|

దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

kcrseప్రభుత్వం దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని, వారి అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్ఘాటించారు. ఫిబ్రవరి 13, 14, 15 తేదీలలో మూడు రోజుల పాటు డిక్కీ (దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ) నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించిన పారిశ్రామిక వాణిజ్య ప్రదర్శనను సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర మంత్రులు జూపల్లి, నాయిని, లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, దళితులు, గిరిజనులు ఒక పారిశ్రామిక రంగంలోనే కాకుండా వ్యాపారం, విద్యా, నిర్మాణ రంగాలలోనూ అభివృద్ధిలోకి రావాలన్నారు. అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. దళితులు, గిరిజనులు సమాజంలో మొదటి స్థానంలో నిలబడాలన్నది తన కోరిక అన్నారు. దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక కారిడార్లలో 22శాతం స్థలాన్ని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ కోసం ఇంక్యూబేటర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దాని కోసం నగర శివార్లలో ఎకరా స్థలంతో పాటు 5కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడులలో 5శాతం మార్జిన్‌మనీగా అందజేస్తామని, రాష్ట్రంలో రెండువందల మంది ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధంచేశామని సి.ఎం తెలిపారు.

kcr-cm

కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం దళితులకు ఎంతో సహాయకారిగా ఉందన్నారు. కేంద్రం కూడా వీరికి అండగా నిలుస్తుందన్నారు. దళితులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు, ఆర్థిక సదుపాయాలు ఏర్పాటుచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ‘డిక్కీ’ వ్యవస్థాపక అధ్యక్షుడు మిలింద్‌ కాంబ్లీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానానికి తానే అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని, అన్ని రాష్ట్రాల్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహాన్ని తెలియపరుస్తానన్నారు. ‘డిక్కీ’ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు నర్రా రవికుమార్‌ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల పాలకులు ఎస్సీల సంక్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తే కెసీఆర్‌ వారి అభివృద్ధిని కూడా కోరుకున్నారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండవరోజు ఫిబ్రవరి 15న ముఖ్యమంత్రి కెసీఆర్‌ ప్రకటించిన ప్రోత్సాహకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి కె.ప్రదీప్‌ చంద్ర, ప్రభుత్వ సలహాదారు బి.వి. పాపారావులు మాట్లాడుతూ ప్రభుత్వం దళిత, గిరిజన పారి శ్రామిక వేత్తలకు అందిస్తున్న రాయితీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి గద్దర్‌ పాల్గొన్నారు.

ముగింపు సమావేశం :

దళితుల్లో ఎంతో మంది ప్రతిభావంతులున్నాకూడా సరైన ప్రోత్సాహం లేకనే వెనుకబడి పోతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని దళితులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయిం చిందని సామాజిక న్యాయం, సాధికారత శాఖ కేంద్ర మంత్రి విజయ్‌ సాంప్ల అన్నారు. వీరి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు. ఫిబ్రవరి 15న ‘డిక్కీ’ పారిశ్రామిక సదస్సు ముగింపులో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితులు అభివృద్ధి చెందాలన్నారు.

రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. దళిత జాతి అభివృద్ధికి నిధులను పెంచుతామన్నారు. దళితులకు రూ. 5 కోట్ల వరకు ఆర్ధికంగా మద్ధతిస్తామని తెలిపారు. కార్య క్రమంలో మాజీ మంత్రి జహీరాబాద్‌ ఎమ్మెల్యే జి. గీతారెడ్డి మాట్లా డుతూ దళితులు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగా లన్నారు. కార్యక్రమంలో డిక్కీ జాతీయ అధ్యక్షులు మిలింద్‌ కాంబ్లే, డిక్కీ సౌత్‌ ఇండియా అధ్యక్షులు నర్రా రవికుమార్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి. శ్రీనివాస్‌, పరిశ్రమల శాఖ కమీషనర్‌ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.