|

పౌరసరఫరాలో అక్రమాలకు కళ్లెం!

tsmagazine

తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఇప్పడు దేశంలోని పలు రాష్ట్రాల దష్టిని ఆకర్షిస్తున్నది. ఈ విభాగంలో ఐటీ ఆధారిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశానికి ఆదర్శంగా నిలిచింది. పౌరసరఫరాల శాఖలో ఐటీ పరిజ్ఞానం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కిలో రూ.1 చొప్పున ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 85 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించేందుకు 17 వేల రేషన్‌ షాపులు ఉన్నాయి. ఇందుకు గాను ప్రతి నెల సగటున పౌరసరఫరాల శాఖ 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. వీటన్నిటిని ఇప్పటికే ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకువచ్చి, రేషన్‌ కార్డుల సమాచారంతో పాటు వారి ఆధార్‌ కార్డు సంఖ్యను అనుసంధానం చేశారు.

నిత్యావసర సరుకులు ముఖ్యంగా రేషన్‌ బియ్యం నేరుగా అర్హులకు చేరాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో కొంతకాలంగా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. రేషన్‌ దుకాణాల్లో జరిగే తూకంలో మోసాలకు కాలం చెల్లింది. సాంకేతిక పరిజ్ఞాన సాయంతో ప్రతీ అడుగూ నిఘానీడన సాగేలా చేపట్టిన సంస్కరణలు పౌరసరఫరాలశాఖలోనే విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. రేషన్‌ బియ్యం అక్రమ దందా నియంత్రణకు పౌరసరఫరాల శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఒకవైపు సాంకేతికతను విరివిగా వాడుకుంటూనే, మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను సాధిస్తోంది.

సరఫరా నుండి పంపిణీ వరకు ఆన్‌లైన్‌ :
సరఫరా నుండి పంపిణీ వరకు కంప్యూటరీకరణ, రేషన్‌ దుకాణాల్లో ఈ పాస్‌ మెషీన్‌లు, ఎలక్ట్రానిక్‌ తూకాలు, సరుకుల రవాణా వాహనాలకు జిపిఎస్‌, గోదాముల వద్ద సిసి కెమెరాలు, రేషన్‌ లబ్ధిదారులు కోరుకున్న రేషన్‌ షాపుల నుండి సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానం, ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపిఎంఎస్‌) ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణ విధానం (ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ – ఎఫ్‌ఎంఎస్‌),- సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌సిఎం), రేషన్‌ షాపులకు ప్రతీ నెల పంపే సరుకుల వివరాల నమోదుకు ఈపీడీఎస్‌… ఇలా అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు ఉపయోగించుకుని అత్యుత్తమ ఫలితాలను రాబట్టడం జరిగింది.

‘దారి’ తప్పకుండా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
సాధారణంగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) గోదాంల నుంచి ప్రభుత్వం నియమించిన స్టేజ్‌ 1 కంట్రాక్టర్‌ సరకుల్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరుస్తారు. అనంతరం స్టేజ్‌ 2 కాంట్రాక్టర్‌ అక్కడి నుంచి సంబంధిత చౌకధరల దుకాణాలకు పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియలో అధికారుల పర్యవేక్షణ నామ మాత్రంగానే ఉంటుంది. కొందరు డీలర్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల సిబ్బంది, రవాణా చేసే వ్యక్తులు కుమ్మక్కై మార్గం మాధ్యలోనే కోటాను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపించేవి. ఈ అక్రమాలకు అడ్డుకట్టవేయడానికి సరుకులు చేరవేసే వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించారు. 1383 స్టేజ్‌ 1, స్టేజ్‌ 2 వాహనాలకు, 46 కిరోసిన్‌ ట్యాంకర్లకు జిపిఎస్‌ అమర్చడం జరిగింది. అదీ కాకుండా జీపీఎస్‌, సీసీటివిలు, పంపిణీ ప్రక్రియను ఇలా.. ఏకకాలంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా పౌరసరఫరాల భవన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గోదాముల నుండి రేషన్‌ షాపులకు సరుకులు చేరేవరకు జరిగే ప్రతి కదలికను ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుశాఖను మినహాయిస్తే ఇటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటిది పౌరసరఫరాలశాఖ.

వీటిని పర్యవేక్షించడానికి 31 జిల్లాల్లో డీసీఎస్‌ఓ కార్యాలయాల్లో మినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఈ చర్యల వల్ల గోదాముల్లో అవకతవలకు, బియ్యం రవాణాలో అక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార, పౌరసరఫరాల కార్యదర్శులతో పాటు గోవా, జమ్ముకాశ్మీర్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ వంటి దాదాపు 12 రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులు, మంత్రులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరును పరిశీలించి ప్రశంసించారు.

రాష్ట్రవ్యాప్తంగా 171 గోదాముల్లో 1750 సిసి కెమెరాలు:
ఎంఎస్‌ఎస్‌ పాయింట్లలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన మొత్తం 171 గోదాముల్లో 1750 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. గోదాముల్లో జరిగే లోడింగ్‌, అన్‌లోడింగ్‌ తదితర లావాదేవీలతో పాటు గోదాముల్లో ప్రతి వ్యక్తి కదలికలను, అతని వద్ద ఉన్న వస్తువులను సైతం పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసింది.

‘ఈ-పాస్‌’: ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్‌ అక్రమాలకు చెక్‌ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పాస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) విధానం విజయవంతమైంది. ప్రజా పంపిణీ ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావసర సరుకులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా ఈ విధానం అడ్డుకట్ట వేస్తోంది. రేషన్‌ సరుకులు నేరుగా లబ్ధిదారులకు అందేలా లేదా తిరిగి ప్రభుత్వానికి చేరేలా ఈ-పాస్‌ విధానం ఎంతో ఉపయోగపడడంతో పాటు సరైన తూకంతో సరుకులు అందుతున్నాయి.

ఎక్కడి నుంచైనా రేషన్‌ (పోర్టబిలిటీ):
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి, అద్భుత ఫలితాలను సాధించి దేశ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ రాష్ట్రంలో ప్రజా పంపిణీ ద్వారా లబ్ధిపొందుతున్న 2.75 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూరేలా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా (పోర్టబిలిటీ) నిత్యావసర సరుకులు తీసుకునే సదుపాయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. సరుకులు తీసుకున్న వెంటనే లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమ కోటాకు సంబంధించిన మొత్తం సమాచారం అందుతుంది. పోర్టబిలిటీ విధానం డీలర్ల మధ్య కూడా పోటీతత్వాన్ని పెంచింది. ఏ డీలర్‌ అయినా ఎంత ఎక్కువ మందికి సరుకులు ఇస్తే అంత ఎక్కువ కమిషన్‌ వస్తుండడంతో లబ్ధిదారులకు సరుకులు అందివ్వడానికి పోటీ పడుతున్నారు.

మొబైల్‌ ఫోన్‌కు రేషన్‌ సమాచారం
రేషన్‌ సరుకులకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో అందుతుంది. రేషన్‌ డీలరుకు గోదాము నుంచి సరుకులు అందగానే లబ్ధిదారు చరవాణి (సెల్‌ఫోన్‌)కి మీకు రేషన్‌ సరకులొచ్చాయనే సంక్షిప్త సమాచారం(ఎస్‌ఎమ్‌ఎస్‌) చేరుతుంది. దీని ఆధారంగా లబ్ధిదారులు తమ సరకులను తీసుకెళ్లవచ్చు.

టి రేషన్‌ మొబైల్‌ యాప్‌:
రేషన్‌ లావాదేవీలు సామాన్య ప్రజలు సైతం తెలుసుకునేలా టీ-రేషన్‌ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా తమకు సమీపంలోని రేషన్‌ షాప్‌ను తెలుసుకోవచ్చు. రేషన్‌ లావాదేవీలను సామాన్య ప్రజలు సైతం ప్రత్యక్షంగా తెలసుకునేలా ‘టి-రేషన్‌’ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ప్రజలు పౌరసరఫరాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈ యాప్‌ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. పౌరసరఫరాల శాఖ అధికారులు సైతం ఎక్కడి నుంచైనా ఈ యాప్‌ ద్వారా తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకునేలా 13 అప్లికేషన్స్‌తో ప్రభుత్వ సేవలను రూపొందించారు. సరుకుల సరఫరా నుండి పంపిణీ వరకు జరిగే అన్ని వివరాలు ఇందులో పొందుపరిచారు.

టీ రేషన్‌ యాప్‌లో రేషన్‌ షాపు లోకేషన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా కార్డుదారుడికి దగ్గరలోని రేషన్‌ షాప్‌ వివరాలు గూగుల్‌ మ్యాప్‌లో ప్రత్యక్షమవుతాయని, కార్డుదారుడు ఉన్న చోటు నుండి తనకు దగ్గరలోని రేషన్‌ షాపులు కనిపిస్తాయి.tsmagazine
tsmagazine
tsmagazine
ఆహార భద్రత కార్డుదారులకు మరింత మెరుగైన సేవలు, త్వరితగతిన సరుకులు అందించడానికి ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎప్పుడైనా సరుకులు తీసుకునే సదుపాయం కల్పించారు.

వాట్సప్‌ 7330774444: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజల భాగ స్వామ్యంతో రేషన్‌ అక్రమాల నిరోధానికి పౌరసరఫరాల శాఖ మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ప్రజలకు ప్రయోజనం కలిగేలా వాట్సప్‌ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందుకోసం పౌరసరఫరాల భవన్‌లో చేసిన వాట్సప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పౌరసర ఫరాల శాఖ వాట్సప్‌ 7330774444 నంబర్‌ ద్వారా ప్రజల నుంచి సులువుగా సంక్షిప్త సందేశాలు, చిత్రాలు, ఆడియో, వీడియో క్లిప్పింగుల ద్వారా వాట్సప్‌ కంట్రోల్‌ రూంకు సమాచారాన్ని తెలియజేయవచ్చు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలనచేసి, బాధ్యులపై చర్యలు తీసుకున్న విషయాన్ని 24 గంటల్లో సంక్షిప్త సందేశం ద్వారా ఫిర్యాదుదారుకు పంపించేలా ఏర్పాట్లు చేసింది. ఈ వాట్సప్‌ సెంటర్‌ 24 గంటల పాటు పనిచేస్తుంది. ఇందుకోసం ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు.

రైతులకు వరం – ఒపిఎంఎస్‌
ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించిన రైతుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ధాన్యం కొనుగోలులో చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం రైతులకు వరంగా మారింది. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి, దీనికి సంబంధించిన చెల్లింపులో దళారుల ప్రమేయం ఉండకూడదన్న ప్రధాన ఉద్దేశంతో ఆన్‌లైన్‌ చెల్లింపులకు పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది.

ఒపిఎంఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు
మొదటగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతు వివరాలు, సాగుచేసిన విస్తీర్ణం, పంట దిగుబడి, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ తదితర వివరాలను ఒపిఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసి రైతు నుంచి ధాన్యం తూకం చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలన్ని నేరుగా హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ వెంటనే వాటిని పరిశీలించి పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ ఐడికి నిధులు విడుదల చేస్తారు. వీటిని బ్యాంకు ద్వారా నేరు గా రైతు ఖాతాల్లో జమచేస్తారు. ఇందుకోసం ప్రతి కొనుగోలు కేంద్రంలో ట్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది సీజన్‌ ప్రారంభంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు శిక్షణ కూడా ఇస్తారు. లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు సంక్షిప్త సమాచారం(ఎస్‌ఎంఎస్‌) ద్వారా రైతులకు అందిస్తున్నారు. కనీస మద్దతు ధరకు సంబంధించిన చెల్లింపులను 2016-17లో 11 లక్షల మంది రైతులకు రూ.8067.43 వేల కోట్లను తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమచేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఖరీఫ్‌లో 4,00,176 మంది రైతుల నుండి 16.52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 2478.57 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా రైతు ఖాతాలోకి జమచేయగా, రబీలో 7 లక్షల మంది రైతుల నుండి 37.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 5600 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా రైతు ఖాతాలోకి జమచేయడం జరి గింది.ఈ ఏడాది 2017-18 ఖరీఫ్‌, రబీలో ఇప్పటివరకు మే 2018 నాటికి 6,17,329 మంది రైతుల నుండి 42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 4483 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా రైతు ఖాతాలోకి జమచేయడం జరిగింది.

మేడిశెట్టి రమేష్‌