తరువు నా గురువు

– డా|| తిరునగరి

చెట్టును నరికినా
మళ్ళీ చిగురిస్తుంది
శాఖోపశాఖలుగా
మళ్ళీ విస్తరిస్తుంది
ఎత్తులకు ఎదుగుతుంది
ఎందరికో నీడనిస్తుంది
పరోపకారమే జీవన
పరమార్ధమంటుంది
పండ్లనిస్తుంది – కన్న తల్లిలా
ప్రాణులను దీవిస్తుంది
పరోపకారార్ధమిదం శరీరం
అని ప్రవచిస్తుంది.

మనిషి కన్నా
మానే నయమంటాను నేను
ఈ మనిషి
ఆ మానును చూచి
నేర్చుకోవలసింది
ఎంతో ఉందంటాను
మనిషి తనలా
ఎత్తులకెదగాలని
తల యెత్తుకొని
బ్రతకాలని
పది మందికీ నీడనివ్వాలని
పరోపకారంతో జీవితాన్ని
పండించుకోవాలని
మౌనంగా పాఠం నేర్పించే
పాదపానికి
ప్రణమిల్లుతాను నేను
తరువు
నా గురువు
తరువు నా హరుడు
తరువేరా అన్నింటికీ మూలము
తరువు విలువ తెలుసుకొనుట
మానవధర్మం.
మౌనంగా
పాఠం నేర్పించే
పాదపానికి
ప్రణమిల్లుతాను నేను