ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాభివృద్ధి


రాష్ట్రాన్ని ఎప్పుడు, ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులుగా అది తమకు తెలుసునని, అందుకే రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్‌ కుమార్‌లు పేర్కొన్నారు. ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ స్టేట్‌ ఎఫెక్టివ్‌నెస్‌ ఆన్‌ తెలంగాణ’ అనే అంశంపై హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని అర్థ గణాంకశాఖ కార్యాలయంలో జరిగిన సెమినార్‌లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనా కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలన్నారు.

అర్థగణాంక, ప్రణాళిక శాఖలు పక్కా వివరాలు సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధిలో సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు ‘సెంటర్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌’ (సేజిస్‌) సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. మంత్రి తన్నీరు హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్‌ సమక్షంలో అధికారులు ఎంఓయు పత్రాలు మార్చుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, బంగారుతెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన స్థితిగతులను బలోపేతం చేయడంతోపాటు తెలంగాణ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా నిలిచేందుకు దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్‌ సలహాదారు మురళీధరన్‌ కార్తికేయన్‌, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, అర్థ గణాంకశాఖ డైరెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ప్లానింగ్‌శాఖ డైరెక్టర్‌ షేక్‌మీరా పాల్గొన్నారు.