ప్రజలు సంకల్పిస్తే చేయలేని పనిలేదు

ప్రజలు-సంకల్పిస్తే-చేయలేని-పనిలేదు‘‘ఒక్కవేలుతో కొడితే దెబ్బ తగలది, అదే పిడికిలితో కొడితే దెబ్బ గట్టిగ తగుల్తది. ప్రజలు ఒక్కటయితే ఎటువంటి సమస్యనయినా పరిష్కరించుకోవచ్చు. మనలోపల వున్న శక్తి మనకు తెల్వదు. దాన్ని బయటికి తెచ్చి మన సమస్యలను ఖతం జేసుకోవాలె. మన బస్తీని ఎవరూ బాగుచేయరు. ప్రభుత్వం, పురపాలకశాఖ వాళ్ళు, అందుబాటులో వున్న అథారిటీలు కొంత చేస్తరు. అయితే ఎక్కువ భాగం చేసుకోవాల్సింది మనమే’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు.

మార్చి 15న ఎల్బీనగర్‌ నియోజకవర్గం నాగోల్‌ పరిధిలోవున్న మమతానగర్‌, వెంకటరమణనగర్‌ కాలనీలను ముఖ్యమంత్రి సందర్శించారు.

మన కాలనీలు శుభ్రంగా వుంటే ఆ గౌరవం మనకే దక్కుతుంది. హైదరాబాద్‌ కథ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది. మన ఇల్లు ఒక్కటేకాదు, బస్తీకూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత మనదే అని తెలియజేశారు కేసీఆర్‌. కాలనీల సందర్శన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మనసువిప్పి మాట్లాడారు ముఖ్యమంత్రి.

మనలో సంకల్పం వుంటే ఆ సంకల్ప బలంతో పేదరికాన్ని కూడా జయించవచ్చని తెలియజేస్తూ, బంగ్లాదేశ్‌ సామాజిక శాస్త్రవేత్త అనుభవాన్ని వివరించారు.

ప్రజలు-సంకల్పిస్తే‘‘ప్రొఫెసర్‌ యూనుస్‌ ఓ సామాజిక శాస్త్రవేత్త. ఢాకాలో ఒకరోజు ఫుట్‌పాత్‌పై నిల్చొని చూస్తుంటే, ఆరుగురు ఆడవాళ్ళు అటుపక్కనుంచి పోతుంటే చూసిండు.వాళ్ళు చాలా పేదవాళ్ళు. వీళ్ళు ఏంచేస్తుంటారని తెలుసుకోవడానికి ప్రొ॥ యూనుస్‌ వాళ్ళ వెనుకాల పోయిండు. వాళ్ళు రోజువారీ వడ్డీకిచ్చే షావుకారు దగ్గరకుపోయి 50 రూపాయలు వడ్డీకి తీసుకుని, హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌కుపోయి కూరగాయలు కొనుక్కొని, గంపల నెత్తినపెట్టుకుని అమ్ముతున్నరు. పొద్దుగూకి కూరగాయలన్నీ అమ్మినతర్వాత మళ్ళ షావుకారు దగ్గరికిపోయి, ఆయన డబ్బులు వడ్డీతోసహా కట్టి రెండో, మూడో రూపాయలు మిగుల్తే వాటితోటి బియ్యం కొనుక్కొని ఇంటికి పోయిండ్రు.

పొద్దుగాల లేవంగనే మళ్ళా అదే బతుకు. వాళ్ళు అంత పేదరికంలో వుండుడు చూసిన ప్రొ॥యూనుస్‌కు బాధ కలిగింది. వడ్డీ వ్యాపారి వీళ్ళ బతుకులను పీల్చి పిప్పి చేస్తున్నడు. వాళ్ళను కష్టాలల్లనుంచి బయటకు తేవాలని ఆలోచన చేస్తే, ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఆ తెల్లారి అదే ఫుట్‌పాత్‌మీద నిలబడ్డప్పుడు, ఆ మహిళలు అట్నుంచి పోతుంటె… వాళ్ళను పిలిచి నేను కూడా వడ్డీ వ్యాపారినే… మీరు రోజు వడ్డీకి తీసుకునేెటాయన మీ దగ్గర ఐదు రూపాయలు వడ్డీ తీసుకుంటే, నేను 3 రూపాయలే తీసుకుంటానని చెప్పి వాళ్ళకు వడ్డికిస్తడు. ఇట్ల కొన్ని రోజులయినంక, ఒకరోజు ఆ మహిళలను కుటుంబ సభ్యులతో సహా ఇంటికి భోజనానికి పిలుస్తడు. గప్పుడు ఇంట్లనుంచి ఒక సంచీతెచ్చి చూపిస్తడు. దాంట్ల 30వేల రూపాయలుంటయి. అప్పుడు ఆయన వాళ్ళ తోటి, నేను వడ్డీవ్యాపారిని కాను. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని. మీ దగ్గర తీసుకున్న వడ్డీ ఈ సంచిలదాస్తే ఇంత అయ్యిందని చెప్పి, ఆ డబ్బును తలా 5వేలు పంచుతడు. వాటితోటి కూరగాయల వ్యాపారం చేసుకోవాలని చెప్పి, నేను మీ అందరికి ఎట్లనైతె నేర్పిన్నో అట్లే మీరు వేరే వాళ్ళకు నేర్పి, సంఘాలు తయారు చేయాలని వాగ్ధానం తీసుకుంటడు. అట్ల ఒక్కో సంఘం ఏర్పడి, ఏర్పడి ఐదేండ్లల్ల 17వేల సంఘాలు ఏర్పడ్డయి’’ అని విజయగాథను వివరించారు కేసీఆర్‌.

హైదరాబాద్‌ నగరం గురించి ప్రస్తావిస్తూ నేషనల్‌ జియోగ్రాఫికల్‌ ఛానెల్‌వాళ్ళు తప్పకుండా చూడాల్సిన (ది మస్ట్‌ సీ ద సిటీస్‌) నగరాల్లో హైదరాబాద్‌ను పెట్టిండ్రు. చెప్పుకుంటే మనసిగ్గే పోతది. ‘‘ఊపర్‌ షేర్వాణీ. అందర్‌ పరేషానీ’’ ఇదీ హైదరాబాద్‌ కథ. ఉన్నదున్నట్లు చెప్పుకోవాలె కదా. దాసుకుంటే దాగదు, గట్లనే డంబాచారానికి పోతె దోమలు కుడుతయి అని ముఖ్యమంత్రి అన్నారు.

1969 తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన మహబూబ్‌నగర్‌ బిడ్డ ఎస్‌.ఎన్‌. రెడ్డి అనే పెద్దమనిషి స్వీడన్ల స్థిరపడ్డరు. ఈయన స్వీడన్ల గొప్ప శాస్త్రవేత్త. ఈయన ప్లాస్మా గ్యాసిఫికేషన్‌ (చెత్తనుంచి విద్యుత్తు)ను కనిపెట్టిండు. ఆయన నాతో, మీరు తెలంగాణ తెచ్చి మంచి పని చేసిండ్రు. నేను మీకు ఆ టెక్నాలజీ చెప్తాని చెప్పిండు. రెండు నెలలైనా రాకపోయేవరకు మొన్ననే ఫోన్‌ చేసిన, ఏమయ్యా… ఏమన్న తిప్పలవడదామంటే, వస్తనని చెప్పి యింకా రాకపోతివని అడిగిన. వస్తనని తయారైనకానీ మా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు హైదరాబాద్‌ల స్వైన్‌ ఫ్లూ వున్నదని భయపడి వస్తలేరని చెప్పిండు అని వివరించారు కేసీఆర్‌. ఇంతకుముందు పరిపాలన చేసినోళ్ళు ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్ళని ఇంతజేసినం, అంత జేసినం అని హైటెక్కు, ఆటెక్కు అన్నరు. అసలు సంగతేందంటే మనం గిట్లున్నం, అని పరిస్థితిని తేటతెల్లం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

వ్యాధుల నియంత్రణ

ప్రజలు తల్చుకుంటే వ్యాధులను కూడా నియంత్రించుకోవచ్చునని, అది మన చేతుల్లోనే వుందని అన్నారు కేసీఆర్‌. కుబేరులైనా వారు ఉండే నగరం బాగుంటేనే ఆరోగ్యంగా వుంటారని, లేకపోతే రోగాలువచ్చి తిప్పలు పడతారని చెప్తూ, గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో జరిగిన ఒక వాస్తవాన్ని వివరించారు.

సూరత్‌ పట్టణంలో పెద్దపెద్ద కోటీశ్వరులున్నారు. అయితే వాళ్ళెవరు కూడా పరిసరాలను పట్టించుకోకపోవడంతో చెత్త ఎక్కువై ప్లేగువ్యాధి వచ్చింది. వందలమంది చచ్చిపోయిండ్రు. అప్పుడు కోటీశ్వరులు కూడా ఏం చేయలేక పారిపోయిండ్రు. ప్రభుత్వం, అధికారులు వచ్చి తీసుకోవలసిన చర్యలు తీసుకుంటే వ్యాధి అదుపులోకి వచ్చింది. ఈ సంఘటన తర్వాత అక్కడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన వెంకటేశ్వరరావు అనే తెలుగు వ్యక్తి ముందు శ్రీమంతులందరినీ పిలిచి మాట్లాడాడు. మీకు ఎంత ఆస్తివుంటే ఏం లాభం. ఆరంతస్తుల బంగ్లాలుంటే ఏం లాభం? మీ డబ్బు మిమ్ములను కాపాడిరదా? సమాజంలో నువ్వుకూడా ఒక భాగం. అందుకే పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని వాళ్ళల్లో మార్పువచ్చే విధంగా మంచి మాటలు చెప్పాడని గుజరాత్‌ సూరత్‌ ఘటనను వివరించారు కేసీఆర్‌.

హైదరాబాద్‌లోవున్న ప్రగతినగర్‌ కాలనీని ఆదర్శకాలనీగా పేర్కొన్నారు కేసీఆర్‌. అక్కడంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని వివరించారు. బిహెచ్‌ఈఎల్‌ దగ్గరవున్న ప్రగతినగర్‌కు ఎవరో పుణ్యాత్ముడు మంచి చేసిండు. ఆ కాలనీలోని రెండున్నర మూడువేల ఎకలరాలల్ల అన్నీ ఔషధ మొక్కలు పెట్టిండ్రు. అందుకే అక్కడికి ఒక్క దోమకూడా రాదు. మున్సిపాలిటీ తరఫున రెండు స్పెషల్‌ బస్సులు పెట్టిస్త, వెంకటరమణ, మమతానగర్‌ కాలనీలోని మహిళలు, పిల్లలు అందరూ అక్కడికిపోయి చూసి రాండ్రి అని ముఖ్యమంత్రి చెప్పారు.

సమస్యలన్నీ పరిష్కారమవుతాయి

కాలనీవాసులు తన దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడున్న శ్మశానవాటిక బాగాలేదని, జీహెచ్‌ఎంసీ దాన్ని బాగుచేసి మంచిగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. పోలీసులు మెయిన్‌రోడ్లల్లో పదివేల సీసీ కెమెరాలు పెడుతున్నారు. అయితే కాలనీలల్లో కాలనీవాళ్ళే కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక్కడ మమతానగర్‌ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు.

వెంకటరమణ కాలనీలో కెమెరాల ఏర్పాటుకు ఒక్కో ఇంటికి పది రూపాయల చొప్పున వేసుకుంటే సరిపోతుందన్నారు. తొలి చందాదారుడిగా నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నానని, కాలనీ అధ్యక్షుడు షాకత్‌ హుస్సేన్‌కు ఆ సొమ్మును అందించారు ముఖ్య మంత్రి కేసీఆర్‌. టిఆర్‌ఎస్‌ నాయకులు ఎగ్గె మల్లేశం, రామ్మోహన్‌ గౌడ్‌ తలా ఒక కెమెరా విరాళంగా అందించాలని ముఖ్యమంత్రి సూచించగా, వారు దానికి వెంటనే అంగీకరించారు.
కాలనీ వాసులంతా కలిసి ఒక్క గార్డును పెట్టుకుంటే కాలనీలో ఎవరు వచ్చేది పోయేది తెలుస్తది. కాలనీవాళ్ళ వివరాలన్నింటిని పోలీసులకు అందిస్తే వాటిని కంప్యూటరీకరించి, ఆధార్‌కార్డుకు అనుసంధానం చేస్తరు. ఏదైనా జరుగరానిది జరిగితే నిమిషాలమీద నిందితులను పట్టుకోవడానికి పనికొస్తదని అన్నారు ముఖ్యమంత్రి. కాలనీ వాసులే శాంతి భద్రతల కమిటీని పెట్టుకోవాలని సూచించారు. ఈసారి అధికారులెవరూ లేకుండా కాలనీకి మరోసారి ఆకస్మికంగా వస్తానని పేర్కొన్నారు. కాలనీలో ఇండ్లులేని నిరుపేదలు వుంటే వాళ్ళ జాబితాను ఇవ్వాలని కాలనీ అధ్యక్షుడికి సూచించారు. ఈ కాలనీకి 400`500 గజాల స్థలం కొని కమ్యూనిటీహాల్‌ నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ సోమేష్‌కుమార్‌, సైబరాబాద్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.