నేతన్నలకు బీమా ధీమా

రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు బీమా తరహాలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి త్వరలో చేనేత బీమా అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. రైతులు దురదృష్టవశాత్తూ మరణిస్తే రైతు బీమా కింద వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వచ్చేలా చేసినట్టే, నేత కార్మికుడు చనిపోయినా అతడి కుటుంబం ఖాతాలో రూ.5 లక్షల రూపాయలు పడతాయని సి.ఎం చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని, నర్సింగ్‌ కాలేజీ, మార్కెట్‌ యార్డు, తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో  పేదలకు 1320  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయాన్ని, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని మంత్రి కె.టి. రామారావుతో కలసి  ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ప్రసంగిస్తూ, చేనేత రంగాన్ని ఆదుకోవడానికి త్వరలో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

‘‘కొన్ని విషయాలు తలచుకుంటే బాధ అనిపిస్తది. గతంలో ఓసారి సిరిసిల్లలో రాత్రిపూట సమావేశం పెట్టి సిరిసిల్ల పట్టణం మీదుగా సిద్ధిపేటకు పోతున్నం. గోడలమీద అప్పుడున్న జాయింట్‌ కలెక్టర్‌  ‘ఆత్మహత్య చేసుకోకండి. చావు పరిష్కారం కాదు.’ అని రాయించిండు. గిన్నేండ్ల స్వాతంత్యం తర్వాత గివ్వా మనం చూసే దరిద్రం అని మేం అనుకున్నం. ఇక్కడ చేనేత కార్మికులది దారుణమైన పరిస్థితి. రోజూ చచ్చిపోయేది. ఇక్కడ చేనేత వాళ్ళున్నరు. మరమగ్గాల వాళ్ళున్నరు. వాళ్ళు రకరకాల పద్ధతుల్లో జీవిస్తున్నరు. వాళ్ళను ఆదుకోవడానికి ఏంచేద్దామా అని ఆలోచించినం.రాష్ట్రంలో నిరుపేదలు పండుగరోజు కొత్త చీర కట్టుకోవడానికి అవకాశం ఉంటదనే ఉద్దేశంతో ‘బతుకమ్మ చీరలు’ అని స్కీం తెచ్చినం. చీరలు ఇక్కడ నేయిస్తున్నాం.’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

బతుకమ్మ చీరలు సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు కొంత అన్నం పెట్టినయ్‌. కొంత ఆదుకున్నయ్‌. అగ్గిమీద నీళ్ళు చల్లినట్టు ఇప్పుడు కొంత రిలీఫ్‌ వచ్చింది.కేటీఆర్‌ దగ్గరే ఆ శాఖ ఉన్నది కాబట్టి ఆయన తిప్పలపడి మరమగ్గాలను మంచిగ చేపిచ్చుడో, కొంత పని ఇప్పిచ్చుడో చేసి ఆ కార్మికులకు కనీసం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల జీతం వచ్చేలా చర్యలు తీసుకున్నరు. కానీ, పూర్తిగా దరిద్రం పోలే. వాళ్ళ గురించి ఇంకా చాలా జరగాల్సిన అక్కెర ఉన్నది. అని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీమీద నూలు, రసాయనాలు, రంగులు అందజేస్తున్నామని సి.ఎం గుర్తుచేశారు.

57 ఏళ్ళకే పింఛన్లు

గత ఎన్నికలలో హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు నుంచి 57 ఏళ్ళు నిండిన వారిలో అర్హులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.  నర్సింగ్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతామని, త్వరలో రెండోవిడత గొర్రెల పంపిణీ జరుగుతుందని సీ.ఎం ప్రకటించారు.

ఆరేళ్ళలో రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతం జరిగిందని, వ్యవసాయ రంగంలో సంస్కరణల ఫలితంగా వలస వెళ్ళిన రైతులు వాపస్‌ వస్తున్నారని, ఇది తెలంగాణ తన పునాదిని మళ్ళీ బలంగా తయారు చేసుకుంటోందనే దానికి సంకేతమని సీ.ఎం. చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కేసీఆర్‌ ప్రయాణాన్ని ఆపలేరు. లక్ష్యం ఏర్పాటుచేసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టే, తెలంగాణ ముందుకు పోతోందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంతటికీ సాగునీరు

గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ఎకరం, గోదావరి సాగునీటి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం అనంతరం, సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తెలిపారు.

సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సాగునీటి పారుదలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగుభూములకు మళ్లించడానికి ప్రాణహితను ఆధారం చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్నో కష్టాలుపడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాం. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరమున్నది. కరువు వచ్చినపుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రాముఖ్యత మరింత అర్థమవుతుంది. అటువంటి కరువు కష్టాలను అధిగమించడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టుకున్నం. ఇక నుంచి కరువుకు కాలానికి సంబంధం లేకుండా ఏ కాలం లోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు మన చేతిలో ఉన్నయ్‌. వాటిని ఎట్లా వాడుకుంటామనేదే తెలివితో ముడిపడి ఉంది’’ అని సీఎం అన్నారు.

నీళ్లను ఎత్తిపోసి నిండుకుండలా జలాశయాలను నిర్మించుకున్న తర్వాత కూడా గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్‌, వరంగల్‌, అదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదని సీఎం అన్నారు. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో గోదావరి జలాలు మూలమూలనా ప్రవహించాలన్నారు. అందుకు చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తిపోసుకోవాలన్నారు. ఎత్తు మీదినుంచి తిరిగి గ్రావిటీ విధానం ద్వారా (మిషన్‌ భగీరథ పద్ధతిలో) సాగునీటిని పొలాలకు మళ్లించుకోవాలన్నారు.

మిషన్‌ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారిన నేపథ్యంలో వాటిని ముందుగా గోదావరి జలాలతో నింపు కోవాలన్నారు. ఈ రాడార్‌ పరిధిలో అన్ని చెరువులను నూటికి నూరు శాతం నింపాలని సీఎం తెలిపారు. ‘‘నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే’’ అని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండలస్థాయి ఇరిగేషన్‌ అధికారులు కూర్చొని, సాగు నీరును మూలమూలనా ఎట్లా పారించాలో చర్చలు జరపాలన్నారు. కాంటూర్‌ లెవల్స్‌, ఎంఎండిఎల్‌తో సహా అన్ని రకాల సాంకేతిక అంశాల పట్ల అవగాహన పెంచుకొని, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఒక్క గ్రామమూ, ఒక్క ఎకరమూ వదలకుండా తడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి  కేటీఆర్‌, ఎమ్మెల్యేలు సహా ఇరిగేషన్‌ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

నెత్తిమీద నీళ్లు పెట్టుకొని కరీంనగర్‌ జిల్లా బాధపడటం సరికాదన్నారు. అప్పర్‌ మానేరు కరీంనగర్‌ జిల్లా వరదాయని అని, అప్పర్‌ మానేర్‌ కు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఇకనుంచి కరీంనగర్‌ జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాటు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ టెయిల్‌ ఎండ్‌ ప్రాంతాల్లోనే నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు, ప్రాజెక్టుల పక్కన, రిజర్వాయర్ల వెంట ఉన్న బాల్కొండ, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్‌, మానకొండూర్‌, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో నీరు లభించకపోవడమేమిటి అని ప్రశ్నించారు. ఎత్తైన ప్రదేశాల్లో కూడా నీరు అందేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ప్రతి ఎకరానికి తెలివితో సాగునీటిని సాధించుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చొని నివేదికను సిద్ధంచేసి తనకు అందించాలని సీఎం తెలిపారు.

మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్‌ సీఎంను అభ్యర్థించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం, ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిని సందర్శిస్తానని సీఎం తెలిపారు. నిజాం సాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు నిజాం సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఐ.టి, మున్సిపల్‌ శాఖామంత్రి కేటీఆర్‌, ఆర్‌ అండ్‌ బి శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భాను ప్రసాద్‌, రఘోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, విద్యాసాగర్‌ రావు, కోరుకంటి చందర్‌, జెడ్పీ ఛైర్మన్‌ ఎన్‌. అరుణ కుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, సీఎం సెక్రటరి స్మితా సబర్వాల్‌, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, సిరిసిల్లా జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, ఇ.ఎన్‌.సిలు వెంకటేశ్వర్లు, హరిరామ్‌, నీటిపారుదల అధికారులు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.