నూరురోజుల్లో ఊరు మారింది !

బుక్కా అశోక్‌
tsmagazine

కోనాయపల్లి (పీబీ) ఓ మారుమూల అటవీ ప్రాంత గ్రామం. వ్యవసాయ పంటలు పండించుకొని జీవించడం వీరి ప్రధాన వృత్తి. ప్రధానంగా కూరగాయలు పండించడంలో ఈ ఊరు రైతులకు పెట్టింది పేరు. వ్యవసాయ పనులు మినహా ఇతర వ్యాపకాలేమి గ్రామస్తులకు ఉండవు.

ఇలాంటి గ్రామస్తులు నిత్యం స్వచ్ఛభారత్‌ చేపట్టి ఊరును నందనవనం చేశారు. ఇందులో ఒకరేంటి ఊరంతా కలిసి శ్రమదానం చేస్తున్నారు. గ్రామస్తులు అభివృద్ధిని ఒక ఉద్యమంలా చేపట్టడంతో కేవలం 100 రోజుల్లోనే గ్రామంలో కొన్ని దశాబ్ధాలుగా చేయలేని అభివృద్ధి సాద్యమైంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు అందరు కలిసి స్వచ్ఛ ఉద్యమాన్ని ప్రతిరోజు చేపడుతూ, గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగాన్ని ఆకర్షించి భవిష్యతు గ్రామ సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే ప్రయత్నం గ్రామంలో ఒక గొప్ప మార్పుకు బీజాలు వేసినట్లు అయ్యింది.

మూడేళ్ల క్రితం మల్కాపూర్‌లో స్వచ్ఛ భారత్‌ చేపట్టి వారం వారం నిర్వహిస్తుండగా, కోనాయపల్లి గ్రామస్తులు నిత్యం స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తున్నారు. మల్కాపూర్‌ గ్రామస్తులు మూడేళ్లలో తీసుకొచ్చిన మార్పును కోనాయపల్లి గ్రామస్తులు 100రోజుల్లోనే తీసుకొచ్చారు. ఇందుకు ఓ బలమైన కారణం కూడా

ఉంది. మల్కాపూర్‌ గ్రామంలో 2018 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభించేందుకు రావడమే. అప్పటికీ 14రోజుల క్రితం వరకు మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామంగా కోనాయపల్లి(పీబీ) ఉంది. సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ‘కంటివెలుగు’ పథక ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం కోనాయపల్లి గ్రామస్తులకు దక్కలేదు. దాంతో గ్రామస్తుల్లో కసి, పట్టుదల పెరిగిపోయింది. మల్కాపూర్‌కు దీటుగా కోనాయపల్లి (పీబీ) గ్రామాన్ని తీర్చిదిద్దాలని నిశ్చయించారు. మల్కాపూర్‌ గ్రామస్తులు వారం వారంగా ఆదివారం స్వచ్ఛభారత్‌ చేపడితే, కోనాయపల్లి(పీబీ) గ్రామస్తులు ఏకంగా నిత్యం స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

సీఎం వచ్చిన తెల్లారే అంటే ఆగస్టు 16 నుంచే కోనాయపల్లి(పీబీ) గ్రామంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం మొదలైంది. వీరి స్పూర్తితో ఇప్పటికీ కొన్ని గ్రామాలు అభివృద్ధి బాట పట్టడం అభినందనీయం. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలో చిట్టచివరి గ్రామం కోనాయపల్లి (పీబీ). గ్రామంలో 160 నివాస గహాలుండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 366 మంది పురుషులు, 335 మంది మహిళలుగా 701 మంది నివసిస్తున్నారు. 2002 సంవత్సరానికి పూర్వం తీవ్రవాద ప్రాబల్య గ్రామంగా గుర్తింపు. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం దొమ్మాట నియోజకవర్గ పరిధిలో ఉండగా, తరువాత తూప్రాన్‌ మండలంలోని గ్రామంగా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో చేర్చారు. తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కోనాయపల్లి (పీబీ) ఇటీవలనే నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటైంది.
tsmagazine

ఆదర్శ గ్రామం మల్కాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో శివారు గ్రామంగా ఉన్నప్పటికీ, స్వచ్ఛభారత్‌పై పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. మల్కాపూర్‌ గ్రామంను అప్పటి జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ దత్తత తీసుకోవడం, రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా తయారైంది. ఆదర్శ గ్రామం మల్కాపూర్‌ను సందర్శించాలన్న ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గత ఆగస్టు 15న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ పథకంకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో మల్కాపూర్‌ గ్రామస్తులకే పాల్గొనే అవకాశం కల్పించారు. మల్కాపూర్‌ పంచాయతీలో శివారు గ్రామంగా కొనసాగిన కోనాయపల్లి(పీబీ) గ్రామస్తులకు సీఎం కేసీఆర్‌ సభలో పాల్గొనే అవకాశం కల్పించలేదు. ఆదర్శ గ్రామంగా తయారవ్వడంతోనే మల్కాపూర్‌ గ్రామంను సీఎం కేసీఆర్‌ సందర్శించారని, తమ గ్రామాన్ని ఆదర్శంగా తయారు చేసి సీఎం కేసీఆర్‌ను రప్పించుకుందామనుకున్నారు.

ఈ విషయంలో గ్రామస్తులందరికీ కసి, పట్టుదల పెరిగిపోయింది. ఇంకేముంది ఆగస్టు 16న గ్రామంలో స్వచ్చభారత్‌కు శ్రీకారం చుట్టారు. మల్కాపూర్‌ గ్రామస్తులు ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మల్కాపూర్‌ గ్రామస్తులు వారం వారం స్వచ్ఛభారత్‌ చేపడితే, కోనాయపల్లి (పీబీ) గ్రామస్తులు రోజు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపడుతున్నారు. ఆగస్టు 16న స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపడుతూ, మద్యపాన నిషేదంపై నిర్ణయం తీసుకున్నారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులే ప్రణాళికలు వేసుకున్నారు.

గ్రామంలో అభివృద్ధికి ఎనిమిది కమిటీలు రూపొందించుకున్నారు. ఇందులో 15 మందితో కమిటీని ఏర్పాటు చేసుకోగా, ప్రధానంగా ఐదుగురు యువత, ఐదుగురు మహిళలు, ఐదుగురు పెద్దలకు అవకాశం కల్పించారు. గ్రామంలో త్రాగునీటి కమిటీ, వ్యవసాయ కమిటీ, పౌష్టిక ఆహార కమిటీ, విద్యా కమిటీ, మౌలిక వసతుల కమిటీ, సామాజిక వనరుల కమిటీ, పారిశుధ్య కమిటీ, హరితహార కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధిలో ఈ కమిటీలు ప్రధాన భూమిక పోషించే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

రోజు స్వచ్ఛభారత్‌ చేపట్టిన కోనాయపల్లి గ్రామాన్ని ఆగస్టు 21న ‘గడ’ ప్రత్యేక అధికారి, ప్రస్తుత సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు సందర్శించారు. గ్రామస్తుల పట్టుదలకు ఫిదా అయిన హన్మంతరావు గ్రామాన్ని ‘దత్తత’ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామానికి కొన్ని వరాలుగా యూత్‌ లైబ్రరీ భవనం, వైకుంఠధామం మంజూరు చేశారు. గ్రామంలో పచ్చదనం చేసేందుకు 100 కొబ్బరి మొక్కలు అందజేస్తున్నట్లు ప్రకటించి, గజ్వేల్‌ అర్బన్‌ పార్కు నుంచి అరుదైన మొక్కలు గన్నేరు, దేవగన్నేరు, పగొడ, మహగని, తబోబియా, దానిమ్మ, జామ, గులాబి మొక్కలు అందజేశారు. హన్మంతరావు అందజేసిన సహకారంతో గ్రామంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంతోపాటు, పచ్చదనం, శానిటేషన్‌, అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా నిర్వహించారు.

సెప్టెంబరు 4న గడ ప్రత్యేక అధికారి హన్మంతరావు బదిలీ కావడంతో, 5న గడ ప్రత్యేక అధికారిగా ఏ. ముత్యంరెడ్డి బాధ్యతలు స్వీకరించగానే కోనాయపల్లిని సందర్శించారు. కోనాయపల్లి బాధ్యతను తీసుకుంటానంటు ముత్యంరెడ్డి
tsmagazine
గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తు, నిత్యం స్వచ్ఛభారత్‌ చేపడుతున్న కోనాయపల్లి గ్రామంపై అధికారుల దృష్టి పడింది. సెప్టెంబరు 12న కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల అధికారులు కోనాయపల్లి గ్రామ సందర్శనకు విచ్చేశారు. 16న ఎన్‌ఐఆర్డీ నుంచి మూడు రాష్ట్రాల బృందం కోనాయపల్లి సందర్శించి, గ్రామంలో శానిటేషన్‌, ఆదాయ వనులపై సర్వే నిర్వహించారు. నెలన్నర రోజుల్లోనే కోనాయపల్లి గ్రామం అధికార యంత్రాంగాన్ని ఆకర్షించింది.

అక్టోబరు 2న గాంధీ జయంతీ వేడుకలు జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి కోనాయపల్లి(పీబీ)లోనే నిర్వహించారు. ‘స్వచ్ఛత సేవ’ కార్యక్రమం ముగింపును కోనాయపల్లిలో కలెక్టర్‌ ధర్మారెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా కోనాయపల్లి గ్రామస్తులకు స్వచ్ఛత అవార్డును కలెక్టర్‌ అందజేశారు. యేడాదికల్లా 469 గ్రామ పంచాయతీలలో ఈ గ్రామ స్పూర్తితో స్వచ్ఛత వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. కోనాయపల్లి గ్రామస్తులు తమ గ్రామాన్ని స్వచ్ఛత వైపు అడుగులు వేయిస్తు మరిన్ని గ్రామాలను స్వచ్చత వైపు నడిపించేందుకు నడుం బిగించారు. అక్టోబరు 4న శివ్వంపేట మండలం గంగాయపల్లికి వెళ్లి గ్రామస్తులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. 7న దాతర్‌పల్లికి వెళ్లి గ్రామంలో లక్ష మొక్కలు నాటే లక్ష్యంలో మొదటి మొక్కను నాటి, గ్రామంలో మద్యపాన నిషేదంపై ప్రతిజ్ఞ చేయించారు.

2015 డిసెంబరు 6 న మల్కాపూర్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపట్టి, 2017 అక్టోబర్‌ 29 నాటికి 100 వారాల లక్ష్యం పూర్తి చేసుకున్నారు. మల్కాపూర్‌

గ్రామస్తులకు రెండేళ్ల సమయం పట్టగా, కోనాయపల్లి గ్రామస్తులు 100రోజుల పండుగా నవంబరు 23నాటికి సాధించారు. ఆ రోజు గ్రామంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలో స్వచ్ఛభారత్‌ చేపట్టి అందంగా ముగ్గులతో తీర్చిదిద్దారు. ఊరంతా పండుగ జరుపుకుంటు ‘కేకు’ కట్‌ చేసి 100 రోజుల స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఆదర్శ గ్రామంగా తయారు అయ్యేందుకు మల్కాపూర్‌ గ్రామస్తులకు ఏండ్ల సమయం పట్టగా, కోనాయపల్లి (పీబీ) గ్రామస్తులకు రోజులే పట్టింది. పట్టుదల ఉంటే ఏదైన సాధించ వచ్చంటు కోనాయపల్లి (పీబీ) గ్రామస్తులు నిరూపిస్తున్నారు.

కోనాయపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్‌ ప్రస్తుతం 128 రోజులు (డిసెంబరు 21 నాటికి) పూర్తి చేసుకుంది. గ్రామస్తులు చేయిచేయి కలిపి చేపట్టిన స్వచ్ఛభారత్‌తో కోనాయపల్లి (పీబీ) గ్రామం ఒక సుందర గ్రామంగా తయారైంది. ఇతర గ్రామాలకు ఒక మార్గదర్శక గ్రామంగా రూపొందింది.