ల శేషయ్య ఆగాచార్య చిత్రకళాభిరుచి చూసి, స్కూల్‌ ఫైనల్‌ పూర్తి కాగానే ఒకే యేడాది సాంకేతిక విద్య శిక్షణ బోర్డువారి లోయర్‌, హయ్యర్‌ డ్రాయింగ్‌ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడయ్యాడు. మరుసటి యేడాదే 1970లో డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడుగా ధర్మపురిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. అక్కడినుంచి వేములవాడ ఎలగందల, మానకొండూరు, దుర్సేడులాంటి చోట్ల ఉద్యోగం చేసి, అనేక చోట్ల మహిళల తీరుతెన్నులను గమనించి తెలుగు మహిళలను అపురూపంగా తీర్చిదిద్దాడు. ఈ మధ్యకాలంలో కర్నాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంనుంచి ఎం.ఎఫ్‌.ఏ. పూర్తి చేశాడు.

డిగ్రీల ప్రమేయం లేకుండా- తెలంగాణ మహిళను ఆగాచార్య అపురూపంగా చూపాడు. 1978లోనే జాతీయ సమగ్రతపై త్రివేండ్రం, ఆ తర్వాత యేడాది బెంగుళూరులో నిర్వహించిన శిబిరాలలో పాల్గొని తన ధోరణి చిత్రాలను పరిచయం చేశాడు. అనంతర కాలంలో అనాథలు, హుదూద్‌ తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన చిత్రకళా శిబిరాలలో పాల్గొని చక్కని చిత్రాలువేసి, వాటి అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ము వారికి అందేందుకు దోహదం చేశాడు.

ఇవి కాకుండా ఆగాచార్య 2011 నుంచి సుమారు నలభై సమష్టి చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొని తన సత్తా చాటాడు. వాటిలో తైవాన్‌లో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన చెప్పుకోదగింది. వారి చిత్రాలుచూసి కళా హృదయులు మంత్రముగ్ధులయ్యారు. ఇవికాకుండా వర్ధమాన చిత్రకారుడు విఠల్‌తో కలిసి ఒకసారి, భాస్కరరావుతో కలిసి మరోసారి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసిన ఆగాచార్య రెండు పర్యాయాలు గ్రామీణ యువతుల జీవనశైలికి దర్పణం పడుతూ రెండు పర్యాయాలు వ్యష్టిచిత్రకళా ప్రదర్శనలు నిర్వహించి హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంటనగరాల కళా ప్రియులకు కనువిందు చేశారు.

tsmagazine   tsmagazine

1989లోనే జిల్లాస్థాయిలో ఉత్తమ చిత్రకళ ఉపాధ్యాయుడుగా అవార్డు పొందిన ఆగాచార్యను 2017లో ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ అవార్డు వచ్చింది. 2018లో వారి చిత్రానికి కోనసీమ చిత్రకళా పరిషత్‌ భారత్‌ కళారత్న అవార్డు ప్రదానం చేసింది.

శరీర అవయవ నిర్మాణం గమనించి కళాత్మకంగా చిత్రాలు గీసే ఆగాచార్యతో కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లాంటి జాతీయ నాయకుల చిత్రాలు వేయించుకున్నది. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ భారత పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు, ఏపీ శాసనసభ పూర్వ స్పీకర్‌ శ్రీపాదరావు, పూర్వ మంత్రి జె. చొక్కారావు చిత్రాలు వీరితో వేయించుకుని కార్యాలయంలో అలంకరించుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కార్యాలయంలోనూ ఆగాచార్య వేసిన ‘బతుకమ్మ’ చిత్రాన్నే అలంకరించారు.

tsmagazine
ఇవ్వాళ తన చిత్రకళకు ఇంత పేరు వచ్చినా-తాను నిత్య విద్యార్థిననీ, ఎప్పటికప్పుడు కొత్తకొత్త కోణాలలో కట్టూ-బొట్టూ ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ ఊపిరున్నంతకాలం జీవన సౌందర్యంగల చిత్రాలు గీస్తూనే ఉంటానని ఆగాచార్య ఎలుగెత్తి చెబుతాడు.

టి. ఉడయవర్లు