డిప్యూటీ సి.ఎం కడియం శ్రీహరి

డిప్యూటీ-సి.ఎం-కడియం-శ్రీహరి20ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తన మంత్రివర్గంలో స్వల్పమార్పులు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా వైద్య, ఆరోగ్యశాఖలను నిర్వహిస్తున్న డాక్టర్‌ టి. రాజయ్యను జనవరి 25న మంత్రివర్గంనుంచి తొలగించారు. అదేరోజున, కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు.

జనవరి 25న రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కడియం శ్రీహరి చేత మంత్రిగా గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన మంత్రిర్గ సహచరులు హాజరయ్యారు.

తాజా పరిణామాల నేపథ్యంలో కొందరు మంత్రుల శాఖలలోకూడా ముఖ్యమంత్రి కొద్దిపాటి మార్పులు చేశారు.
కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించి, విద్యాశాఖను ఆయనకు కేటాయించారు. అప్పటివరకు విద్యాశాఖమంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి విద్యుత్‌శాఖను అప్పగించారు. అప్పటివరకు విద్యుత్‌శాఖ మంత్రిగా వున్న డాక్టర్‌ లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో అవినీతి జరిగినట్టుగా నిర్లక్ష్యం వహించడంవంటి కారణాలదృష్ట్యా, ఆ శాఖలో కొందరు అధికారులపై వేటు వేయడంతోపాటు, ఆశాఖ మంత్రిగా ఉన్న రాజయ్యను మంత్రివర్గంనుంచి తొలగించారు. ఎట్టి పరిస్థితులలో, ఎంతటివారైనా అవినీతిని సహించబోనని అనేక సందర్భాలలో ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాటలకే పరిమితం కాకుండా చేతలలోకూడా ఆ విషయం నిరూపించారు.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి ప్రస్తుతం వరంగల్‌ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహి స్తున్నారు. ఆయనకు గతంలో ఎన్‌.టి. రామారావు, చంద్రబాబు నాయుడుల మంత్రివర్గంలో మంత్రిగా చేసిన అపార అనుభవం వుంది. తనకు ఇష్టమైన విద్యాశాఖను ముఖ్యమంత్రి కేటాయించడంపట్ల కడియం శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు. ఓ సైనికునిలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.