దేశానికి ఆదర్శంగా కాసులపల్లి


స్వచంఛత అంశంలో కాసులపల్లి గ్రామం దేశానికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. గవర్నర్‌ బసంత్‌ నగర్‌లో స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన బట్ట సంచుల తయారీ యూనిట్‌ను, శాంతినగర్‌ లో ఏర్పాటు చేసిన శానిటరీ న్యాప్‌కిన్‌ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పర్యటించిన గవర్నర్‌ గ్రామంలో అమలవుతున్న స్వచ్చ కార్యక్రమాలను పరిశీలించారు. పంచసూత్రాలు గ్రామంలో అమలు చేస్తున్న తీరును గవర్నర్‌ కు కలెక్టర్‌ వివరించారు.

పారిశుద్ధ్య నిర్వహణలో కాసులపల్లి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, గ్రామంలో మురికి కాల్వలను పూర్తి స్థాయిలో నిర్మూలించారని, ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి వినియోగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నారని గవర్నర్‌ ప్రశంసించారు. స్వచ్ఛత నుండి స్వస్థత సాధన దిశగా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రారంభించిన పంచసూత్రాల కార్యక్రమాన్ని కాసులపల్లి గ్రామంలో పకడ్భందిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారని, ప్రతి ఇంటిలో మొక్కల పెంపకం జరుగుతోందని, చెత్త నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని, ఈ స్పూర్తిని కొనసాగించాలని గవర్నర్‌ కోరారు. జిల్లాలో స్వచ్ఛత మెరుగుపర్చడంలో అధికారులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ కలెక్టర్‌ రుపొందించి అమలు చేస్తున్న పంచసూత్రాల కార్యక్రమం మంచి ఫలితాలనందించిందని, దేశంలో పెద్దపల్లి జిల్లా స్వచ్ఛత అంశంలో ప్రథమ స్థానంలో ఉండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కలెక్టర్‌ అవార్డు స్వీకరించడం అభినందనీయమని కలెక్టర్‌ను ప్రశంసించారు.కాసులపల్లి గ్రామంలో ప్రజలను ఏకం చేస్తు స్వచ్ఛత అంశాలను నూరు శాతం పాటించడంలో కృషి చేసిన గ్రామ సర్పంచ్‌ దాసరి పద్మను గవర్నర్‌ అభినందించారు. కాసులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్‌ ను పరిశీలించిన గవర్నర్‌ మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. గ్రామంలో పండ్ల మొక్కల పెంపకం బాగుందని, ప్రతి ఇంటికి స్థానిక ఎమ్మెల్యే పండ్ల మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమని పర్యావరణ సంరక్షణకు అందరు తమవంతు పాత్ర పోషించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

స్వచ్ఛత అంశాలను పరిశీలించేందుకు కాసులపల్లి గ్రామానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌కు గ్రామస్థులు, కళాకారులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సాంస్తికృతిక చిహ్నాలైన బోనాలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్ళతో, వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ గవర్నర్‌ను స్వాగతించారు. కళాకారుల కళాప్రదర్శనలు అందరిని అలరించాయి.

గవర్నర్‌ సెక్రటరీ సురేంద్ర మెహన్‌, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిమనోహర్‌ రెడ్డి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి, జిల్లా ఇంచార్జి డిఆర్వో కె.నరసింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీఒ ఉపేందర్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ దాసరి పద్మ, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.