|

పెయిడ్‌ న్యూస్‌ల పై గట్టి నిఘా

tsmagazine
శాసన సభ ఎన్నికల్లో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్‌టైజ్‌మెంట్‌లు, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో ప్రసారం చేసే వీడియో అడ్వర్‌టైజ్‌మెంట్‌లకు ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుండి అనుమతి పొందాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ స్పష్టం చేశారు. ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి, వివిధ వార్త పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో వచ్చే పెయిడ్‌ న్యూస్‌ గుర్తింపునకు ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ (ఎం.సి.ఎం.సి)ని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.

జిల్లా ఎన్నికల అధికారి ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ను, ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో డిప్యూటి డైరెక్టర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌ఓలను ఈ కమిటీలో నియమించినట్టు దానకిషోర్‌ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏవైనా మీడియా అతిక్రమణలు జరిగితే ఈ కమిటి పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారమయ్యే అన్నిరకాల రాజకీయ ప్రకటనలను ఎంసిఎంసి కమిటిచే ముందస్తుగా అనుమతి పొందాలని, అదేవిధంగా పోలింగ్‌ రోజు, ముందురోజు ప్రచురితం అయ్యే ప్రింట్‌ మీడియా ప్రకటనలను కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి మతాలు, వర్గాలపై దాడి, దుర్భాషలు, అనుచిత వాఖ్యలు లేకుండా ఉండడం, హింసను ప్రేరేపించడం, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉండడం, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండడం, దేశ సార్వభౌమత్వం ఐక్యతకు భంగం కలిగించేలా ఉండడం, వ్యక్తిగత దూషణలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రాజకీయ ప్రకటనలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు పోటిచేసే అభ్యర్థులకు మాత్రమే హైదరాబాద్‌ జిల్లా ఎంసిఎంసి కమిటీచే రాజకీయ ప్రకటనలకు అనుమతి జారీచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్ట్రార్‌ అయిన రాజకీయ పార్టీలు రాజకీయ ప్రకటనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఎంసిఎంసి కమిటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు.

ఏదైన పత్రిక, ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానల్‌లో వచ్చే వార్తలు, విశ్లేషణలకు డబ్బులు చెల్లించడం లేదా ప్రలోభాలకు లోబడడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పెయిడ్‌ న్యూస్‌గా ఎంసిఎంసి కమిటీ గుర్తిస్తుంది. పలు పార్టీలు, అభ్యర్థులు మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యక్తిగత ప్రచారాలకు సంబంధించి పెయిడ్‌ న్యూస్‌లు ఇటీవల కాలంలో ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ఈ పెయిడ్‌ న్యూస్‌లను అరికట్టడానికి ప్రత్యేకంగా పెయిడ్‌ న్యూస్‌ నియంత్రణ వ్యవస్థను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్‌ మీడియా మానిటరింగ్‌, సర్టిఫికేషన్‌ కమిటి పెయిడ్‌ న్యూస్‌లను గుర్తించి రిటర్నింగ్‌ అధికారుల ద్వారా సంబంధిత అభ్యర్థికి నోటీసులు జారీచేస్తుంది.

ఈ పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించి సమాచార శాఖ అందించిన రేట్‌ కార్డును అనుసరించి వాటికి అయ్యే వ్యయాన్ని లెక్కించి అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో జమ చేయడానికిగాను ఆర్‌.ఓ ద్వారా నోటీసులు జారీచేస్తారు. ఈ నోటీసు ప్రతిని ఎన్నికల వ్యయ పరిశీలకులకు కూడా అందజేస్తారు. పత్రికల్లో లేదా టి.వి ఛానళ్లలో ప్రసారమైన పెయిడ్‌ న్యూస్‌ వ్యయాన్ని తమ ఎన్నికల వ్యయంలో ఎందుకు కలపరాదో కోరుతూ 96 గంటల్లోగా సంబంధిత అభ్యర్థికి రిటర్నింగ్‌ అధికారి నోటీసులు జారీచేస్తారు. పెయిడ్‌ న్యూస్‌పై రిటర్నింగ్‌ అధికారి జారీచేసిన నోటీసులకు సంబంధిత అభ్యర్థులు 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థుల సమాధానానికి ఎంసిఎంసి కమిటి సంతప్తి చెందనట్లైతే అట్టి వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపుతారు. అయితే ఎంసిఎంసి నిర్ణయాన్ని రాష్ట్ర స్థాయి ఎంసిఎంసి కమిటికి రిఫర్‌ చేసే అవకాశం అభ్యర్థికి ఉంటుంది.