పారిశ్రామికాభివృద్ధికి బహుముఖ వ్యూహం

రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు విశేష కృషి చేస్తూ, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నది పరిశ్రమల శాఖ. ఈ దిశలో పలువురు పారిశ్రామికవేత్తలతో పలు ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటున్నది. తాజాగా సికె బిర్లా గ్రూప్‌, అంతర్జాతీయ సూపర్‌ బైక్‌ ల సంస్థ బెనెల్లిలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నది.
tsmagazine

ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. మంచిర్యాలలోని దేవపూర్‌లో వున్న సీకే బిర్లా గ్రూపు తన సిమెంట్‌ ఫ్యాక్టరీని సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించనున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు, సికె బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ సికె బిర్లాలతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీఎస్‌.ఎం.డి.సి ఛైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, మేనేజింగ్‌ డైరక్టర్‌ మల్సూర్‌లు హైదరాబాద్‌ లో జరిగిన అవగాహనా ఒప్పంద సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, సికె బిర్లా విస్తరణ ప్రకటన ద్వారా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ పట్ల మరింత విశ్వాసం పెరుగుతుందని, మరిన్ని నూతన పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఇప్పటికే వున్న పరిశ్రమలకు మరింత సహాకరించడం, మూతపడిన పరిశ్రమలను తెరిపించడం వంటి అంశాల కోసం బహుముఖ వ్యూహంతో ముందుకు పొతున్నామని మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తిరిగి తెరిపించడంలో విజయం సాధించామని, అలాగే ఒరియంట్‌ సిమెంట్స్‌ విస్తరణకు అంగీకారం కుదిరిందన్నారు. ఓరియంట్‌ సిమెంట్స్‌ విస్తరణ ద్వారా, సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్ష ఉపాధితోపాటు పరోక్షంగా మరో ఎనిమిది వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కంపెనీలో స్థానిక యువకులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని కంపెనీని కోరామని అన్నారు. దీనికోసం అవసరం అయితే ఒక శిక్షణ కేంద్రాన్నికూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

తెలంగాణలో గత నాలుగేళ్లలో జరిగిన అభివద్ధ్దిని, వివిధ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రి కెటియార్‌, సికె బిర్లాకు వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ప్రాథమిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తూ అభివద్ధి పథంలో నడుస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరం అయిన తాగునీరు కోసం మిషన్‌ భగీరథ, సాగునీటి కోసం నూతన ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముందుగా కరెంటు కొరత నుంచి విముక్తి కల్గించి అన్ని వర్గాలకు నిరంతరం కరెంటు సరపరా చేసే స్ధాయికి చేరుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకొని అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రంలోకి గత నాలుగు సంవత్సరాలలో వచ్చాయని, నూతన పెట్టుబడులతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక కంపెనీలు, సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.

సీకే బిర్లా గ్రూపు ఛైర్మన్‌ సికె బిర్లా మాట్లాడుతూ, త్వరలోనే అన్ని అనుమతులు కేంద్రం నుంచి లభిస్తాయని,కంపెనీ తుది అనుమతులు పొందే పక్రియ వేగంగా జరుతున్నదని, తెలిపారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో వున్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణం అద్భుతమని సికె బిర్లా ప్రశంసలు కురిపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ ఇప్పటికే అనేక వినూత్నమైన పాలసీలతో ముందువరుసలో ఉందని, ముఖ్యంగా నూతన పారిశ్రామిక విధానాలతో పరిశ్రమల వర్గాల్లో మంచిపేరు సంపాదించుకుందని తెలిపారు. కంపెనీ విస్తరణ ద్వారా తెలంగాణ విధానాల పట్ల తమ గ్రూప్‌ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు.

బెనెల్లి బైలెల్లుతున్నది

యువతను అత్యధికంగా ఆకర్షిస్తున్న బెనెల్లి సూపర్‌ బైక్‌, ఇపుడు మన మేడ్చల్‌ లోనే తయారు కానున్నది. సూపర్‌ బైకుల తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన బెనెల్లి కంపెనీ,మన రాష్ట్ర రాజధాని శివారుల్లో వున్న మేడ్చల్‌ లో బైకుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధమయ్యింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మనదేశం లోని అగ్రగ్రామి వాహన డీలర్లలో ఒకరైన ఆదీశ్వర్‌ ఆటోరైడ్‌ ఇండియా-మహావీర్‌ గ్రూప్‌తో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు బెనెల్లి సంస్థ ప్రకటించింది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..
tsmagazine
యువతను ఎంతగానో ఆకర్షిస్తున్న సూపర్‌ బైక్‌ ల సంస్థ బెనెల్లి, మన తెలంగాణలో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకోవడం వల్ల సమకాలీన ఆటోమొబైల్‌ కంపెనీలు ఇక్కడికి రావడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు. తద్వారా రాష్ట్ర ఆటోమొబైల్‌ రంగానికి మరింత ఊతం లభిస్తుందని, మేకిన్‌ ఇండియా, మేకిన్‌ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్న రాష్ట్రంలో ఆటోమొబైల్‌ ఏకో సిస్టం అభివద్ధి చెందుతున్నదని, ఇప్పటికే మహీంద్రా సంస్థ ఇక్కడ తమ యూనిట్‌ను ఏర్పాటుచేసిందన్నారు.

ఆటో మొబైల్‌ రంగానికి త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకు రానున్నట్టు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటిం చారు.దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఇతర దేశాలకు సైతం హైదరాబాద్‌ నుంచి రవాణా సదుపాయాలుండడం అనేది హైదరాబాద్‌ కు అదనపు అర్హతగా పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ఎంతో అనువైన ప్రదేశం కాబట్టే, టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు.

పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. అనేక రంగాలకు ఎంతో అనువైన హైదరాబాద్‌లో ఇప్పటికే ఐటీ, ఏరోస్పేస్‌ తదితర ఎన్నో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, తాజాగా ఆటోమొబైల్‌ రంగంపై దష్టి సారించామని తెలిపారు. బెనెల్లి బోర్డ్‌ డైరెక్టర్‌ జార్జ్‌ వాంగ్‌ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ఆశయంతోనే తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు. తమ సంస్థ ఎన్నో ఏండ్ల నుండి మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు వివిధ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా సూపర్‌బైకుల విభాగంలో నాయకత్వ స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెనెల్లి ప్రాజెక్ట్‌ లీడర్‌ మైఖెలొట్టి స్టెఫానో చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ డాంటె బస్టాన్‌, మహావీర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ యశ్వంత్‌ జబాక్‌, బెనెల్లి ఇండియా ఎండీ వికాస్‌ జబాక్‌, సీఈవో కృష్ణ మాల్గె తదితరులు పాల్గొన్నారు.