|

పిల్లల జీవితాలలో వెలుగులు పూయించిన ఆపరేషన్‌ స్మైల్‌

పిల్లల-జీవితాలలో-వెలుగులు-పూయించిన--ఆపరేషన్‌-స్మైల్‌బాల్యం తిరిగిరానిది. ఆటపాటలతో, అమ్మ నాన్నల ముద్దు మురిపాలతో చెంగు చెంగున ఎగిరే లేడి కూనల్లాగ వుండే బాల్యం ఏంతో అద్భుతంగా ఉంటుంది. కాని, కొంత మంది పిల్లలకు ఈ అదృష్టం దక్కదు. ముఖ్యంగా, పుట్టుకతోనే తల్లితండ్రులు వదిలి వేసిన పిల్లలు, పిల్లలను అమ్ముకునే తల్లితండ్రులు, తల్లితండ్రులు లేని అనాధలైన పిల్లలతో పాటుగా అమాయకులైన వీధి బాలలు, భిక్షాటన చేసే పిల్లలు, చెత్త ఏరుకుని జీవించే బాల బాలికలు, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలు బాల్య వివాహాలు జరిగిన పిల్లలకు కమ్మనైన బాల్యాన్ని అనుభవించే అదృష్టం ఉండదు. వారి జీవితాలు మాఫియా గ్యాంగుల చేతుల్లో మసి బారుతుంటాయి. బాల కార్మికులుగా రోజులు గడిచి పోతుంటాయి. వారిపైన లైంగిక దాడులు కూడా విశృంఖలంగా జరుగుతుంటాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజయాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇంటిలో నుండి పారిపోయిన, తప్పిపోయిన పిల్లలను ఆపరేషన్‌ స్మైల్‌ కింద 30 రోజుల వ్యవధిలో 227 మంది పిల్లలను కాపాడారని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసి ఇలాంటి పిల్లలను ఆయా రాష్ట్రాలలో గుర్తించాలని పేర్కొంది. ఈ లేఖ ఆధారంగా మన తెలంగాణా రాష్ట్రంలో జనవరి నెలలో కేవలం 31 రోజుల వ్యవధిలో ప్రతి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఒక ఎస్‌.ఐ. నలుగురు కానిస్టేబుల్స్‌ బృందంగా ఏర్పడి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు,, జిల్లా స్థాయి బాలల ప్రొటెక్షన్‌ కమిటీలు, స్వచ్చంద సంస్థలు, షెల్టర్‌ హొమ్స్‌ సహకారంతో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, ఆలయాలు, మసీదులు, ప్రార్థన స్థలాలు, ట్రాఫిక్‌ జంక్షన్స్‌, ఫుట్‌ పాత్‌ ల పై వున్న ఇలాంటి బాల బాలికలను 1397 మందిని గుర్తించి వారిని వారి వారి ప్రాంతాలకు పంపించదానికి ఏర్పాట్లు చేశారు. పట్టుబడిన పిల్లలు వారి తల్లితండ్రుల పేర్లు చెప్పే పరిస్థితిలో లేరు. వారి పేర్లు ఏమిటో కూడా వారికి తెలియదు. తాము పుట్టిన ఊరు, ప్రాంతం కూడా వారిలో చాలా మందికి తెలియదు. వీరంతా 5ఏళ్ళలోపు వారు. గత రెండు ఏళ్ళుగా హైదరాబాద్‌ నగరంలో ఉంటున్నామని అంటే, వారు మూడేళ్ళ వయసులోనే ఇక్కడికి వచ్చి ఉంటారని తేలింది. వారి ప్రాంతాలను గుర్తించలేని పిల్లలను రెస్కు హోంకు తరలించడం జరిగిందని తెలంగాణా రాష్ట్ర సి.ఐ.డి. విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ సత్యనారాయణ్‌ తెలిపారు. రాష్ట్రం మొత్తంలో ఇలాంటి 1397 మంది పిల్లలను గుర్తించగా, వీరిలో 1043 మంది బాలలు, 354 మంది బాలికలు వున్నారు. వీరిలో 660 మందిని వారి తల్లితండ్రులు లేదా వారి పోషకుల వద్దకు పంపించారు. గుర్తించిన 1397 మంది పిల్లలలో హైదరా బాద్‌లో 239, సైబరాబాద్‌లో 124, ఆదిలాబాద్‌లో 127, కరీంనగర్‌ లో 265, ఖమ్మంలో 140, మహబూబ్‌ నగర్‌ లో 24 మెదక్‌లో 20, నల్గొండలో 234, నిజామాబాద్‌లో 67, రంగారెడ్డిలో 5 వరంగల్‌లో 131 పిల్లలు ఉన్నారని తేలింది.

ఇదే ఆపరేషన్‌ స్మైల్‌ కింద హైదరాబాద్‌ సిటీ పోలీసులు జనవరి 29, 2015న భవానినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గాజుల తయారు చేసే కేంద్రాలపై దాడి చేసి 216 మంది మగ పిల్లలను, ముగ్గురు ఆడ పిల్లలను కాపాడినట్లు సత్యనారాయణ్‌ తెలిపారు. వీరంతా బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారుగా తెలి సింది. ఈ పిల్లలందరూ పాతబస్తీ లోని ఇరుకు గల్లీలలో తయా రు చేసే గాజుల తయారీ కేంద్రాల్లో పని చేస్తున్నారు. సంతల్లో పశువుల్లా వీరిని బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో వేయి, రెండు వేలకు కొనుగోలు చేసి వారిని పనిలో పెట్టుకుంటారు. వేడి వేడి కొలిమి వద్ద, రసాయనాలు, యాసిడ్‌లతో పని చేయడం వలన చిట్టి చిట్టి చేతులు మసి బారి పోతాయి. చంద్రాయన్‌ గుట్ట, కంచన్‌బాగ్‌, కాలాపత్తర్‌, రెయిన్‌ బజార్‌ ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలపై దాడులు నిర్వహించి 64 మంది పిల్లలను కాపాడారు. జనవరి 30, 2015న మరో సారి దాడి చేసి మరో 35 మంది పిల్లలను కాపాడారు. రామంతపూర్‌ డాన్‌ బాస్కో స్కూల్లో 189 మంది పిల్లలకు ఆశ్రయం కల్పించారు. ఫిబ్రవరి 4న వంద మంది చిన్నారులను సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుండి పాట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక బోగిలో తరలించారు. వీరి వెంట ఇద్దరు సి.ఐ.డి. అధికారులు, ఒక ఎస్‌. ఐ., ఆరుగురు సి.ఆర్‌. పి.ఎఫ్‌. జవాన్లతో పాటుగా, మహిళా శిశు సంక్షేమ అధికారులు వెళ్లి పాట్నాలో పిల్లల తలితండ్రులు, అధికారులు, పోలీస్‌ ఉన్నతాధికారుల సమక్షంలో అప్పగించారు.

ఇదే నేపధ్యంలో బాలలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా తెలంగాణా సి.ఐ.డి. విభాగం దీక్షతో పని చేస్తున్నది.

ప్రచార ఉద్యమాన్ని చేపట్టింది. మొదటగా జంట నగరాలలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్ధి, విద్యార్ధినులకు ఈ విషయమై అవగాహన కల్పించే లక్ష్యంతో ఇందుకు సంబంధించిన పుస్తకాలను, సాహిత్యాన్ని, లఘు చిత్రాలను పంపిణి చేసింది. ప్రతి పాఠశాలలో గుర్తించబడిన ఒక సీనియర్‌ ఉపాధ్యాయుణ్ణి కౌన్సిలర్‌గా నియమించి, లైంగిక దాడులను ఎలా ఎదుర్కోవాలో తెలియ చెప్పాలని నిర్దేశించింది. ఆపద సమయాల్లో పిల్లలు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098 ఫోన్‌ చేయాలని విద్యార్థులకు గుర్తుండిపోయే లాగా తెలియ చెప్పాలని ఆదేశాలు జారీచేశారు. జంట నగరాల్లోని వివిధ పాఠశాలలకు చెందిన 3 వేల మంది విద్యార్ధి, విద్యార్థినులతో నెక్లస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుండి జల విహార్‌ వరకు ఇటీవల ర్యాలి నిర్వహించారు. నా రెక్కలను కత్తిరించకండి.. నాకు ఎగరాలని ఉంది.నిశ్శబ్దాన్ని ఆపండి అంటూ విద్యార్థులు ప్లే కార్డులను ప్రదర్శించారు. తెలంగాణా బ్రాండ్‌ అంబాసిడర్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ర్యాలీని ప్రారంభించి ప్రసంగించారు.