‘పత్రికా రంగంలో మేరు శిఖరం’


తెలుగు పత్రికా రచనలో, సాహిత్యంలో ఆజాను బాహుడైన గోరా శాస్త్రి సంపాదకీయాలు, నాటికలు, కథలు ఈ తరం వారికి చేరువ చేయవలసిన అవసరం ఎంతగానో ఉందని భారత ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు.కేంద్ర సాహిత్య అకాడెమీ, వయోధిక పాత్రికేయ సంఘం గోరా శాస్త్రి శత జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సదస్సును యం. వెంకయ్య నాయుడు హైదరాబాద్‌ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో ప్రారంభిస్తూ ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా వయోధిక పాత్రికేయ సంఘం ప్రచురించిన గోరాశాస్త్రి వ్రాయగా ప్రజాదరణ పొందిన శీర్షిక ‘వినాయకుడి వీణ’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ముఖ్యంగా ఈతరం పాత్రికేయులు వారి జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం కూడా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. గోరాశాస్త్రి పాటించిన విలువలు కర్తవ్య నిష్ఠ, వెనకడుగువేయని తత్వాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గోరాశాస్త్రి పేరును అక్షరాస్యులైన తెలుగు జనులు కృతజ్ఞతతో తలుచుకుంటారనీ, ఆయన సంపద రూపాయలది కాదు, అక్షరాలది. అందుకే అవి అక్షరాలా సంపద అయ్యిందని వెంకయ్య నాయుడు అభివర్ణించారు.

తొలుత సాహిత్య అకాడెమీ కార్యదర్శి కె. శ్రీనివాస రావు స్వాగతం పలుకుతూ- అకాడెమీ సాహిత్య సేవకు ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొంటూ గోరాశాస్త్రి శత జయంతిని పురస్కరించుకుని లోగడ ఆయనపై తాము ప్రచురించిన ”మోనో గ్రాఫ్‌”ను మూడవసారి పునర్ముద్రించినట్లు వివరించారు.

ప్రారంభోపన్యాసం చేసిన వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు బి.ఎస్‌. వరదాచారి ప్రసంగిస్తూ – గోరాశాస్త్రితో తాను 21 సంవత్సరాలు కలిసి పని చేశానని, సంపాదకీయమే కాదు ఏ రచన చేసినా గోరా శాస్త్రి పరీక్ష వ్రాస్తున్నంత దీక్షతో వ్రాసేవారనీ, పాఠకులు వాటికి మార్కులు వేస్తారనేవారన్నారు.

సభకు అధ్యక్షత వహించిన సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సంచాలకులు కె. శివారెడ్డి ప్రసంగిస్తూ గోరాశాస్త్రి నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండ బద్దలు కొట్టినట్టు తన రచనల ద్వారా చెప్పారన్నారు.

”వినాయకుడి వీణ” గ్రంథాన్ని పరిచయం చేసిన వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షుడు ”వినాయకుడి వీణ” సంకలనకర్త టి. ఉడయవర్లు ప్రసంగిస్తూ – మానవమాతృలలోని, సమాజంలోని చెడు మనకు కలిగించే ఏవగింపును, నవ్వును వ్యక్తం చేస్తూ, సాహిత్య గౌరవం నిలుపుతూ గోరాశాస్త్రి వ్రాయించిన ”వినాయకుడి వీణ” ఉక్తి వైచిత్య్రానికి ఉత్తమ నమూనా అన్నారు.

అనంతరం జరిగిన మొదటి సమావేశానికి భండారు శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు. గోరాశాస్త్రి ఇంగ్లీషు సంపాదకీయాలను విశ్లేషిస్తూ దాసు కేశవరావు, తెలుగు సంపాదకీయాల తీరు తెన్నులపై కల్లూరి భాస్కరం పత్రాలు చదివారు. ఆ తర్వాత ”గోరాశాస్త్రి కథలు” పై కె.బి.లక్ష్మి, ”నాకు తెలిసన గోరాశాస్రి” అనే అంశంపై నందిరాజు రాధాకృష్ణ, గోరా శాస్త్రి నాటకాలు పై నాగసూరి వేణుగోపాల్‌, పత్రాలు సమర్పించారు.

పిదప రెండో సమావేశానికి వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు జి.యస్‌. వరదాచారి అధ్యక్షత వహించారు. ”గోరాశాస్త్రి శ్రవ్య నాటికలు” అనే అంశంపై పి.యస్‌. గోపాల కృష్ణ, గోరాశాస్త్రి సాహిత్య వ్యక్తిత్వం పై గోవింద రాజు చక్రధర్‌, స్వతంత్ర సంపాదకుడుగా గోరాశాస్త్రి అనే అంశంపై కె. రామలక్ష్మి, ”గోరాశాస్త్రితో నా అనుబంధం” అనే అంశంపై ఎబికె ప్రసాద్‌ పత్రాలు సమర్పించారు.

తొలుత ముఖ్య అతిథితో పాటుగా సదస్సులో పత్రాలు సమర్పించిన వారినందరికి వయోధిక పాత్రికేయ సంఘం జ్ఞాపికలు ప్రదానం చేసి సత్కరించింది. వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె. లక్ష్మణ రావు వందన సమర్పణ చేశారు.

గోరాశాస్త్రి శత జయంతిలో ఉపరాష్ట్రపతి

– టి.యు.