| |

నీకడుపు సల్లగుండ !

palukubadi– డా|| నలిమెల భాస్కర్‌

సాధారణంగా తెలంగాణలో చాలా మంది తమ మనసులో ఏరకమైన ‘కుటిీలం’ లేకుండా మాట్లాడుతారు. ‘కడుపుల ఇసం పెట్టుకోకుంట’ పలుకరిస్తూ వుంటారు. ఎటువంటి ‘ఎడ్డిర్కం’ లేకుంట ఎదుటివారిని కదుపుతూ వుంటారు. ఇట్లా నిష్కల్మషంగా సంభాషించడం ఇక్కడి వారికి పుట్టుకతో వచ్చిన సంస్కారం. అట్లా ఆలాపించడం వీరికి యిక్కటి మట్టితో అబ్బిన సభ్యత.

తెలంగాణ మట్టి అనగానే ఏదో పులకింత, మరేదో పారవశ్యం. ఇంకేదో జలదరింపు. వేరొక గగుర్పాటు. ‘ఏక్‌ దమ్‌న పెయ్యి పొంట రోమాలు లేశి నిలవడుతయి’. నిజంగానే మట్టికి అంతటి శక్తి వుంటుందా? ఎందుకుండదు? తపస్సు చేసుకోవడానికి హిమవత్పర్వతాల దగ్గరికే ఎందుకు వెళతారు? పైగా రేవా (నర్మదా) నదీ తీరమే ఎందుకు అనుకూలం? అక్కడి మట్టి అంత పవిత్రమైనది. అక్కడి పరిసరాలు అంతటి ప్రశాంతమైనవి. మట్టిని బట్టే మనషుల అలవాట్లూ, సంస్కృతీ సభ్యతలూ, ఆచార సంప్రదాయాలూ, చరిత్రా సంస్కృతులూ… అన్నీ ఏర్పడుతాయి.

తెలంగాణ గడ్డ అతిథి మర్యాదలకు కూడా పుట్టినిల్లు. ఎందరికో నిలువనీడనిచ్చిన స్థలం యిది. తెలంగాణలో పల్లె ప్రజల పలుకు తీరు ముచ్చట గొల్పుతుంది. అప్పుడప్పుడు వాళ్ళ దీవెనల్లో ‘నీ కడుపు సల్లగుండ’, నీ కడుపునంబలి వడ’ వంటివి అలా అలవోకగా అల్కగా దొర్లుతుం టాయి. ఇక్కడ నీ కడుపు చల్లగా వుండనీ అని ‘దీవెనార్తి’ పెడుతున్నారు. అంతేగాక నీ కడుపులో అంబలి పడనీ అని ఆశీర్వదిస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు లౌక్యం తక్కువ. లోపల ఒకటి పెట్టుకుని మీదికి ఒకటి మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. ఇంటికి చుట్టం వచ్చినప్పుడు ‘జెర్ర సల్లవడి పోరాదు బిడ్డా!’ అంటుంటారు. తెలంగాణలో ‘సల్లవడడం’ అంటే తినడం. ఇతర ప్రాంతాల్లో ఎండ చల్లబడడం అని అర్థం. ఇక్కడి ”చల్లవడడానికి” విశేషార్థం వుంది. మనకు కడుపులో జఠరాగ్ని వుంటుంది. పొరపాటున మనం చెడు పదార్థాలు తీసుకుంటే అది వాటి నుండి కాపాడుతుంది. పైగా జఠరాగ్ని (సైన్సులో జఠరరసం) జీర్ణక్రియను సజావుగా సాగేలాగా దోహదపడుతుంది. దాన్ని చల్లబర్చకపోతే కడుపులో మంట తయారవుతుంది. అట్లా ఏదో కొంత చల్లబర్చే పనే తెలంగాణలో ‘సల్లవడుడు’, పై పెచ్చు చల్ల తాగడం కూడా కావచ్చును. మరి అట్లా చల్లబడితే, తింటే ఏమవుతుంది? కడుపులో మంట తగ్గడమే కాకుండా శక్తి వస్తుంది. సత్తా కల్గుతుంది.

తెలంగాణలో ఒక సామెతను చూద్దాం. నాబికాడ సల్లవడితే నవాబు తోని జవాబు చెప్పవచ్చు / సవాల్‌ చెయ్యవచ్చు. అదీ సంగతి! మనుషుల బొడ్డు దగ్గర కాస్త తిండి పడిందనుకోండి, వాళ్ళు ఏకంగా రాజులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలరు. పైగా వాళ్ళనే ఎదురు ప్రశ్నించగలరు. ఎందుకని? ఒకటి తిండివల్ల వచ్చిన బలం. మరోటి యిక్కడి మట్టి మహత్యం. ఇది తరతరాలుగా, ‘పిడీల్‌పిడీలుగా’ ధిక్కార చరిత్ర కల్గిన ధరిత్రి. అధికారం అనేది ఒకవేళ అది కారమై వేధిస్తుంటే తిరగబడే స్వభావం కల్గిన నేల యిది. కుక్కిన పేనులా ముభావంగా వుండిపోయే మట్టికాదు యిది. తన ప్రభావాన్ని బాగా చూపే ప్రత్యేక ప్రాంతం.

అందుకే పాల్కురికిి మార్గ సాహితీని కాదని దేశికవితలో బసవపురాణం రాశాడు. అందువల్లనే పోతన రాజుల్ని రాజులుగా కాక ‘ఇమ్మనుజేశ్వరాధములు’ అన్నారు. వాళ్లకి భాగవతం అంకితం యివ్వను గాక యివ్వను అన్నాడు. కర్ణాట కిరాతకీచకులకు అమ్మను గాక అమ్మను అన్నాడు. ఇక… తెలంగాణలోని ఆధునిక ఉద్యమాల చరిత్ర అందరికీ తెల్సిందే! తెలంగాణ వీరోచిత రైతాంగ పోరాటం అంతా నాలుగువేల మంది ‘నెత్తురు సాక పోసిన’ చరిత్ర 1969నాటి తెలంగాణ ఉద్యమం నాలుగువందల మంది పొడుగునా గుండె నెత్తురులు తుపాకీ గుండ్లకు తర్పణచేసిన చరిత్ర నిన్న మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైతే అహింసా మార్గంలో సాగిన అత్యద్భుతమైన ఉద్యమం. ఇదంతా మట్టిమహిమ.

మళ్ళీ ఒక్కమారు మృత్తికామహత్తునీ, ఉద్యమాల చరిత్రనీ పక్కనపెట్టి ఇందాకటి మాటల దగ్గరికి వద్దాం. తెలంగాణలోని ‘సల్లవడు’ మొదలైన వాటికి చాలా చరిత్రవుంది. పూర్వం అంటే మా బాల్యంలోనే పాడివున్నవాళ్ళు నాలుగైదురోజులకో సారి చల్ల చేసే వాళ్ళు. ఫలానా రోజున చల్ల చేస్తు న్నామనీ, వచ్చి తీసుకువెళ్ళ మనీ ఇరుగూ పొరుగుకు చెప్పేవాళ్లు. ఉచితంగానే చల్లపోసే వాళ్ళు. తెలంగాణ ప్రజలకు ‘చల్ల’తో వున్న అనుబంధం అంతా యింతా కాదు. తిండిలో ‘చల్ల మిర్పకాయలు’ అప్పుడప్పుడు పెట్టుకునే వాళ్ళు. ‘చల్ల పులుసో, చల్లచారో’ చేసుకునే వాళ్ళు. నిజానికి ‘చల్ల’ అంటే చల్లగా వుండేది. పైగా మనకు చల్లదనాన్ని యిచ్చేది (శరీరానికి). అంటే చల్వ చేసేది అని అర్థం. తెలంగాణలో ‘మజ్జిగ’ అనే మాట దాదాపు ఇనబడదు. ‘చల్లకు వచ్చి ముంత దాచినట్లు’ అనే సామెతలో కూడా ‘చల్ల’ పదమే వుంది. మధురానగరిలో చల్లలమ్మ బోదు దారి విడుము కృష్ణా’ అనే కీర్తనలో సైతం చల్లనే వుంది. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన’ అనే ఒకటి రెండు చోట్ల ‘మజ్జిగ’ ప్రస్తావన ఉంటుంది.

ఇక ‘అంబలి’ గురించి. ‘నీ కడుపున అంబలి పడనీ’ అనే దీవెనతో ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళు అంబలి తాగే వేళను సూచిస్తుంది. తెలంగాణలో నేతి బీరకాయల్ని సైతం ‘అంబలి బీరకాయలు’ అనే అంటారు. నెయ్యి వున్నవాళ్ళది, అంబలి లేనివాళ్ళది. అంబలి కూడా నెయ్యిలాగే చిక్కగా చక్కగా నున్నగా స్నిగ్ధంగా వుంటుంది. అందుకే తెలంగాణ మాట ప్రత్యే కంగా ఉంది. రాయలసీమకు రాగి సంకటిలా తెలంగాణలో చల్లా అంబలి గట్కా మొదుుులైనవి వున్నాయి. దేని ప్రత్యేకత దానిదే మరి! చిత్రంగా తెలంగాణ వాళ్ళకి ‘చల్ల చెమటలు’ పోస్తే యితరులకి ముచ్చెమటలు పోస్తాయి.