|

పోతన మన వాడని చాటిన కవి

సంబరాజు రవి ప్రకాశ రావు

అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మహాకవి, ఉత్తమ పండితుడు, గొప్ప పరిశోధకుడు, సంస్కృతాంధ్ర భాషా కోవిదులు, దేశభక్తులు, సంస్కరణాభిలాషులు, ఉదాత్తమైన ప్రవర్తన కలవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహనీయ లక్షణ సమన్వితుడు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం తాలూకాలోని ‘అనుముల’ గ్రామం శాస్త్రి పూర్వీకుల నివాస స్థానం. అనుముల వేంకట నారాయణ, అచ్చమాంబ పుణ్యదంపతులకు 1888 నవంబరు 18న వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి జన్మించారు. తల్లిదండ్రులు శాస్త్రి చిన్నతనంలోనే

మరణించినందున మేనత్తలు, పెద్ద తండ్రుల కనుసన్నలలో పెరిగాడు. చిన్ననాటి నుంచే శాస్త్రికి కవిత్వం అబ్బింది. వారి పూర్వులలో చాలా మంది కవులు వున్నారు. అందుకే ”కవిత మా యింటి పెనుగాట కట్టబడిన పెంపుడావని కీర్తింత్రు పెద్దలెల్ల” అని వారనుకునే వారట. సంస్కృతాంధ్రాలను స్వయంగా అధ్యయనం చేసి వీరు లోతైన పాండిత్యాన్ని సంపాదించుకున్నారు.

19 సంవత్సరాల వయస్సులో పాండిత్య ప్రదర్శనకు కర్నూలు చేరుకున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న యాపర్ల గ్రామంలో దేశభక్త ధర్మవీర వామన్‌ నాయక్‌ గురించి విని అక్కడికి వెళ్లారు. శాస్త్రి ప్రతిభా పాండిత్యాలకు ముగ్ధుడైన వామన్‌ నాయక్‌ వారిని తన గ్రామంలో సంస్కృత ఉపాధ్యాయులుగా నియమించారు. 14 సంవత్సరాలు యాపర్లలో ఉపాధ్యాయునిగా సేవలందించి ఎందరో శిష్యులను కవిపండితులుగా చేశారు.

వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తన 25వ ఏట అంటే 1913లో వేంకట సుబ్బమ్మను వివాహమాడారు. కొంత కాలానికి తన నివాసాన్ని కర్నూలుకు మార్చుకున్నారు. శాస్త్రికి సంతానం లేనందున వేంకటనారాయణను దత్తు తెచ్చుకున్నాడు. వెంకటనారాయణ కూడ అనుముల వంశస్థుడు, శాస్త్రి జ్ఞాతి అయిన శివసూరి కుమారుడు కర్నూలుకు చేరిన తర్వాత అక్కడి మున్సిపల్‌ హైస్కూల్‌లో దాదాపు 23సంవత్సరాలు తెలుగు పండితుడిగా పని చేశాడు. కర్నూలులో నివాసముండుట వల్ల సురవరం కుటుంబంతో వారికి పరిచయమైంది. సురవరం రామకృష్ణా రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, సురవరం రంగారెడ్డి మొదలగు వారు వారికి సన్నిహితులైనారు. అభిమానపాత్రులైనారు. నాయకంటి శంకరరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి మొదలగు ప్రముఖులు శాస్త్రి శిష్యులే. ఇంకా వీరి శిష్యులలో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, మహబూబ్‌ అలీ కవి, బాలాజీ సింగ్‌ వంటి ప్రముఖులున్నారు. కర్నూలు నుండి శాస్త్రి తన నివాసాన్ని వరంగల్లు జిల్లా జనగామకు, అక్కడి నుండి హైదరాబాదుకు మార్చారు. జనగామలో ఉన్నప్పుడు ఎంతో పరిశోధించి బమ్మెరపోతన, కుమార రుద్రదేవుడు అనే విమర్శ గ్రంథాలను రచించాడు. ఇక వీరి రచనల వివరాలను తెలుసుకుందాం.

శాస్త్రి రచనలు : చిన్నప్పటి నుండే కవితాభ్యాసం గావించిన శాస్త్రి లేఖిని నుండి అనేక రచనలు వెలువడ్డవి. నవల, నాటకం పద్య కావ్యం, ఖండకావ్యం, మహాకావ్యం మొదలగు ప్రక్రియలలో వీరి రచనలు సాగినవి.

1. నీతి రత్నములు (అముద్రితం), 2. కృష్ణా తుంగభద్రలు (అముద్రితం), 3. ప్రౌఢ – పరోఢ (అముద్రితం), 4. బాల (అముద్రితం), 5. ఊఢాక్షత – మృతపతిక (అముద్రితం), 6. స్వర్ణలేఖ (అముద్రితం), 7. సుదర్శన రాజ విజయం (అముద్రితం), 8. నాగ కుమార నవర్నతములు (అముద్రితం),

9. శ్రీరామ నివాస కావ్యము (అముద్రితం),

10. నాగకన్యా పునరుద్వాహము (అముద్రితం),

11. శ్యమంతకమణి (అముద్రితం), 12. సుమంగళ (అముద్రితం), 13. గీతా శతశ్లోకి (అముద్రితం),

14. భర్తృహరి నిర్వేదం (ముద్రితము),

15. కథాకల్లోలిని (ముద్రితము) 16. ప్రియదర్శిని నాటిక (అముద్రితం), 17. చంద్రకళా స్వయంవర నాటకం (అముద్రితం), 18. నవలిక (అముద్రితం), 19. యామినీ పూర్ణతిలక (అముద్రితం), 20. గీతా శాస్త్ర భాష్యం (అముద్రితం), 21. శంకర చరిత్రము (అముద్రితం),22. కర్నూలు చరిత్రము (అముద్రితం), 23. కుమార రుద్రదేవకవి (ముద్రితము) 24. భార్గవరామ చరిత్రము (ముద్రితము)

25. విద్వద్దంపతీ విలాసం (ముద్రితము) 26. బమ్మెర పోతన (ముద్రితము)

కథా సరిత్సాగరంలోని ఆరు కథలను తీసుకొని ‘కథా కల్లోలిని’ రచించారు. ఇది సురవరం రంగారెడ్డి (క్యాతూరు)కి అంకితం. దీనిలో చారిత్రక ఘట్టాల వర్ణన ఆంధ్రోద్యమానికి సహకరించే విధంగా ఉన్నదని విమర్శకుల అభిప్రాయం. ఇది గోలకొండ పత్రిక ముద్రణాలయంలో 1948 కంటే ముందే ప్రచురించబడింది.

శాస్త్రి జనగామలో ఉన్నప్పుడు ‘కుమార రుద్రదేవకవి’ అనే పరిశోధనా గ్రంథాన్ని రాశారు. భాస్కర రామాయణంలోని అయోధ్యాకాండను రచించిన ‘కుమార రుద్రదేవకవి’ ఎవరో కాదు కాకతి రెండవ ప్రతాపరుద్రుడే అని ఈ గ్రంథం ద్వారా నిరూపించాడు.

‘బమ్మెర పోతన’ గ్రంథము డిసెంబర్‌ 1957లో తొలి ముద్రణ పొందింది. శ్రీ భగవద్గీతా మండలి, జనగామ వారు దీని ప్రకాశకులు. ఈ గ్రంథం ద్వారా పోతన నివాసస్థాన నిర్ణయం, అతడు జీవించియున్న కాలం, బాల్యం, బంధు వర్గం, విద్యాభ్యాసం, భాగవత రచన – నాటి స్థితిగతులను వివరించాడు. పోతన బమ్మెర వాసియని బలంగా సాహిత్యలోకానికి చాటాడు. ఒంటిమిట్టవాడను వాదాన్ని పరాస్తు చేశాడు. పోతన మీద వచ్చిన ప్రామాణిక గ్రంథాలలో ఇది అత్యుత్తమ శ్రేణిలో నిలుస్తుంది.

శాస్త్రి రచించిన ‘విద్వద్దంపతి విలాసము’ పద్యకావ్యం. ఇది నందనందన గ్రంథమాల – సీతారాంబాగు వారిచే ముద్రితం. 1974 జనవరిలో ఇది ముద్రణైంది.

”వారు ఈ గ్రంథము ద్వారా లోకమునకు, పవిత్రమైన ప్రేమ బంధమునకు కల్పితములైన గోడలు అడ్డుపడవు’ అను ఉదాత్త నీతిని చాటి చెప్పిరి. ‘తాత్కాలికముగా సాంఘిక సాంప్రదాయం వలన పవిత్ర ప్రేమానుబంధం విచ్ఛిన్నమైనను అది నిత్యము కాబట్టి జన్మాంతరమునందైనను దానిని ఆ ప్రేమికులు సాధించిరి’ అను నిత్య సత్యమును కూడా వారీ గ్రంథం ద్వారా ఆంధ్రలోకానికి చాటిరి”. – అని కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి పేర్కొన్నారు.

వేెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి రచనల్లో విఖ్యాతి చెందిన పద్యకావ్యం ‘భార్గవ రామ చరిత్రము’. దీనికి పీఠికను కేశవపంతుల నరసింహ శాస్త్రి రాయగా, పరిచయాన్ని గడియారం వేంకటశేష శాస్త్రి రాశారు. తన రచనయైన ‘భార్గవ రామ చరిత్ర’ గురించి వారు ఇలా రాసుకున్నారు.

”భార్గవ రామ చరిత్రము భృగువంశోద్భవుడైన శ్రీ పరశురామ భగవానుని దివ్య కథాత్మకం. బ్రహ్మక్షత్ర తేజో విరాజితుడైన ఈ పుణ్యమూర్తి నా నిర్ణయం ప్రకారం క్రీస్తు శకారంభానికి రమారమి 2000 సంవత్సరాల ముందు పుట్టి మహా భారత కథాకాలం వరకును జీవించియున్న ఘనుడు. పరశురాముని చరిత్రాంశాలుగా మన అష్టాదశపురణాలందు ఏవేవో కథా భాగాలు కానవచ్చుచున్నవి. కాని వానిలో అనేకములు ఐతిహాసికాలుగా నాకు తోచినందున వానిని చాలా వరకు నేను నా కావ్యమున గైకొని యుండలేదు. ఒక్క మహాభారతమందలి 18 పర్వాలలో అచ్చటచ్చట ఆయా సందర్భాలలో ఉదహరించబడిన కథాంశాలను మాత్రమే తీసుకొని చారిత్రక పద్ధతికి అనురూపంగా ఈ కావ్యాన్ని రచించినాను”.

ఈ కావ్యాన్ని గురించి గడియారం వేంకటశేష శాస్త్రి తన అభిప్రాయాన్ని రాస్తూ ‘ఈ యుగంలో వెలువడిన

ఉత్తమ కావ్యాలలో భార్గవ చరిత్ర ఒక మ¬త్తమ కావ్యం” అనడాన్ని చదివినపుడు దీని ప్రాశస్త్యం అర్థమవుతుంది.

శాస్త్రి రచన చేసే సందర్భంలో మరొక ఆలోచన

ఉండేదికాదని, పరిశోధన సమయంలో విషయంలోనే లీనమయ్యెడి వారని, రచన, పరిశోధన శాస్త్రికి తపస్సు వంటివని, రచనావేశంలో పద్యాలు ప్రవాహంలా సాగేవని ‘అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి జీవితము – రచనలు’ గ్రంథ రచన చేసిన కె.వి. సుందరాచార్యుల అభిప్రాయం.

తన జీవిత కాలం మొత్తాన్ని సరస్వతీ సమార్చనలోనే గడిపిన అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తన 71వ ఏట 1959 ఫిబ్రవరి 4న మరణించారు.

శాస్త్రి జనగామలో ఉన్నప్పుడు ‘కుమార రుద్రదేవకవి’ అనే పరిశోధనా గ్రంథాన్ని రాశారు. భాస్కర రామాయణంలోని అయోధ్యాకాండను రచించిన ‘కుమార రుద్రదేవకవి’ ఎవరో కాదు కాకతి రెండవ ప్రతాపరుద్రుడే అని ఈ గ్రంథం ద్వారా నిరూపించాడు.