తొలి శాసనసభ రద్దు.

  • కేసీఆర్‌ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం
  • రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు
  • అక్టోబర్‌ 8న ఓటర్ల తుది జాబితా
  • ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
  • తొలిసారిగా ఎవరికి
  • ఓటేసారో తెలిపే వెసులుబాటు

tsmagazine

గటిక విజయ్‌ కుమార్‌

తెలంగాణ తొలి శాసనసభ అర్థాంతరంగా రద్దయింది. మరో 9 నెలల వ్యవధి ఉండగానే శాసనసభను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 6న మద్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన తీర్మానానికి మంత్రులంతా మద్దతు పలికారు. మద్యాహ్నం 1.15 గంటలకు రాజ్‌ భవన్‌ వెళ్లిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రివర్గం నిర్ణయాన్ని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌కు తెలియచేశారు.

రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్‌ చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్‌ కు అందించారు. ఆ వెంటనే గవర్నర్‌ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగాలని గవర్నర్‌ కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీక రించారు. దీంతో 2014 జూన్‌ 2న ఏర్పడిన తెలంగాణ తొలి ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌ 6 నుంచి ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారింది. 4 ఏండ్ల 3 నెలల 5 రోజుల పాటు కొనసాగిన రాష్ట్ర శాసనసభ పూర్తికాలం మనుగడలో ఉండకుండానే రద్దయింది. కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా విధులు నిర్వహిస్తున్నందు వల్ల ముఖ్యమంత్రి, మంత్రు ల పదవులు, బాధ్యతలు యధా విధిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే లు తమ పదవులు కోల్పోవాల్సి వచ్చింది. శాసనసభ రద్దయిన విషయాన్ని గవర్నర్‌ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు తెలంగాణ అసెంబ్లీలోని 119 స్థానాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఖాళీల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రజత్‌ కుమార్‌ కు తెలిపారు. శాసనసభ రద్దయిన విషయాన్ని అసెంబ్లీ అధికారులు ఎమ్మెల్యేలకు అధికారికంగా తెలియచేశారు. ఖాళీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా తెలంగాణలో ఎన్నికలు జరిపే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

ప్రగతి చక్రం ఆగవద్దనే నిర్ణయం: కేసీఆర్‌

శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రగతిచక్రం ఆగవద్దనే ఉద్దేశ్యంతోనే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు పోదామని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రగతిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ ప్రయత్నాలు మరీ ఎక్కువయ్యాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏమాత్రం అవగాహన, ఆలోచన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతి చక్రం ఆగవద్దని భావించామని, తాజాగా ప్రజా తీర్పు కోరి దాని ప్రకారం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని భావించామని సిఎం వివరించారు. టిఆర్‌ఎస్‌ తరుఫున పోటీ చేసే 105 మంది అభ్యర్థులతో కేసీఆర్‌ తొలి జాబితా కూడా అప్పుడే విడుదల చేశారు.

ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు

తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో రాష్ట్రంలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. సెప్టెంబర్‌ 6న అసెంబ్లీ రద్దు కాగానే, మరుసటి రోజే రాష్ట్రంలోని పరిస్థితులు, ఎన్నికల సన్నద్దతపై సమావేశం నిర్వహించింది. సెప్టెంబర్‌ 11న రాష్ట్రానికి ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌ కుమార్‌తో పాటు ఇతర అధికారులతో సమావేశమ య్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, డిజిపి మహేందర్‌ రెడ్డిలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా కూర్పు, భద్రతా సిబ్బంది, పోలింగ్‌ సిబ్బంది, పోలీంగ్‌ బూతుల ఏర్పాటు, ఈవిఎం లభ్యత తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సంబం ధించిన రాష్ట్ర అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రం మొత్తం మీద 32,574 పోలింగ్‌ స్టేషన్లు అవసర మని, 52,100 బ్యాలెట్‌ యూనిట్లు, 41,100 కంట్రోల్‌ యూనిట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 15 మంది అభ్యర్థుల పేర్లతో పాటు ఒక నోటా బటన్‌ ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య 15కు మించితే మరో బ్యాలెట్‌ యూనిట్‌ను వినియోగిస్తారు.

తొలిసారిగా వివి పాట్స్‌

ఓటర్లు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవడానికి రాష్ట్రంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో వివీ ప్యాట్‌ (హశ్‌ీవతీ ఙవతీఱటఱaపశ్రీవ జూaజూవతీ aబసఱ్‌ ్‌తీaఱశ్రీ (హహూూు)లు ఏర్పాటు చేస్తున్నారు. ఓటరు తాను ఎంచుకున్న అభ్యర్థికి ఓటు వేయడానికి బటన్‌ నొక్కిన తర్వాత ఏడు సెకన్ల వరకు పక్కనున్న మిషన్‌ పై అది కనిపిస్తుంది. ఆ వెంటనే పక్కనున్న ట్రేలో ప్రింట్‌ అవుట్‌ పడిపోతుంది. ఓటరుకు అనుమానం వస్తే వెంటనే అక్కడ ఉన్న రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించవచ్చు. తొలిసారి ఈవిఎంలకు వివి ప్యాట్‌లు ఏర్పాటు చేస్తున్నందున పోలింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

2018 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు

అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఓటర్లు తుది జాబితా విడుదలయిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి ముందు ఓటర్ల జాబితాపై దృష్టి కేంద్రీకరించింది. అక్టోబర్‌ 8న తుది ఓటర్ల జాబితా విడుదల చేయడానికి అనుగుణంగా షెడ్యూల్‌ ప్రకటించింది. 2018 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు. దాని ప్రాతిపదికగానే అవసరమైన సవరణలు చేసి, తుది జాబితా విడుదల చేస్తారు. 2018 ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,53,27,785 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలోనే సవరణలు జరుగుతాయి.

ముందస్తు రద్దు 11వ సారి

గడువు కన్నా ముందుగానే అసెంబ్లీలను రద్దు చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికి పలు రాష్ట్రాల్లో పది సార్లు శాసనసభలు గడువు తీరకముందే రద్దయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ రద్దుతో ఈ సంఖ్య 11కు చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రెండు దఫాలు అసెంబ్లీ ముందస్తుగా రద్దయింది. 1984 నవంబరు 22న అసెంబ్లీని రద్దు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మంత్రి వర్గం తీర్మానించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. 2003 నవంబరు 14న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గం అసెంబ్లీని ముందే రద్దు చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినప్పటికీ వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తరవాత జరిగిన లోక్‌ సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీకి కూడా ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.

కర్ణాటకలో అత్యధికం: దేశంలో అత్యధికంగా కర్ణాటకలో అయిదు సార్లు అసెంబ్లీని గడువుకన్నా ముందుగానే రద్దు చేశారు. ఈ అయిదు సందర్భాల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 2002లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. హరియాణాలో 2009లో, తమిళనాడులో 1984లో అసెంబ్లీలను గడువుకంటే ముందు రద్దు చేశారు.

ఓటర్ల జాబితా కూర్పుకు షెడ్యూల్‌
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల: 10-09-2018
అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ: 10-09-2018 నుంచి 25-09-18
గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు: 15-09-2018,

(16-09-2018) రెండు రోజులు

అభ్యంతరాల తర్వాత సవరణల లిస్టు: 04-10-2018

ఓటర్ల జాబితా ముద్రణ: 07-10-2018

తుది జాబితా: 08-10-2018

మొదటి శాసనసభ విశేషాలు

సభ సమావేశమైన రోజులు: 126

సమావేశమైన గంటలు: 612.27

ప్రశ్నలు – సమాధానాలు: 667

లిఖిత పూర్వక సమాధానాలు: 318

స్వల్ప వ్యవధి చర్చలు: 16

ఆమోదించిన బిల్లులు: 71

తీర్మానాలు: 21

ఆర్డినెన్స్‌లు: 25

ప్రభుత్వం చేసిన ప్రకటనలు : 18

సభలో ప్రవేశ పెట్టిన పత్రాలు: 95

గవర్నర్‌ ప్రసంగం: 5 సార్లు

సభ్యులు చేసిన ప్రసంగాలు : 858

బడ్జెట్‌: 5 సార్లు ప్రవేశ పెట్టారు

సభ జరిగిన సెషన్లు: 11

సభా సమావేశమైంది: 13 సార్లు

సమావేశమైన మొదటి రోజు: 9 జూన్‌, 2014

శాసనసభ రద్దయిన రోజు: 6 సెప్టెంబర్‌ 2018

ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌: 31 మార్చి, 2016

అసెంబ్లీ స్పీకర్‌: సిరికొండ మధుసూదనా చారి

సభా నాయకుడు: కల్వకుంట్ల చంద్రశేఖర రావు

ప్రతిపక్ష నాయకుడు: కుందూరు జానారెడ్డి

అసెంబ్లీ వ్యవహారాల మంత్రి: తన్నీరు హరీశ్‌ రావు

డిప్యూటీ స్పీకర్‌: పద్మా దేవేందర్‌ రెడ్డి

అసెంబ్లీ కార్యదర్శి: రాజా సదారం (31 ఆగస్టు 2017 వరకు)

వేదాంతం నర్సింహాచార్యులు (01 సెప్టెంబర్‌ 2017 నుంచి)