కొల్లూరులో దేశంలోనే అతి పెద్ద డబుల్‌ బెడ్రూమ్ ఇండ్ల మోడల్‌ కాలనీ

tsmagazine

ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పట్టణాభివద్ధి, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఆయన ఆకస్మికంగా సందర్శించి నిర్మాణపనులను పరిశీలించారు. సుమారు 96.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లతో ఈ ప్రాంతం అతిపెద్ద గృహసముదాయంగా మారబోతోందని.. మోడల్‌ కాలనీగా ఆకట్టుకుంటుందని, కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు చరిత్ర  సష్టించబోతున్నాయని మంత్రి చెప్పారు.

దేశంలో ఇప్పటివరకు ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద గహసముదాయాన్ని ఒకేచోట నిర్మించలేదని, కొల్లూరులో సొంత నిధులతో 124 ఎకరాలు సేకరించి పేదవారికి రెండు పడకగదుల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించిందన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న 15,660 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ఫలితంగా కొల్లూరు ప్రాంతం ఒక పట్టణంగా మారుతుందని, వీటి నిర్మాణం కోసం రూ.1354.59 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.ఇవి  పూర్తయితే సుమారు 70 వేల మంది పైచిలుకు జనాభా ఇక్కడ నివాసం ఉంటుందన్నారు. గృహ సముదాయంలో వాణిజ్య సముదాయం నిర్మించడం ద్వారా దానినుంచి వచ్చే ఆదాయం లిఫ్ట్‌, ఇతర నిర్వహణ పనులకు ఉపయోగపడుతుందని చెప్పారు.

నాణ్యత, భద్రతపై శ్రద్ధ అవసరం
రామచంద్రాపురం మడలంలోని కొల్లూరు టౌన్‌షిప్‌ నిర్మాణపనులు శరవేగంగా జరుగు తున్నాయని, ప్రతీరోజు మూడుషిప్టుల్లో దాదాపు 3,500 మంది కార్మికులు 400 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని మంత్రికి జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు. డబుల్‌ జీ+11 పద్ధతిలో 117 బిల్డింగ్‌లను నిర్మించాల్సి ఉన్నదని, ఈ డిసెంబర్‌ వరకు 25 బిల్డింగ్‌లను పూర్తిచేస్తామని ప్రాజెక్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. సుమారుగా నాలుగువేల డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్‌ను, నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సంతప్తి వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించా లని, కార్మికుల భద్రతకు సంబంధించి అన్ని రక్షణచర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిర్మాణపనులను పర్యవేక్షిస్తున్న సీసీ కెమెరాల పనితీరును తన మొబైల్‌ఫోన్‌ ద్వారా పరిశీలించారు. సాంకేతిక సలహాలందిస్తున్న జేఎన్టీయూ అధ్యాపకులు, సైట్‌ ఇంజినీర్లతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మెగా సిటీగా హైదరాబాద్‌ నగరం
హైదరాబాద్‌ నగరం 2030 సంవత్సరం నాటికి మెగా సిటీగా మారనుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బహుముఖ వ్యూహంతో నగర అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నారన్నారు. రూ. 23వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్సార్టీపి) దీనిలో భాగమేనన్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశంలో ఐదవ అతి పెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్‌ తర్వరలోనే మూడవ స్థానానికి చేరుతుందన్నారు. ఎల్బీనగర్‌ కామినేని జంక్షన్‌ వద్ద రూ. 49 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. హైదరాబాద్‌ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు.

33 శాతం మంది మాత్రమే ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారని, ఎక్కువ మంది ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఆర్టీసి ఆధునీకరణ, ఎల్బీనగర్‌ – అమీర్‌పేట్‌ మెట్రో మార్గం సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభిస్తామని, త్వరలో నాగోల్‌-శంషాబాద్‌ మెట్రో కూడా వస్తుందని, ఎంఎంటిఎస్‌ను యాదాద్రి వరకు పొడిగించనున్నట్లు కేటిఆర్‌ వివరించారు.
tsmagazine

కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల విశేషాలు 124 ఎకరాల్లో 96.5 లక్షల చదరపు అడుగుల్లో గహసముదాయం

  •  రూ.1354.59 కోట్లతో 15,660 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
  • ఒక్కో ఇల్లు విస్తీర్ణం 580 చదరపు అడుగులు
  • ఎస్‌-9, ఎస్‌-10, ఎస్‌-11 అంతస్తులతో 117 బ్లాకుల్లో నిర్మాణం
  • ఒక్కో ఇంటికి రూ.7.90 లక్షల వ్యయం
  • మరో రూ.75 వేలతో మౌలిక సదుపాయాల కల్పన
  • 15 నెలల్లో పూర్తిచేయాలనే లక్ష్యం

సౌకర్యాలు :

అంతర్గత సీసీ రోడ్డు, స్మార్ట్‌ వాటర్‌ డ్రైనేజీ, మంచినీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీతోపాటు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) నిర్మాణం, స్ట్రీట్‌లైట్లు, ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ ఏర్పాటు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, కమ్యూనిటీ కాంప్లెక్స్‌, పాఠశాల అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, బస్టాప్‌, పోలీస్‌స్టేషన్‌, ఫైర్‌స్టేషన్‌, పెట్రోల్‌బంక్‌ నిర్మాణం, వివిధ మతాల ప్రార్థనా స్థలాలు, షియర్‌వాల్‌ సాంకేతిక నిర్మాణం, ప్రతీ బ్లాకుకు రెండుమెట్ల దారి, ప్రతీ మెట్లదారి 3 మీటర్ల వెడల్పుతో నిర్మాణం, ప్రతీ బ్లాకుకు 8 మందిని తీసుకెళ్లే కెపాసిటీ కలిగిన రెండు లిఫ్టులు.