|

తెలంగాణలో మహిళా బుర్ర కథ బృందం

– సిలివేరు లింగమూర్తి
tsmagazine
‘వినరా భారత వీర కుమార వీనుల విందుగనూ దేవా’ అనే చక్కని మహిళా కంఠ స్వరం వినే సరికి దారిన పోయే వారంతా కూడా ఆగి, అరె ఆడవారు కూడా బుర్రకథ చెప్తూ వున్నారే అని. ఆబాల గోపాలం, నిల్చోని, మరికొంత సేపటికి, కూర్చొని వినసాగినారు. అది 1966వ సంవత్సరం. ఆ గ్రామ పటేల్‌ గోపతి లచ్చయ్య, బుర్రకథ నేర్పిన గురువు శిలివేరు సైదయ్య చాలా శ్రద్ధగా వినసాగినారు. అది మునగాల పర్గణా హుజూర్‌నగర్‌ తాలూకాలోని కుగ్రామం పేరు అమీనాబాద్‌. సుమారు 150కి పైగా జనం గుమికూడారు. చక్కగా బుర్రకథ నడుస్తోంది. కథకురాలు, వంతలు ముగ్గురూ స్త్రీలే. అది పల్నాటి యుద్ధమో, బొబ్బిలి యుద్దమో కాదు లేదా పాండవ వనమాసమో, శ్రీకృష్ణరాయ భారమో కూడా కాదు ”భగవద్గీత” బుర్రకథ.

కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుని విషాదమునకు శ్రీకృష్ణుడు బోధించినది. ఈ ‘భగవద్గీత’, బుర్ర కథ నేటికీ అంటే సుమారు 50 సం||రాల నుండీ చెప్తూనే వున్నారు. కథకురాలు బొంకూరి వెంకట నర్శమ్మకు 65 సం||లు (1950 ఆగస్ట్‌లో జననం), వంతలు రామినేని జానకమ్మకు 70 సం||లు (1945లో), షేక్‌ సాహిభీ అంతకన్నా వయస్కురాలు 80 సం||రాలు (1935).

బహుశా తెలంగాణలో ఒక మహిళా బుర్ర కథా బృందం వీరేనేమో! ప్రాచీన ఈ కళా రూపాన్ని వీరు నేటికీ ప్రదర్శిస్తూనే వున్నారు. వీరి ప్రదర్శనలు గుంటూరు జిల్లా కొండవీడు, ఖమ్మం జిల్లా – వైరా, పల్లిపాడు, తల్లాడ, జన్నారం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నల్లగొండ జిల్లా (పాత) కోదాడ, నల్లగొండ, కలకోట, కట్టకొమ్మ గూడెం, హుజుర్‌నగర్‌ ఇంకా ఎన్నో ప్రదేశాలలో కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు.

ఈ సంవత్సరం (2018) ఉగాది రోజున ‘సహృదయ’ సంస్థ వరంగల్‌ వారి కోసం ప్రదర్శనలిచ్చి, ఎన్‌.వి.వి. చారి, గన్నమరాజు గిరిజామనోహర బాబు, నెమలికొండ బాలకిషన్‌ రావు, నెమలికొండ, వారణాసి కృష్ణమూర్తి ఇంకా ఎందరో ఉద్ధండ పండితుల సమక్షంలో గానం చేసి శభాష్‌ అనిపించుకున్నారు. ఈ బుర్రకథ బృందం వారికి చక్కని కంఠంతోపాటుగా కొంత శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం కూడా ఉంది. ఈ భగవద్గీత ‘బుర్రకథ’ రచయిత వారణాసి వెంకట నారాయణ శాస్త్రి, మునగాలలో (నేటి సూర్యాపేట జిల్లా) ఉపాధ్యాయులు. ప్రకాశం పంతులుకి మంచి మిత్రులు. కొదాటి నారాయణరావుతో గ్రంథాలయోధ్యమంతో, నిజాం వ్యతిరేకోద్యమాలలో తేనెవంటి పదాలతో ఎక్కడా విసుగు రాకుండా బుర్రకథను రచించారు.

ఈ బుర్రకథ బృందం వ్యవసాయ కూలీలు, వారికి గుర్తింపును తెచ్చుటకు కోదాడలో కోట తిరపతయ్య అనే కళాకారుడు వీరిని ‘బాపూజీ నవీన నాట్యకళా మండలి”(1963లో స్థాపన) తరపున సన్మానం చేసి గుర్తింపు తెచ్చారు.

‘ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్‌’ అన్న ఒక కవి మాటలు నిజం చేస్తూ వున్న ఈ బుర్రకథ బృందం వాస్తవంగా ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక రంగంలోని ‘అచల పరిపూర్ణ సిద్ధాంతం’లోని శిష్య బృందమే గురువు. కొండవీడు (గుంటూరు జిల్లా) వాస్తవ్యులు దయానంద షేక్‌ బురహనొద్దీన్‌. బురహన్‌ శిష్యులు మరియు గురువైన అమీనాబాద్‌ వాస్తవ్యులు నేటి (అనంతగిరి మం.) పరిపూర్ణానంద శిలివేరు సైదయ్య వీరికి శిక్షణనిచ్చారు. కథకురాలు వెంకట నర్శమ్మ 6వ తరగతి చదివి, చక్కని శ్రావ్యమైన కంఠంతో అందర్ని ఆకర్షించగలదు. వంతలు పాడే వారు కూడా అంతటి ఘనులే.

వీరి ‘భగవద్గీత’ బుర్ర కథవిని ఎందరో ప్రేరేపితులైనారు. వీరు ఎంతో బాధల కోర్చి జీవనం సాగిస్తూ వున్నారు. వీరిని ప్రోత్సహించటం మనందరి కర్తవ్యం.