|

పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ విధానం

tsmagazine
అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్‌ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్‌ విధానం, ‘ధరణి’ వెబ్‌ సైట్‌ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ లోగా రాష్ట్రంలోని ఐదు మండలాల్లో మొదటి విడత, 30 మండలాల్లో రెండో విడత పైలట్‌ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, వెబ్‌ సైట్‌ నిర్వహణ చేపట్టాలని అధికారులను కోరారు. పైలట్‌ ప్రాజెక్టులో వచ్చిన అనుభవాల ఆధారంగా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని పద్ధతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం, ధరణి వెబ్‌ సైట్‌ నిర్వహణ ఉండాలని సీఎం చెప్పారు.

రిజిస్ట్ర్రేషన్‌ విధనంలో సంస్కరణలు, ధరణి వెబ్‌ సైట్‌ రూపకల్పనపై ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

అవినీతికి, జాప్యానికి, గందరగోళానికి అవకాశం లేని రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. భూములు అమ్ముకున్న వారు, కొన్న వారు ఒకే ఒకసారి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వస్తే సరిపోయేలా, పాస్‌ బుక్కులు రిజిస్ట్రేషన్‌ కాగితాలు కొరియర్లో నేరుగా ఇంటికి వచ్చే విధంగా కొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ఖరారు చేశారు.

”భూమిని అమ్మే వారు, కొనే వారు ముందుగా సబ్‌ రిజిస్ట్రార్‌ అపాయింట్మెంట్‌ కోరాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ వారికి స్లాట్‌ కేటాయిస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ అపాయింట్మెంట్‌ ఇచ్చిన తేదీ, సమయానికి ఇద్దరూ కార్యాలయానికి చేరుకోవాలి. తమ సేల్‌ డీడ్‌ ను, పాసు పుస్తకాలను సమర్పించాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అమ్మిన వారి పాస్‌ బుక్కు నుంచి రిజిస్ట్రేషన్‌ జరిగిన భూమిని తీసేస్తారు. కొన్న వారి పాస్‌ పుస్తకంలో జమ చేస్తారు. కొత్తగా భూములు కొనే వారయితే కొత్త పాస్‌ పుస్తకంలో నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత అదే రోజు పాస్‌ పుస్తకాన్ని తహసిల్దార్‌ కు పంపుతారు. ఎమ్మార్వో వెంటనే ఎంటర్‌ చేసుకుని, సంతకం చేస్తారు. తహసిల్దార్‌ తన కార్యాలయంలోనే ఉండే ఐటి అధికారికి ఈ వివరాలు అందచేస్తారు. ఐటి అధికారి ఈ వివరాలను నమోదు చేసి, ధరణి వెబ్‌ సైట్‌ కు అప్‌ లోడ్‌ చేస్తారు. తహసిల్దార్‌ సదరు పాస్‌ పుస్తకాన్ని తిరిగి వెంటనే సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపుతారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఎవరి పాస్‌ పుస్తకాన్ని వారికి, సేల్‌ డీడ్‌ను భూమి కొన్న వారికి కొరియర్‌ ద్వారా పంపుతారు. దీని వల్ల భూమిని అమ్మేవారు, కొనేవారు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ తిరగడం

ఉండదు. అవినీతికి ఆస్కారం ఉండదు” అని ముఖ్యమంత్రి వివరించారు.

”జూన్‌ నుంచి ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు లేని 443 మండలాల్లో తహసిల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగిస్తున్నాం. ఇప్పటికే ఒక దఫా వారికి శిక్షణ కూడా ఇచ్చాం. మరో విడత శిక్షణ ఇస్తాం” అని సీఎం చెప్పారు.

”రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు. ఏ భూమికి ఎవరు యజమానులు అనే విషయంలో స్పష్టత వచ్చింది. ఈ ప్రక్షాళన ద్వారా వచ్చిన వివరాలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ డాటాను ఉపయోగించి ‘ధరణి’ వెబ్‌ సైట్‌ను రూపొందించాలి. ప్రతీ మండల కేంద్రంలో ఉండే ఐటి అధికారి తన మండలంలో ఏ రోజు జరిగే మార్పులను అదే రోజు అప్‌ డేట్‌ చేస్తారు. కాబట్టి ధరణి వెబ్‌ సైట్‌ నిరంతరం అప్‌ డేట్‌ అవుతూనే ఉంటుంది. ధరణి వెబ్‌ సైట్‌ లో భూమికి సంబంధించిన అన్ని వివరాలుంటాయి. ఏ భూమికి ఎవరు యజమాని అనే విషయంలో స్పష్టత ఉంటుంది. ఇది పబ్లిక్‌ డాక్యుమెంటుగానే ఉంటుంది. దీనివల్ల పూర్తి పారదర్శకత వస్తుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ధరణి వెబ్‌ సైట్‌ నిర్వహణకు సంబంధించి మే 7 నుంచి ఐదు మండలాల్లో మొదటి విడత, మే 19 నుంచి గ్రామీణ జిల్లాకొక మండలం చొప్పున 30 మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు నిర్వహిస్తారు. ఈ పైలట్‌ ప్రాజెక్టులో ధరణి వెబ్‌ సైట్‌ నిర్వహణలో వచ్చే సాధక బాధకాలను అధ్యయనం చేసి, పరిష్కారాలు కనుగొంటారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వివరాలతో ‘ధరణి’ వెబ్‌ సైట్‌ నిర్వహిస్తారు. దరణి వెబ్‌ సైట్‌ నిర్వహణ బాధ్యతలను స్వీకరించే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో ఈ నెల 20న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది. మొదటి విడతలో మేడ్చల్‌ జిల్లా ఘట్‌ కేసర్‌, సిద్ధిపేట జిల్లా జగదేవ్‌ పూర్‌, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు నిర్వహిస్తారు.

రెండో విడతలో చేర్యాల (సిద్ధిపేట), మానకొండూరు (కరీంనగర్‌), మేడిపల్లి (మేడ్చల్‌), నిర్మల్‌ రూరల్‌ ( నిర్మల్‌), బాల్కొండ (నిజామాబాద్‌), ఎల్లారెడ్డి (కామారెడ్డి), ఆసిఫాబాద్‌ (ఆసిఫాబాద్‌), నెన్నెల (మంచిర్యాల), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతకుంట (సిరిసిల్ల), రాయకల్‌ (జగిత్యాల), రామచంద్రాపురం (సంగారెడ్డి), రామాయంపేట (మెదక్‌), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), కేసముద్రం (మహబూబాబాద్‌), నర్సంపేట (వరంగల్‌ రూరల్‌), హసన్‌ పర్తి (వరంగల్‌ అర్బన్‌), రఘునాథపల్లి (జనగామ), ముదిగొండ (ఖమ్మం), పాల్వంచ రూరల్‌ (కొత్తగూడెం), చివ్వెంల (సూర్యాపేట), కట్టంగూర్‌ (నల్లగొండ), తుర్కపల్లి (యాదాద్రి), బిజినేపల్లి (నాగర్‌ కర్నూల్‌), పెబ్బేరు (వనపర్తి), ఐజ (గద్వాల), దేవరకద్ర (మహబూబ్‌ నగర్‌), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), నవాబ్‌ పేట (వికారాబాద్‌), గుడిహత్నూర్‌ (ఆదిలాబాద్‌) మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు నిర్వహిస్తారు.

ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపి విశ్వేశ్వర రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌, సీనియర్‌ అధికారులు ఎస్‌. నర్సింగ్‌ రావు, రాజేశ్వర్‌ తివారి, శాంత కుమారి, వాకాటి కరుణ, జయేశ్‌ రంజన్‌, స్మిత సభర్వాల్‌, కలెక్టర్లు రఘునందన్‌ రావు, ఎంవి రెడ్డి, వెంకట్రామ్‌ రెడ్డి, ఐటి విభాగం అధికారులు వెంకటేశ్వర్‌ రావు, కొణతం దిలీప్‌, సుజయి, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల ప్రతినిధులు దుర్గా ప్రసాద్‌, సందీప్‌ గుప్తా, రమన్‌ తదితరులు పాల్గొన్నారు.