తెలంగాణ ప్రభ

తేజోమూర్తులు
ఎదురొచ్చి కరచాలనం చేసినట్లు
తెలుగు వెలుగులతో నేరుగా
ముచ్చట్లు పెట్టినంతానందం !

మహాసభల నిండా
జున్ను జుర్రుకున్నట్లే
కవుల కోలాహలం
అమ్మభాషను
బతికించాలనే బుద్ధిజీవుల తపన

భిన్న కావ్యాల తడిని
గుండెలకద్దుకున్న పావురాలు
తెలంగాణ పునర్‌ వైభవాన్ని చాటే
సాంస్కృతిక దరువులు
సకల సాహిత్య కోలాట కోపులు
తెలుగు కిరణాలు అలుగెల్లిన జోరు
ఆకాశం కండ్లు తిప్పుకోలేనంత కుషాలు

ఏది నోట్లేసుకున్నా కరిగే అమృతాలు
అన్నింటిని ఆస్వాదించ లేక
పోయామనే దిగులు
నక్షత్రాల విందుభోజనాల
దక్కన్‌ వంటల ఘుమ ఘుమలు
అంతర్జాతీయ ఒలంపిిక్స్‌ను మించిన
అపూర్వ స్వాగతాలు
అంబరాన ఆతిథ్యాలు

తరతరాల వైభవాన్ని భుజానెత్తుకున్న
బృహత్‌ కవితా సమ్మేళనాలు
శతక సంకీర్తనల మాధుర్యాన్ని
తాంబూలాల్ల పంచిన అష్ట,శతావధానాలు
భాషా గోష్ఠుల పండిత విన్యాసాలు
బహుళ పక్రియ విమర్శ నిర్మాణాలతో
ఆత్మగౌరవపతాకాన్ని ఎగురేసిన
త్యాగాల నేల !

విశ్వనగరం భాషా బోనమై
వీధులు అమ్మ పాల కమ్మదనాలై
తెలుగు వెలుగు జిలుగుల
తెలంగాణ ప్రభ శిఖరాన నిలిచే
ప్రపంచ తెలుగు మహాసభలు

(ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతంపై )
– వనపట్ల సుబ్బయ్య