|

తాత్విక కవి పొట్లపల్లి రామారావు

tsmagazine

హైదరాబాద్‌ రాజ్యం నిజాం నిరంకుశ పాలననుండి విముక్తం కావడం కోసం పోరాటం చేసినవారిలో తెలంగాణ నుండి ఎందరో కవులు, కళాకారు లున్నారు. వారిలో వరంగల్లు ప్రాంతానికి చెందిన కాళోజీ నారాయణరావు, దాశరధి కృష్ణమాచార్య, పొట్లపల్లి రామారావు ముందు వరసలో ఉండి పోరాటాలు చేశారు. ఉద్యమ రచనలెన్నో చేశారు. ఈ ముగ్గురిలో నిజాం సర్కా రుచే అరెస్ట్‌ చేయబడి జైలు కెళ్లిన మొదటి బ్యాచ్‌కు చెందినవారు రామారావు.

1917 నవంబర్‌ 20న రామారావు వరంగల్లు సమీప గ్రామం తాటికా యలలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చెల్లమ్మ, శ్రీనివాసరావు. వీరిది భూస్వామ్య కుటుంబం. శ్రీనివాసరావు వ్యవహారదక్షులు. చుట్టూ పది గ్రామాలలో పలుకుబడి కలిగిన వ్యక్తి. వ్యవసాయరంగంలో నిష్ణాతులు. ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులచే మెప్పుపొందిన వ్యక్తి.

శ్రీనివాసరావుకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. రామారావు మూడో సంతానం. సకల సంపదలచే కళకళలాడుతున్న ఆ కుటుంబం శ్రీనివాసరావు హఠాన్మరణంతో ఆగమైపోయింది. సన్నిహితులే భూముల్ని ఆక్రమించుకున్నారు. ఇతర ఆస్తుల్ని కొల్లగొట్టారు. అప్పటికి రామారావు వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఏడవ తరగతి చదువుతున్నారు. కానీ తండ్రి మరణంవల్ల ఆయన చదువు ఏడవ తరగతితో ఆగిపోయింది. పై చదువులకై వరంగల్‌కో, హైదరాబాద్‌్‌కో వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఇక అప్పటినుండి తాను పుట్టిన గ్రామమే ఆయనకు బడి. పరిసరాలే గురువులు! చిన్నతనం నుండే రామారావులో ప్రత్యేక లక్షణాలుండేవి. ప్రకృతిపట్ల మక్కువ-కంచెలో (చిన్నపాటి అడవిలాంటిది), పండ్లతోటల్లో, చెరువు కట్టమీద, ఊరి పక్కవాగు ఒడ్డున, దగ్గరలో ఉన్నగుట్టమీదికెక్కి తిరుగుతూ, మబ్బుల్నీ, ఆకాశాన్నీ, పక్షుల్నీ, ఉభయ సంధ్యల్నీ చూస్తూ ఆనందించేవాడు.

రామారావు చిన్నతనంలోనే కులమతాల్ని, అంటరానితనాన్ని ఏవగించుకుని అందరిలో ఒకడిగా మెదిలేవారు. కృత్రిమమైన విలువల్నీ, గొప్పలని దులుపుకుని జీతగాళ్ళతో, పని మనుషులతో సమస్థాయిలో వర్తించేవారు.

సహజ జీవితపు వేలు పట్టుకుని కాలిబాటమీద నడిచివెళ్ళిన రామారావు కవిగాకుండా ఎట్లా ఉండగలడు? జీవితం ఆయనని గొప్ప కవిగా, రచయితగా మలిచింది. అంతేకాదు, ఆయనను ఒక తత్త్వవేత్తగానూ తీర్చిదిద్దింది. తెలంగాణా తాత్విక లోకానికి వెలుగులు పంచిన నక్షత్రం పొట్లపల్లి రామారావు.

ప్రచారానికి దూరంగా మారుమూల పల్లెలో జనసామాన్యంలో ఒకడిగా జీవిస్తూ అసంఖ్యాకంగా రచనలు చేసిన రామారావు తమ సమకాలీన సాహితీ వేత్తలచే అజ్ఞాత మహాకవిగా పిలిపించుకున్నారు.

రామారావు వివాహం పదహారేళ్ళ వయసులో తమ మేనమామ కూతురైన వెంకటనర్సమ్మతో జరిగింది. వీరికి ముగ్గురు కూతుళ్ళు, ఒక కుమారుడు.
tsmagazine

రామారావు బడి చదువులైతే ఏడవ తరగతితోనే ఆగిపోయాయిగానీ ఆయన గ్రంథ పఠనం మాత్రం జీవితపు చివరి రోజుల వరకూ సాగింది. వరంగల్లులోని ప్రసిద్ధ గ్రంథాలయాల్లోని గ్రంథాలన్నీ చదివారు.

హైదరాబాద్‌లో రెండేళ్ళపాటు ఉండి రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయంలోని గ్రంథాలన్నీ, హైదరాబాద్‌ స్టేట్‌ లైబ్రరీలోని గ్రంథాలన్నింటినీ చదివారు. ఈ క్రమంలోనే మాతృభాష తెలుగుతోబాటు ఉర్దూ, ఇంగ్లీష్‌, హిందీ, అరబ్బీ, పార్సీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. తెలుగులోనేకాక ఉర్దూలోగూడా కవిత్వం రాశారు. కవిత్వం, కథ, గల్పిక, నవల, నాటిక, లేఖా సాహిత్యం మొదలగు అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. ఇన్ని ప్రక్రియల్లో రచనలు చేశాడు గనుకనే ప్రముఖ కవి, విమర్శకులు టాల్‌స్టాయ్‌ వారసుడు పొట్లపల్లి రామారావు సాహిత్యంపై ఒక సమగ్ర విమర్శనా వ్యాసం రాసి పత్రికలో ప్రచురించారు.

కాళోజీ అన్నట్లు నజ్రుల్‌ ఇస్లాం సైనికుడిగా యుద్ధరంగానికి వెళ్ళి (1914 మొదటి ప్రపంచ యుద్ధంలో) కవిగా తిరిగివచ్చినట్లు రామారావు అని రామారావు స్వాతంత్య్ర సమరయోధుడిగా జైలుకు వెళ్ళి కవిగా తిరిగి వచ్చాడు 1939లో).

పొట్లపల్లి రామారావు కవిత్వాన్ని మొట్టమొదట దేశోద్ధారక గ్రంథమాల పక్షాన ‘ఆత్మవేదన’ పేరుతో వట్టికోట ఆళ్వారు స్వామి ప్రచురించారు. 1965లో మిత్రమండలి, హన్మకొండవారు ‘చ్కులు’ అనే చిన్న కవితా సంపుటిని ప్రచు రించారు. ఆ తర్వాత 1974లో కాళోజీ, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య కలిసి కె. సీతారామయ్య ఆర్థికసహా యంతో ‘చ్కులు’ అనే పెద్ద కవితా సంపుటిని ప్రచురించారు.

1974లోనే యువ భారతి, హైదరాబాద్‌వారు ‘చుక్కలు’ సంపుటిలోని కొన్ని కవితల్ని ఏరి ‘మెఱుపులు’గా ప్రచురించారు. ‘మెఱుపులు’ చిత్తు ప్రతిలోని ఒక కాగితం చదివి అబ్బురపడి ఒక అభిమాని ‘అక్షరదీప్తి’ అనే కవితా సంపుటికి ఆర్థికంగా సహకరించగా ప్రచురింపబడ్డది.
tsmagazine

రామారావు ప్రచురిత గ్రంథాలు- కవిత్వం (1) ఆత్మవేదన (2) చుక్కలు (3) మెఱుపులు (4) అక్షరదీప్తి (5) నాలోనేను.

వచనం : (1) జైలు కథలు (2) నాటికలు (3) నీలవేణి (అసంపూర్ణ నవల), (4) సైనికుడి జాబులు (5) గ్రామ చిత్రాలు

2001లో వి.ఆర్‌. విద్యార్థి సంపాదకత్వంలో తెచ్చిన ‘దిక్కులు’ వీడియో కవితా సంకలనం’లో వీరి కవితలు రికార్డు చేయడమైనది.

2012లో రామారావు సాహిత్యంపై పరిశోధన చేసిన భూపాల్‌రెడ్డి ఆ పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించారు. 2012లోనే భూపాల్‌రెడ్డి సంపాదకత్వంలో వీరి సమగ్ర సాహిత్యం రెండు సంపుటాలుగా పొట్లపల్లి వరప్రసాద్‌రావు ఫౌండేషన్‌వారు ప్రచురించారు. అదే సంవత్సరం సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు, కవి, చిత్రకారులు, వీరి కథలను పొట్లపల్లి రామారావు కథలుగా ప్రచురించారు. ‘ఆత్మవేదన’ గేయకవిత్వం. మిగతా కవిత్వమంతా వచన కవిత్వం . ‘ఆత్మ వేదన’ గేయల్లో తిరుగుబాటు తనం, ఉద్యమస్ఫూర్తి కనిపిస్తుంది. మిగతా కవిత్వంలో చాలా భాగం తాత్విక చింతన కనిపిస్తుంది. వీరి కవితలు జనత, కాలిబాట చాలా ప్రాచుర్యం పొందాయి.
tsmagazine

”ఎవడు ఇక్కడరాజు
ఎవడు ఇక్కడ రైతు
కష్టించు వారొకరు
కాజేయు వారొకరు…
కష్ట జీవీనీవు
కడదొలగవయ్యా
చూదాము ఈ ప్రభువు లేమేలుతారో”

ఇట్లా నిజాం నిరంకుశత్వంపై ధ్వజమెత్తి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రోత్సహించారు రామారావు.
‘జనత’ అనే గేయంలో
‘సిలువెక్కించిన మేమే
నిలువెక్కించిన మేమే
ఉరియెక్కించిన మేమే
కరినెక్కించిన మేమే’ అంటూ పాలకుల్ని హెచ్చరిస్తారు.

అవును ప్రజలు తలుచుకుంటే ఏమి చేయలేరు?
రామారావు ‘కాలిబాట’ అనే గేయంలో కాలిబాట సింప్లిసిటీని, ఔన్నత్యాన్ని తెల్పుతారు.

రామారావు మారుమూల పల్లెకే అంకితమైనా వారి మైత్రీ సంపద తక్కువేమీ కాదు-కాళోజీ సోదరులు, దాశరధి, వట్టికోట ఆళ్వారుస్వామి, బి. రామరాజు, పి.వి. నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి మొదలగువారే కాక వయసులో రామారావుకంటే చాలా చిన్నవారైన వరవరరావు వారికి అత్యంత ఆత్మీయులు. అట్లాగే పార్సి వెంకటేశ్వర్లు అనే కవిగూడా సన్నిహితులు. ఎనభై నాలుగేళ్లు జీవితాన్ని నిరాడంబరంగా గడిపిన ఈ మహనీయుడు సెప్టెంబర్‌ 10, 2001న హైదరాబాద్‌లో తమ కుమారుడి ఇంట్లో ఉండి అనారోగ్యంవల్ల ఈ ప్రపంచంనుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఇది పొట్లపల్లి రామారావు శతజయంతి సంవత్సరం. సాహితీ పిపాసులంతా, స్వాతంత్య్ర పిపాసులంతా వారిని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. వారిని చదువు కోవాల్సిన తరుణం.

వి.ఆర్‌. విద్యార్థి