ప్రజల్లో నమ్మకం కల్గించాలి: సీఎం

నూతన రెవెన్యూ చట్టనికి ట్రెసా సంపూర్ణ మద్దతు


తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోరారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. ప్రగతి భవన్‌ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్‌ దృక్పథంతో పనిచేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలను కడుపులో పెట్టుకొన్నట్లుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజల్లో చైతన్యం పెరిగిందని దానికి అనుగుణంగా పోలీసుశాఖలో మార్పు వచ్చిందని, అదే తరహాలో రెవెన్యూశాఖలో కూడా మార్పు రావాలన్నారు.

వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా హుందాగా వ్యవహరించి, వారి సమస్యను ఓపికగా పరిష్కరించాలని కోరారు. గతంలో మండలాల్లో, గ్రామాల్లో బాగా పనిచేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించే వారని, మళ్లీ అలాంటి సంస్కృతిని నెలకొల్పాలని సీఎం సూచించారు. అధికారులు తమతో ఎలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ యంత్రాంగం వారి సమస్యలను పరిష్కరించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు.
రెవెన్యూశాఖలో అన్ని స్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సులు రెగ్యులర్‌గా ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎస్‌ ను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రొటోకాల్‌ సహా కార్యాలయాల నిర్వహణ కోసం నిధు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. వీఆర్‌ఏలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం


ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్‌ఏలకు స్కేల్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్‌ కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు.