|

తెలంగాణ విద్యార్థి ‘పోటీ’కి రెడీ!

tsmagazineఆది నారాయణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్ఠం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టి, దేశంలో తెలంగాణ విద్యను అగ్రగామిగా చేసేందుకు, తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ మార్గదర్శకత్వంలో నాణ్యమైన విద్య అందించే అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు జరుగుతున్నాయి.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య ప్రైవేట్‌ రంగంలో భారం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రైవేట్‌ కంటే ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందించే విధంగా అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో విద్యా రంగంలో జరుగుతున్న కృషిని ఇటీవలే ఢిల్లీలో జరిగిన సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్డ్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌(కేబ్‌) సమావేశంలో,వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమక్షంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అభినందించడమే కాకుండా, విద్యాశాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించిన ప్రతిపాదనలను, తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను 8వ తరగతి నుంచి 12వ తరగతికి పెంచాలన్న ప్రతిపాదనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను కేంద్రం 8వ తరగతి వరకు మాత్రమే నిర్వహిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన సొంత నిధులతో కేజీబీవీలను 10వ తరగతి వరకు నిర్వహిస్తోంది. వీటిని 12వ తరగతి వరకు నిర్వహించాలని చేసిన ప్రతిపాదనలను సిఎం కేసిఆర్‌ అంగీకరించారు. ఇదే సమయంలో కేంద్రంలో బాలికా విద్యను పటిష్ఠం చేసేందుకు వేసిన కమిటీకి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మన్‌ కావడం, దేశవ్యాప్తంగా బాలికా విద్యను పటిష్ఠం చేసేందుకు పర్యటించి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపాదించిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించడంతో మన రాష్ట్రంలో కూడా కేజీబీవీలు ఈ ఏడాది నుంచి 12వ తరగతి వరకు పెరగనున్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్న విద్యా పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెబుతూ…విద్యారంగంలో తెలంగాణను రోల్‌ మోడల్‌గా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అభివర్ణించడం ఇక్కడి విద్యా విధానంలో వస్తున్న మార్పులు, అభివృద్ధికి నిదర్శనం. అయితే తెలంగాణ విద్యారంగాన్ని దేశంలో ఒక రోల్‌ మోడల్‌ గా మార్చడంలో తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు అనేకం ఉన్నాయి. మొట్టమొదట ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలను ఎందుకు చదివించాలి, ప్రైవేట్‌ విద్యాలయాల కంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా మెరుగైనవని చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించే ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం చేపట్టడం, గత నాలుగేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగి మంచి ఫలితాలు రావడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు కూడా నేరుగా సంబంధాలు ఏర్పడ్డాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఏం ఆశిస్తున్నారో ఉపాధ్యాయులకు తెలిసింది. అదేసమయంలో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు ప్రైవేట్‌ విద్యాలయాల ఉపాధ్యాయుల కంటే ఎలాంటి ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉన్నారో చెప్పుకునే అవకాశం లభించింది.

దేశంలో మరెక్కడా లేని మరొక వినూత్న కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు అమలు జరుగుతోంది. అదే సన్నబియ్యంతో భోజనం అందించడం. గతంలో దొడ్డు బియ్యంతో పెట్టడం, అది సరిగా వండక విద్యార్థులు సరిగా తినలేక పడుతున్న ఇబ్బందులను విద్యార్థుల కోణం నుంచి మానవతా దృక్పథంతో ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఖర్చుకు వెనుకాడకుండా సన్నబియ్యంతో భోజనం పెట్టాలని నిర్ణయించి విజయవంతంగా అమలు చేస్తోంది. సన్నబియ్యంతో పాటు వారానికి మూడు సార్లు గుడ్లు కూడా అందిస్తూ విద్యార్థులకు పౌష్ఠికాహారాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేపట్టింది. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద ఉచితంగా కొన్ని చోట్ల నోట్‌ బుక్స్‌ కూడా అందిస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను, మోడల్‌ స్కూళ్లను, కేజీబీవీలను పటిష్ఠం చేసేందుకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దాదాపు 2000 కోట్లను ప్రభుత్వ విద్యాలయాల పటిష్ఠతకు ఖర్చు చేసింది. అన్ని మోడల్‌ స్కూళ్లకు, కేజీబీవీలకు పక్కాభవనాలు ఏర్పాటు చేసుకున్నాం. పాలిటెక్నిక్‌ కాలేజీలకు 90 శాతం పక్కా భవనాలు నిర్మించుకోగా…త్వరలో మిగిలిన 10 శాతం కాలేజీలకు కూడా భవనాల నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత మండలాలకు తగినన్ని లేవని పదే, పదే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరడంతో కొత్తగా 84 కేజీబీవీలు రాష్ట్రానికి మంజూరయ్యాయి. దీంతో తెలంగాణలో వీటి సంఖ్య 391కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేజీబీవీలున్న రాష్ట్రంలో తెలంగాణ ముందంజలో ఉంది. విద్యార్థినులందరికీ హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్లను అందిస్తూ, చలికాలంలో వేడినీళ్ల ఏర్పాటు చేయడం కూడా జరిగింది.

కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లన్నింటిలో డ్యుయల్‌ డెస్క్‌ లు, సీసీ కెమెరాలు,ప్రాక్టికల్‌ ల్యాబ్స్‌, బయో మెట్రిక్‌ మిషన్లు, ఆర్వో ప్లాంట్లు, విద్యార్థులకు సరిపడా కొత్త టాయిలెట్లు, డిజిటల్‌ క్లాసులు, స్కూల్‌ నిర్వహణకు స్కూల్‌ గ్రాంటు, హరితహారం కింద పాఠశాలలను హరిత పాఠశాలలుగా మార్చేందుకు, స్కూల్‌ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అటెండర్లను నియమించుకునేందుకు, వారికి జీతభత్యాలు కొత్తగా ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది.

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందే యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, విద్యా వాలంటీర్లు, స్కూల్‌ గ్రాంట్లను ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రం వచ్చాకే జరిగింది.

డిజిటల్‌ క్లాసులు
రాష్ట్రంలో డిజిటల్‌ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా 6000 ఉన్నత విద్య పాఠశాలల్లో గత ఏడాది నుంచి డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నది. వచ్చే ఏడాది ప్రాథమిక విద్యా పాఠశాలల్లో కూడా ఈ డిజిటల్‌ క్లాసులు నడిపే ఆలోచన చేస్తున్నది. డిజిటల్‌ క్లాసులను మన టీవీతో సమన్వయం చేసుకుంటూ పాఠశాలలు నడిచే సమయాల్లో పాఠ్యాంశాలు బోధించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి నడిపిస్తున్నది.

విశ్వవిద్యాలయాలను పటిష్ఠం చేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా 419 కోట్ల రూపాయలను విశ్వ విద్యా లయాల్లో మౌలిక వసతుల కోసం సిఎం కేసిఆర్‌ మంజూరు చేశారు. అదేవిధంగా కొన్నేళ్లుగా రిటైర్మెంట్లే తప్ప నియా మకాలు లేని విశ్వవిద్యాలయాల్లో బోధన నాణ్యత పెంచాలనే ఉద్దేశ్యంతో 1550 పోస్టులను మంజూరు చేసి, ఇందులో ఈ ఏడాది 1061పోస్టులను వెంటనే భర్తీ చేసుకునేందుకు ఆర్ధిక పరమైన అనుమతులు కూడా జారీ చేయడం జరిగింది. విద్యార్థుల బోగస్‌ నమోదును నివారించేం దుకు, ఉపాధ్యాయు లు, విద్యార్థుల హాజరును క్రమబద్దీకరిం చేందుకు బయో మెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యా లయాల్లో విద్యార్థుల భద్రత, రక్షణ కోసం,అక్కడి వాతా వరణాన్ని ఎప్పటి కప్పుడు నిఘా నీడలో నిర్వ హించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

విదేశాల్లో చదివే పేద, దళిత, గిరిజన విద్యార్థులకు ఆర్ధిక తోడ్పాటులో భాగంగా గతంలో 10 లక్షల రూపా యలు ఇస్తుండగా…అవి సరిపోవడం లేదని స్వయంగా గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని 20లక్షల రూపాయలకు పెంచి అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌,మహాత్మా జ్యోతిరావు పూలే స్కాలర్‌ షిప్‌గా అందిస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉత్తమ ఫలి తాలు సాధించాలని, ఇందుకోసం ప్రతి పాఠశాలలో అన్ని సబ్జెక్టులు సిలబస్‌ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మార్కుల కోసం కొన్ని సిలబస్‌ లు పూర్తి చేసి, మిగిలిన వాటిని వదిలేసే పద్ధతి విడనాడాలని అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి పాఠశాలలో సిలబస్‌ పూర్తి చేయడం, ప్రత్యేక క్లాసులు నిర్వహించడం, స్లిప్‌ టెస్ట్‌, రివిజన్‌ టెస్టులు పెట్టి పిల్లల ఫలితాలు పెంచడానికి కృషి జరుగుతోంది. ఉత్తమ ఫలితాలు సాధించే వారిని ప్రోత్సహించేందుకు వారికి అవార్డులు, రివార్డులు ఇస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాక్టికల్స్‌ ల్యాబ్స్‌ ఉన్నా అక్కడ పరికరాలు లేక, రసాయనాలు లేక మూలకు పడ్డాయని గుర్తించి ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేశారు. ప్రతి పాఠశాల, కాలేజీలో కచ్చితంగా ప్రాక్టికల్స్‌ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ల్యాబ్స్‌ నిర్వహణకు నిధులు భారీగా మంజూరు చేశారు. ప్రాక్టికల్స్‌ చేయించేందుకు ఇన్‌ స్ట్రక్టర్లను కూడా నియమించుకునేందుకు అవకాశం కల్పించారు.tsmagazine

ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. మార్కెట్‌ పోటీకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులుండాలన్న లక్ష్యంతో ఇంగ్లీషు మీడియంలో బోధన చేయాలని కూడా నిర్ణయించి, వెంటనే అమలులోకి తీసుకొచ్చింది.

పేద విద్యార్థులకు విద్య భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. హాస్టల్‌ విద్యార్థులు దొడ్డు బియ్యం తినలేక ఖాళీ కడుపులతో కాలం వెళ్లదీస్తున్నారని గమనించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ విద్యార్థులకు సన్నబియ్యం పెట్టాలని నిర్ణయించారు. సన్నబియ్యం వల్ల ప్రస్తుతం హాస్టళ్లలో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని కూడా అధికారులు చెబుతున్నారు. తమ పిల్లలు సన్నబియ్యం తింటూ చదువుకోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాలేజీ విద్యార్థులకు మార్కెట్‌ పోటీకి అనుగుణంగా విద్య అందించాలని ఆలో చించి ప్రతి కాలేజీలో స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. విద్యార్థులకు ఈ కేంద్రాల ద్వారా సాఫ్ట్‌ స్కిల్స్‌ అందించాలని నిర్ణయించారు. వీలైతే సాప్ట్‌ స్కిల్స్‌ అందించేందుకు ప్రత్యేకంగా సర్టిఫికేట్‌ కోర్సులను ప్రారంభించాలని సూచించారు.

డిగ్రీ కాలేజీలను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా కాలేజీలకు పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. భూమి ఉండి భవనాలు లేని ప్రతి కాలేజీకి 2.25 కోట్లరూపాయలతో బిల్డింగ్‌ కట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని చోట్ల ఈ భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అదనపు గదుల కోసం 165 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. పాఠశాల తరగతి నుంచి విద్యార్థులకు బోధనలో ఉత్తమ విధానాలను అనుసరించాలనే ఉద్దేశ్యంతో డిజిటల్‌ క్లాసులను భారీ ఎత్తున ప్రారంభించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ క్లాసులను నిర్వహిస్తోంది. నవంబర్‌ 16, 2016న రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ తరగతులను ప్రారంభించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను భద్రతను కూడా సీరియస్‌ గా తీసుకుంది. ప్రభుత్వ హాస్టళ్లలోని ఆడపిల్లలను వారి కుటుంబ సభ్యుల ఆమోదం లేకుండా బయటకు పంపడానికి వీలులేదని అధికారులను ఆదేశించింది. తల్లిదండ్రులు, బంధువులు, సంబంధీకుల లెటర్లు తీసుకున్న తర్వాత ఆడపిల్లలను బయటకు పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇంటర్‌ తర్వాత రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు లేక, విద్యార్థినులను చదివించలేక తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపుతున్నారని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఉన్నత విద్య అందించాలనే ఉన్నతాశయంతో 53 గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. కేజీ నుంచి పీజీ వరకు గురుకుల విధానంలోనే విద్య కొనసాగించేందుకు కావల్సిన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. ఇందుకోసం ఆయా రంగాల్లో ఉన్న నిష్ణాతులతో చర్చిస్తోంది.

భాషా పండితులు, పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి, వారి చిరకాల డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీ లను గాడిలో పెట్టాలని నిర్ణయించింది. కాలేజీల్లో ప్రమాణాలు పెంచేందుకు కచ్చితంగా వసతులన్నీ ఉండాలని సూచించింది. సరైన మౌలిక వసతులు లేని కాలేజీలకు అనుమతులు రద్దు చేసింది.

రాష్ట్రంలో నాణ్యమైన విద్యనందించడంలో భాగంగా ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతులు ఇవ్వడంపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేసింది. ఇంటర్‌ పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు వెతుక్కోవడంలో ఇబ్బంది జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలను చూపే యాప్‌ను ఆవిష్కరించారు. కాలేజీలలో విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వడంలో యాజ మాన్యాలు ఇబ్బంది కల్పిస్తున్నారని, వాటిని అధిగమించే ఉద్దేశ్యంతో ఆన్‌ లైన్‌ హాల్‌ టికెట్‌ జారీ విధానం ప్రవేశ పెట్టింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశించి నట్లు తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడి శభాష్‌ అని పించుకునే నాణ్యమైన విద్య లక్ష్యంగా, దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ విద్యాశాఖ పనిచేస్తోంది.