| |

పీడితవర్గాల పెన్నిధి ఈశ్వరీబాయి

eeshwari-bayeeతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ గడ్డమీద పుట్టి ప్రముఖులుగా వెలుగొందిన వారందరినీ సగౌరవంగా సత్కరించి సన్మానిస్తున్నది ప్రభుత్వం. అలాగే దివంగత ప్రముఖుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రజల హక్కులకోసం పోరాడిన, స్ఫూర్తి ప్రదాత జె. ఈశ్వరీబాయి 98వ జయంతిని డిసెంబర్‌ 1వ తేదీన రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, ఈశ్వరీబాయి మెమొరియల్‌ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖామాత్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈశ్వరీబాయి మెమొరియల్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ తోరత్‌ గురించి వివరిస్తూ, దళిత రీసెర్చ్‌ స్కాలర్లు వారి వారి పరిశోధనలు కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, ఫెలోషిప్‌ల ద్వారా అందించడానికి కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ అని మంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. ఈశ్వరీబాయి వంటి నాయకురాలి చరిత్రను భావితరాలవారు తెలుసుకోవడానికి వీలుగా, ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తామని మంత్రి కడియం హామీనిచ్చారు. ఆ తర్వాత ఈశ్వరీబాయి అవార్డును ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ తోరత్‌కు అందజేసి, పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు.

గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర సాంస్కృతిక, గిరిజన శాఖమంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ, దళిత, పీడిత వర్గాల అభివృద్ధికోసం ఈశ్వరీబాయి చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఆమె ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పురస్కార గ్రహీత సుఖ్‌దేవ్‌ తోరత్‌ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభివృద్ధికోసం కృషిచేసిన గొప్పవాళ్ళ జీవితాలనుంచి స్ఫూర్తి పొందడానికే, ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడంలోగల ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. తమ నిజాయితీని, నిబద్ధతను, అంకితభావంతో అణచివేయబడ్డ పేదలకోసం వినియోగించేవారే అసలైన నాయకులని, అటువంటి కోవకు చెందిన నాయకురాలే ఈశ్వరీబాయి అని వివరించారు. ఆమె పేరిట నెలకొల్పిన అవార్డుకు తనను ఎంపిక చేయడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సాంస్కృతిక మీడియా సలహాదారు డా|| కె.వి. రమణాచారి అధ్యక్షత వహించగా, జహీరాబాద్‌ ఎమ్మెల్యే డా|| జె. గీతారెడ్డి స్వాగతం పలికారు. బడుగు, బలహీన, దళితవర్గాలకోసం తన తల్లి ఈశ్వరీబాయి చేసిన పోరాటం, ఎంతో గొప్పది మరుపుకురానిదని పేర్కొన్నారు. ఈ జయంతి  ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ అధికారికంగా నిర్వహించడం ఆనందంగా వుందన్నారు.