నగరం నలుమూలలా మార్కెట్లు

ప్రతిపాదనలకు మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆదేశం


నగరం నలుమూలలా మార్కెట్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయవలసిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డును మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకే దగ్గర మార్కెట్‌ ఉండడం మూలంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, నగరంలో డిమాండ్‌ కు అనుగుణంగా నూతన మార్కెట్లు రావాలని అన్నారు.

నూతన మార్కెట్ల ఏర్పాటుతో ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా రైతులకు కూడా ఇబ్బందులు తగ్గుతాయని మంత్రి చెప్పారు. 13 రాష్ట్రాలకు కూరగాయల అమ్మకానికి ప్రధాన మార్కెట్గా బోయిన్‌ పల్లిమార్కెట్‌ ఉన్నదని, దేశంలోని పలు ముఖ్యమయిన ప్రధాన మార్కెట్లలో ఇది ఒకటని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ నగరానికి రోజుకు దాదాపు నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు వస్తుంటాయని, ఒక్క బోయినపల్లి మార్కెట్‌కే 1500 నుండి 2 వేల మెట్రిక్‌ టన్నుల కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతాయని అన్నారు.

మార్కెట్‌ పక్కన ఉన్న ఎల్‌ఐసీ స్థలం లీజుకు లేదా ప్రత్యామ్నాయ స్థలం అప్పగించే ప్రతిపాదన మీద ప్రభుత్వానికి ధరఖాస్తు చేయాలని సూచించారు.రైతులు, వినియోగదారుల సౌలభ్యం దష్ట్యా బోయిన్‌ పల్లి మార్కెట్‌ ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్కెటింగ్‌ శాఖ తరపున నిర్వహిస్తున్న మన కూరగాయలు ప్రాజెక్టు పరిశీలన, దాని విస్తరణకు పలు సూచనలు చేశారు. మార్కెట్‌లో వచ్చే చెత్త నుండి కరంటు తయారుచేసే బయో గ్యాస్‌ ప్లాంట్‌ పరిశీలించాలని, మార్కెట్‌ను మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌లో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టాలని, మార్కెట్లో కొనుగోళ్లకు ఇబ్బందులు కలగకుండా దశలవారీగా రహదారులు నిర్మించాలని మంత్రి సూచించారు. రద్దీని అరికట్టేందుకు సెల్లార్‌ లేదా మల్టీలెవెల్‌ పార్కింగ్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి రైతులు, హమాలీలను కలిసి సమస్యల గురించి ఆరాతీశారు. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి గారు, అదనపు లక్ష్మణ్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.