|

నాకొడుకు కానిస్టేబుల్‌ అయినా చాలు..

policeపోలీస్‌ కమిషనర్‌ డ్రెస్‌ వేసుకున్న ఓ బాలుడు హైదరాబాద్‌ నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి కాన్వాయ్‌తో వచ్చాడు. అతనికి పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వందనం చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఆ బాలుడికి ఒక రోజు బాధ్యతలు అప్పగించి సెల్యూట్‌ చేశారు. బాలుడు కొన్ని ఫైళ్ళను పరిశీలించి సంతకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నగరంలో రౌడీయిజాన్ని అరికట్టి శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తామన్నాడు. ఆ బాలుడి పేరు సాదిక్‌. మృత్యుముఖంలో కొట్టుమిట్టాడుతున్నాడు. తనను పట్టి పీడిస్తున్న క్యాన్సర్‌ మహమ్మారితో ఎప్పుడు ఆయువు పోతుందో తెలియని ఆ బాలుడి చివరి కోర్కె తీర్చడానికి మేక్‌ ఏ విష్‌ సంస్థ ముందుకొచ్చింది. ఆ బాలుడు కోర్కె ఏమిటో కనుక్కొంది. తాను ఒక రోజైనా పోలీస్‌ కమిషనర్‌ను కావాలని ఆ బాలుడు కోరుకున్నాడు. ఆ కోర్కెను నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డికి చేరవేయడంతో ఆయన పెద్ద మనసుతో ఆ బాలుడిని ఒకరోజు కమిషనర్‌ చేయడానికి అంగీకరించారు. అక్టోబర్‌ 15వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆరోజు ఆ బాలుడు పోలీస్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించాడు.

చల్లగా బతికి కానిస్టేబుల్‌ అయితే చాలు..

తన కుమారుడు క్యాన్సర్‌ బారినుంచి బతికి బయటపడి కమిషనర్‌ కాకున్నా కానిస్టేబుల్‌ అయినా సంతోషిస్తానని బాలుడి తండ్రి రహీమొద్దీన్‌ గద్గదస్వరంతో తెలిపారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లిలో ఓ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టులో రహీమొద్దీన్‌ ఉద్యోగం చేస్తున్నారు. సాదిక్‌ అక్కడే పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. వారి కుటుంబంలో బాబాయిలు, పెదనాన్నలు పోలీస్‌ ఉద్యోగులుగా ఉండడంతో తాను పెద్దయ్యాక పోలీసు కావాలని సాదిక్‌కు కోరికగా ఉండేది. ఈ లోపే సాదిక్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌ రావడంతో తండ్రి అతన్ని నగరంలోని క్యాన్సర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం తెలుసుకున్న మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ వారు బాలుడి వద్దకు వెళ్ళి కోర్కె ఏమిటో తెలుసుకున్నారు. తనకు పోలీస్‌ కమిషనర్‌ కావాలని ఉందని ఆ బాలుడు చెప్పడంతో ఈ విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డికి వివరించి బాలుడి కోర్కె తీరేలా కృషి చేశారు.