పన్ను వసూళ్ళలో ఆదర్శం సిద్ధిపేట

రాష్ట్రంలోనే మొదటి స్థానం.
రెండవ స్థానంలో సిరిసిల్ల, మూడవ స్థానంలో గజ్వేల్‌

సిద్ధిపేట-గ్రామ పంచాయతీలలో పన్నులు వసూలు చేయడంలో సిద్ధిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. వందకు వందశాతం పన్నులు వసూలు చేసి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలకు స్పూర్తిదాయకమయ్యారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపుతో, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో ప్రజలు తమకు తాముగా తమ తమ గ్రామపంచాయతీలలో వందశాతం పన్నులు కట్టి తమ నిబద్ధతను చాటుకున్నారు. మార్చి 15వ తేదీ వరకు నియోజకవర్గంలోని 75 పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయడం జరిగింది. 2010 నుంచి పెండిరగ్‌లో ఉన్న పన్నులను అధికారులు ప్రజల వద్ద నుంచి వసూలు చేశారు. ప్రజలు కూడా పన్ను కట్టడంలో అధికారులను ఇబ్బందులు పెట్టకుండా సహకరించారు.

సిద్ధిపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో రూ.89,73,699, నంగునూరు మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో రూ.25,87,524, చిన్నకోడూరు మండలంలోని 27 గ్రామపంచాయతీల్లో రూ. 54,10,593లు పన్ను చెల్లించాల్సి ఉండగా మార్చి 15వ తేదీ వరకు పన్నులు పూర్తిగా వసూలయ్యాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి జిల్లాలో వందశాతం పన్నులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి కెసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సెల్‌ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లు పంపడం, గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ప్రతిరోజు గ్రామాలలో పన్నులు చెల్లించాల్సిందిగా చాటింపు వేయించడం, గ్రామ సభలు నిర్వహించి పన్నుల చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్సించడం చేశారు. దీంతో అధికారుల కార్యక్రమం విజయవంతమైంది.

అలాగే మెదక్‌ జిల్లా మొత్తంగా 1,077 గ్రామపంచాయతీలు ఉండగా అందులో 750 గ్రామ పంచాయతీల్లో మార్చి 15 నాటికి వందశాతం పన్ను వసూలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31వరకు జిల్లాలో వందశాతం పన్నుల వసూలు పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో వందకు వందశాతం పన్ను వసూళ్ళతో సిద్ధిపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కరీనంగర్‌ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం 99శాతం పన్ను వసూళ్ళతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక ముఖ్యమంత్రి కెసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం 98శాతం వసూళ్ళతో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తంగా రాష్ట్రంలో పంచాయతీ పన్నుల వసూలు వేగవంతంగా నడుస్తున్నది.