నవ శకానికి నాంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెవెన్యూ శాఖలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు.

– బండారు రామ్మోహనరావు


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెవెన్యూ శాఖలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు. సెప్టెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రెవిన్యూ శాఖలో మార్పు గురించి రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. ఆరోజు కాకతాళీయంగా ప్రజాకవి కాళోజీ జన్మదినం కూడా అయింది. ‘‘ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం లేదన్న’’ కాళోజీ నారాయణ రావు స్ఫూర్తి తో రెవెన్యూలో కూడా పారదర్శకత, జవాబుదారీ విధానాలను ఆచరణలో అవలంభించడానికి ఆ బిల్లును ప్రవేశపెట్టారు.

రెవెన్యూ శాఖలో ఇప్పటి దాకా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దుర్మార్గానికి భిన్నంగా, రెవెన్యూ శాఖలో వేళ్లూనుకు పోయిన అవినీతి నిర్మూలనకు దారితీసేలా, దానికి శాశ్వత పరిష్కారం లభించే విధంగా ప్రజల జీవితాల్లో ‘‘నవ శకానికి నాంది’’ వాచకం పలికే విధంగా ఈ సంస్కరణలు ఉన్నాయి.
ప్రజలు గత నెల రోజులుగా ఉత్కంఠతో ఎదురు చూసిన రెవెన్యూ సంస్కరణలకు ఒక మంచి రూపం ఇచ్చే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసన సభలో చర్చ తర్వాత అది చట్టంగా మారింది. ఇందులో ప్రధానమైన అంశాలను ఉటంకిస్తూ వాటి మంచిచెడులను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను.

ఇప్పటికే రెవిన్యూ శాఖలో ‘‘అవినీతి అనకొండ’’లంచాల భాగోతాలు బయటపడుతున్నాయి. గతంలో కంటే ఎక్కువగా రెవెన్యూ శాఖ ప్రజలలో పలుచన అయిపోయింది. ప్రజల జీవితాలతో ఆ శాఖలోని ఉద్యోగులు ఇప్పటిదాకా ఆట ఆడుకున్నారు. అందుకే ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తారని ఒక పుకారు వార్త వస్తే దాన్ని ప్రజలు అందరూ స్వాగతించారు. ప్రజలకు రెవిన్యూ శాఖపై, ఆ శాఖలోని అధికారులపై అంత కోపం, కసి పేరుకొని ఉన్నాయి. ఇప్పటి దాక రెవెన్యూ శాఖ అవినీతి బారిన పడనివారు ఎవరు లేరు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న రెవెన్యూ శాఖ సంస్కరణల మీద సమాజం మొత్తం నుంచి ఒక సార్వజనీన ఆమోదం లభించింది. దీన్ని తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే ‘‘మురిగిపోయిన కాలును ఎప్పుడైనా కొట్టి వేయవలసిందే’’ అలాగే భ్రష్టుపట్టిన వ్యవస్థకు కాయకల్ప చికిత్స కాకుండా శస్త్రచికిత్స చేయాల్సిందే అన్న భావన బలపడింది. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో అదే కనపడుతుంది. అందుకే ఈ బిల్లు రెవిన్యూ శాఖలో మౌలికమైన సంస్కరణలకు దారితీస్తాయని నమ్మవచ్చు.

తెలంగాణలో భూము విలువ పెరిగి మానవ సంబంధాలలో దుర్మార్గమైన మార్పు వచ్చింది. మనుషుల ప్రవర్తనలో ఒక ప్రమాదకరమైన ధోరణి కనపడుతోంది. భూమి కోసం, ఆస్తి కోసం అన్నదమ్ములే కాదు తల్లిదండ్రులను చంపిన, చంపుతున్న కేసులు కనపడుతున్నాయి. అలాగే రెవెన్యూ శాఖలో అవినీతి ఆనకొండు పెట్రేగి పోయి కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటున్నారు. ఈ రెవెన్యూ శాఖ బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టిన రోజే మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ ఒక కోటి పన్నెండు లక్షల లంచం చెక్కును తీసుకుంటున్న వైనం బయటపడింది. ‘‘అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న’’ అన్న సామెతను అనుసరించి గతంలో అవినీతి ఆనకొండ నాగరాజును మించిపోయి నగదు రూపేణా కాకుండా చెక్కు, ఇతర వేరే మార్గాలో భూమిని రాయించుకున్న అవినీతి అధికారి తెలివిని మనం చూశాము. నాగరాజు, నగేష్‌ ఇద్దరి పేర్లలోనే కాదు వీరి చేతల్లోనూ అవినీతి నాగు పాము బుసలు కొడుతున్నాయి. అవినీతి సర్పాలు కనిపిస్తున్నాయి. ప్రజలను తమ అవినీతి కోరలతో బహిరంగంగా కాటు వేస్తున్నాయి. అవినీతి రెవెన్యూ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం ప్రవేశపెట్టి అవినీతి ఆనకొండ పని పట్టడానికి ఈ రెవెన్యూ సంస్కరణలు పూర్తిగా పనికివస్తాయి.

సంస్కరణలలో మానవీయ కోణం…
గతంలో ఎన్టీ రామారావు అప్పటి పటేల్‌ పట్వారీ వ్యవస్థను ఒక్క కలం పోటుతో రద్దు చేసినప్పుడు ఉద్యోగులు జీవితాలతో ఆడుకున్నారు. అప్పుడు చిన్నాభిన్నమైన వారి బతుకులు ఇప్పటికి కూడా బాగుపడలేదు. కానీ ఏ సంస్కరణలు అయినా ఆయా రంగాలలోని వ్యక్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాటించారు. అందుకే వీఆర్వో వ్యవస్థ రద్దు అయినా కూడా వారికి ఉద్యోగ భద్రతను పూర్తిగా కల్పించారు. అలాగే నిమ్న కులాలు, బలహీన వర్గాల నుండి వచ్చిన వీఆర్‌ఏ వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి స్కేలు పోస్టును ఇస్తామని చెప్పడం ఆయా వర్గాలకు పూర్తిగా న్యాయం చేయడమే అని చెప్పవచ్చు. గతంలో మస్కూరి, సేక్‌ సింది, గ్రామ సేవకులు, కావలి కార్‌, అనే రకరకాల పేర్లతో పిలిచే వ్యవస్థను వీఆర్‌ఏ వ్యవస్థగా మార్చి ప్రస్తుతం వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూనే, మిగతా ప్రభుత్వ ఉద్యోగులలాగానే స్కేల్‌ పోస్టును ఇస్తామని ప్రకటించడం ముదావహం. రెవెన్యూ సంస్కరణలో ఇలాంటి మానవీయ కోణాలు ఉన్నాయి. ఇప్పటిదాకా రెవెన్యూ ఉద్యోగులకు ఉన్న విచక్షణ అధికారాలను పూర్తిగా రద్దు చేయడం వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. ఒక వ్యవస్థను రద్దు చేయడమే కాదు దాన్ని పునర్నిర్మించాలన్న సూక్తిని కెసిఆర్‌ దీనిలో పాటించారు. రెవిన్యూ కోర్ట్‌ల రద్దు స్థానే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు ఫాస్ట్‌ ట్రాక్‌ ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన మరింత మంచి పని.

అవినీతి నిర్మూలనకు రిజిస్ట్రేషన్ల సంస్కరణలు
ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జరిగే అవకతవకలను అన్ని సవరించి వ్యవసాయ భూములకు ఎమ్మార్వోలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ గా చేయడం మరొక మంచి మార్పు. అన్నిటికంటే ముఖ్యమైనది ‘‘ధరణి’’ వెబ్‌ సైటు ద్వారా రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను పూర్తిగా డిజిటలైజేషన్‌ చేసి వాటిని ప్రజలకు పూర్తి పారదర్శకతతో, జవాబుదారీతనంతో అందించడం మంచి మార్పు. ఇప్పటిలాగా ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఆస్తులను ఎవరుపడితే వారు రిజిస్ట్రేషన్లు చేసుకునే దుర్మార్గం ఉండదు. అలాంటి ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయకుండా కంప్యూటర్‌ లో ఆటోమేటిక్‌ ‘‘లాక్‌ సిస్టం’’ ప్రవేశపెట్టడం వల్ల మరింత జవాబుదారీతనంతో పారదర్శకతతో ఈ చట్టం పని చేస్తుంది. రోజువారి రెవెన్యూ పరిపాలన ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ‘‘మ్యుటేషన్‌’’. వారసత్వంగా కాని భూమి కొనుక్కున్నప్పుడు కానీ వాటి మార్పిడి జరగడానికి అనేక మంది మధ్యవర్తులు అధికారులకు, ప్రజలకు మధ్య బ్రోకర్లు, దళారులుగా వ్యవహరించేవారు. ఈ దళారీ వ్యవస్థను తీసివేయడానికి మ్యుటేషన్‌ చేయడానికి సరళీకృత విధానాలను ప్రవేశపెట్టడం మరింత బాగుంది. అలాగే వారసత్వంగా వచ్చిన ఆస్తిని మార్పిడి చేయడానికి ‘‘ఫౌతినామా’’ఆ విరాసత్‌ విధానంలో స్వీయ అంగీకారం ద్వారా కుటుంబ డిక్లరేషన్‌ ప్రాధాన్యత ఇవ్వడం లంచం లేకుండా సమస్యను పరిష్కరించడానికి పనికి వస్తుంది. ఈ సంస్కరణలు పూర్తిగా మానవీయ కోణాన్ని స్పృశించింది. అలాగే గతంలో 1995, 2005లో వచ్చిన ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ తర్వాత లంచావతారాలు పెద్ద ఎత్తున పెట్రేగి పోయి కోట్ల రూపాయలను ఆర్జించారు. ప్రస్తుతం రెవెన్యూ సంస్కరణ వల్ల ఇప్పటికే డిజిటలైజేషన్‌ చేసిన రికార్డు ఉండడం వల్ల ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి.


కంక్లూజన్‌ టైటిల్‌, టైటిల్‌ గ్యారెంటీ యాక్ట్‌ దిశగా సంస్కరణలు
ఇక ముందు ఈ రెవెన్యూ సంస్కరణలలో భాగంగా జరగాల్సిన అంశాలను అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ వివరించారు. ఆ రెండు సంస్కరణలు జరిగితే రెవెన్యూ లో పూర్తి సంస్కరణలు చేసినట్లు అవుతుంది. అందులో మొదటిది 90 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర సర్వే చేసి కొత్తగా సర్వే నెంబర్లు డిజిటల్‌ మ్యాపింగ్‌ ద్వారా చేయడం అతి పెద్ద సంస్కరణగా నిలిచిపోతుంది. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఈ సర్వేలో భూముల సర్వే నెంబర్ల వారి హద్దు నిర్ణయిస్తారు. దీంతో ఇక భూముల హద్దు వివాదాలకు చెక్‌ పెట్టినట్లు అవుతుంది. ఇక భూమికి సంబంధించిన ‘‘బట్ట నక్షలు,’’ ‘‘టిప్పన్‌’’లు ఇకముందు చిదంబర రహస్యం, బ్రహ్మపదార్థం కాదు. కంప్యూటర్‌ తెర మీద ‘‘తెరచిన పుస్తకాలే’’ అవుతాయి. భూముల సమగ్ర సర్వే తో పాటు మరొక సంస్కరణ జరగవలసి ఉంది. అసెంబ్లీలో వచ్చిన ప్రస్తావనకు, చర్చకు కెసిఆర్‌ తన సమాధానంలో పూర్తిగా వివరించారు. ఆధునిక సర్వే ద్వారా వచ్చిన రికార్డులను చట్టబద్ధం చేసి ‘‘కంక్లూజన్‌ టైటిల్‌’’ ఏర్పాటు చేసి అభివృద్ధి చెందిన దేశాలలో లాగా ‘‘టైటిల్‌ గ్యారెంటీ యాక్ట్‌’’ తీసుకువస్తామని చెప్పారు. భూముల పూర్తి సర్వే, కంక్లూజన్‌ టైటిల్‌ ఏర్పాటు, టైటిల్‌ గ్యారెంటీ యాక్ట్‌ రెవిన్యూ శాఖలో ఈ మూడు సంస్కరణలు చేస్తే అప్పుడు రెవెన్యూ సంస్కరణలు పూర్తిగా అమలు అయినట్లు లెక్క.

రెవెన్యూ సంస్కరణలు మట్టికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెలుపుతాయి. అందుకే మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన ఈ రెవెన్యూ సంస్కరణలు మట్టిని నమ్ముకున్న మనుషులకు ఆశా దీపాలుగా మెరుస్తాయి.”ఇల్లు అకగానే పండుగ కానట్లే’’ వీటి అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్రజలు రెవెన్యూ సంస్కరణలను స్వాగతిస్తున్నారు. ఈ సంస్కరణలు అమలు కేవలం ప్రభుత్వం పని మాత్రమే అని ప్రజలు నిర్లిప్తతతో ఉండకూడదు. ప్రభుత్వంతో ప్రజలు పూర్తిగా సహకరించాలి. అప్పుడే ముందు ముందు ఈ చట్టం అములులో ఎదురయ్యే బాలారిష్టాలు తట్టుకొని ఇది నిలబడాలని ‘‘తెలంగాణ నిలిచి గెలవాలని’’ తెలంగాణ సమాజం సామూహిక ఆకాంక్షగా ప్రతిఫలిస్తుంది.