|

నోరు అంత పోంగ ఒర్రుడు

తెలంగాణ భాష విలక్షణమైనది. ఆధునిక ప్రమాణ తెలుగు భాషతో పోల్చినపుడు కొన్ని విషయాల్లోనైనా విభిన్నమైనది. ఉదాహరణకు తెలుగు భాషలో వున్న శకట రేఫము తెలంగాణ భాషలో మార్పుకు గురవుతున్నది. ఆ రేఫము తెలంగాణ మాటలో సాదురేఫముగా మారి ద్విరుక్తమవుతున్నది. (అన్ని సందర్భాల్లో కాదు)

”తారుమారు’ అనేది తెలుగు పదం. ఇది తెలంగాణలో ‘తిర్రమర్ర’ అవుతుంది. తారుమారులోని రెండుమార్లు వచ్చిన శకట రేఫం తెలంగాణ పదంలో సాధురేఫంగా మారడమేగాకుండా ద్విరుక్తంగా మారింది. అంతేగాక ‘తాతుమాటు’లోవున్న శకటరేఫాల ఉత్వం పోయింది. అదనంగా ‘తారుమారు’లోని ‘తా, మా’లు ‘తి’, ‘మ’లుగా పరిణమించినై. మొత్తమ్మీద ప్రధానమైన మార్పు బండి ‘ఱ’, మామూలు ‘ర’గా మారి ద్విరుక్తం కావడం (ఒక హల్లుకు అదే ఒత్తు రావడం ద్విరుక్తం). ‘కొఱవి’ తెలుగులోని మరొకమాట. అదే తెలంగాణలో ‘కొర్రాయి’ అవుతుంది. సగం కాలిన మండుతున్న కర్ర ‘కొర్రాయి’ కొఱవిలోని ‘ఱ’, కొర్రాయిలో ‘ర్రా’గా కనబడుతున్నది! పైన చెప్పిన ప్రధానమైన రెండు మార్పులతోపాటు అదనంగా దీర్ఘం కూడా వచ్చి చేరింది. అట్లాగే ‘గుఱక’, ‘గుర్రు’ అవుతున్నది తెలంగాణలో. ‘వాడు గుర్రు గొడుతున్నడు’ అంటే గుఱక పెడుతున్నాడని అర్థం. తెలుగు ‘జోఱిగ’ తెలంగాణ ‘జొర్రీగ’ అవుతున్నది. వానపామును ‘ఎర్ర’ అంటారు తెలంగాణలో. ఇది నిజానికి ‘ఎఱ’. ఆ ‘ఎఱ’ ఎర్రగా మారింది. శబ్ద రత్నాకరంలో ‘ఎఱ్ఱ’ రూపమూ వుంది. అట్లాగే ‘అఱ’ (గది) తెలంగాణలో ‘అర్ర’ అయ్యింది. దేవునర్ర, దొంతులర్ర మొదలైన పదాల్లోనివి ఈ అర్రలే! నిఘంటువుల్లో ‘అఱ’తోపాటు ‘అఱ్ఱ’ పదమూ వుంది. నిజానికి యిది తమిళ పదం ‘అఱై’. ఆ ఐకారాంతం అకారాంతం కావడం తెలుగుతనం. ‘జఱజఱ’ లాక్కపోవడం అనేది తెలంగాణలో ‘గొర్రగొర్ర గుంజుకపోవుడు’ అవుతున్నది. శకటరేఫం ద్విరుక్త సాధురేఫంగా మారింది. అదనంగా ‘జఱజఱ’లోని ‘జ’ తెలంగాణలో ‘గొ’గా మారింది. జ, గలు పరస్పరం మారుతుంటాయి. జుంజుఱు వెండ్రుకలు గుంగురెంటికలు అవుతున్నాయి తెలంగాణలో.
tsmagazine
బిలం, రంధ్రం, పర్వతరంధ్రం, గొయ్యి మొదలైన అర్థాలు కలిగిన ‘బొఱియ’ అనే పదం తెలంగాణలో ‘బొర్రె’ అవుతున్నది. ‘పఱియ’ అనే మాట పర్రె అవుతున్నది. (చాకలి పర్రె). ‘పఱపఱ చించుడు’ తెలంగాణలో పర్రపర్ర చింపుడుగా మారిపోయింది. ఇక.. చుఱచుఱ మండటం అనేది కాల్లు సుర్ర సుర్ర కాలుతున్నె’ అనే వాక్యంలో మార్పుకులోనై కనిపిస్తున్నది.

‘వాని ఒర్రుడు పాడుగాను, నోరు అంతా పోంగ వొర్రుతున్నడు’లోని ‘ఒర్రుడు’ ఏమిటి? అదే అరవడం. ‘అఱచు’ అనే క్రియ ‘ఒర్రు’ ఒఱలు అంటే విలపించడం. బిగ్గరగా ఏడ్చేటప్పుడు కూడా ధ్వని పెద్దగా వుంటుంది కనుక, అది ఒర్రుడు అయి వుండాలి మరి.

‘ఇఱియు’ అంటే ‘నలగు’ అని అర్థం. అంటే నలిగిపోవటం. ‘చలికి పెయ్యి ఇర్రుఇర్రుమంటున్నది’ అనే తెలంగాణ వాక్యంలోని ఇర్రు’ బహుశ ‘ఇఱియు’నుంచి వచ్చి వుంటుంది. చలిబాధతో శరీరమంతా బాధతో నలిగిపో వడం, దురద పెట్టినట్లు కావటమే ‘ఇర్రు ఇర్రుమనుడు’.

కొఱమీనులు తెలంగాణలో ‘కొర్రమట్టలు’ అవుతున్నాయి. ఈ అన్ని సందర్భాల్లోనూ ‘ఱ’ తెలంగాణలో ‘ర్ర’గా మారిపోతున్నది. ‘బఱబఱ’ ఈడ్చు అనే క్రియ తెలంగాణలో మరొక అర్థంతో బర్రబర్ర అవుతున్నది. ఇక్కడ దురదతో గోకడం అనే అర్థం.

‘మర్రవడుడు’ అనేది తెలంగాణ క్రియ. అంటే ప్రతి ఘటించడం, తిరుగుబాటు చేయడం, ఎదురు తిర గడం, మాటకు మాట జవాబు చెప్పడం వంటి అర్థఛాయలున్నాయి. మర్రవడుడుకు. ఇది బహుశ ‘మాఱొడ్డు’నుండి వచ్చి వుంటుం ది. అర్థం తిరుగుబాటు చేయు అనే!

తెలుగుబాషలోని ‘ఱ’ తెలంగాణలో ‘ర్ర’గా మారుతుంది అని చెప్పుకున్నాం కదా! చిత్రంగా ఉర్దూ లోని ‘జరా’ (కొంచెం) తెలంగాణలో ‘జెర్ర’ అవుతుంది. తెలుగుభాషా పదాల్లోని సాధురేఫం సైతం కొన్ని సమయాల్లో ‘ర్ర’గా మారిపోతున్నది. ‘చొరబడు’, చొరచేయు అనే పదం తెలంగాణలో ‘సొర్రగొట్టుడు’ అవుతున్నది. సొర్రగొట్టడం అంటే జొనపడం. అట్లాగే బరివెంకచెట్టు (పక్కె), బర్రెంక అయ్యి, బరి (పార్శ్వము) ఎముకలు బర్రెంకలు అవతున్నై.

తెలంగాణలో ‘నడితర్ర మనుషులు అని. నడితర్రలోని ‘తర్ర’ అనేది ఉర్దూ ‘తరహా’నుండి వచ్చి వుంటుంది. ‘తరహా’లోని ‘ర’ ‘ర్ర’గా మారింది. తెలంగాణ మాటలో. దీన్నే తమిళంలో ‘నడుత్తర మనిదర్‌గళ్‌’ అంటున్నారు. తమిళ ‘నడుత్తర మనిదర్‌గళ్‌’కూ, తెలంగాణ నడితర్ర మనుషులకూ ఎంత దగ్గరి సంబంధం వుంది! ఏమైనా తెలుగు భాషలోని ఱ, రలు కొన్ని సందర్భాల్లో తెలంగాణలో ‘ర్ర’గా మారుతున్నాయి.

 

డా|| నలిమెల భాస్కర్‌