ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణ శిక్షణ తీసుకోవాలి


రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణకు సంబంధించిన శిక్షణ తీసుకొవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. రామగుండంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బాలికలచే నిర్వహించిన కళరిపయట్టు కళాప్రదర్శనను గవర్నర్‌ దంపతులు తిలకించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌ మాట్లాడుతూ ఆత్మరక్షణ నేర్చుకొవడం మన జీవితానికి చాలా ఉపయోగపడతుందని, మనం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని గవర్నర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో 15 వేల మంది బాలికలకు స్వదేశీ ఆత్మరక్షణ శిక్షణైన కళరిపయట్టులో శిక్షణ అందిస్తున్న కలెక్టర్‌ శ్రీదేవసేనను గవర్నర్‌ అభినందించారు.

బాలికలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్తి స్థాయిలో కళరిపయట్టు అభ్యసించాలని, దానిని జీవితంలో అవసరమైనప్పుడు ఉపయోగించాలని, ఆడపిల్లలు తమ ఇంటి వద్ద ఉన్న ఇతర బాలికలకు సైతం దీనిని నేర్పించాలని గవర్నర్‌ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి బాలికకు ఆత్మరక్షణకు సంబంధించిన శిక్షణ అందించాలని, పెద్దపల్లి రాష్ట్రానికి, అనంతరం దేశానికి ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ అన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం కరికులంలో ఆత్మరక్షణ కళలు భాగస్వామ్యం కావాలని, ఆత్మరక్షణ కళలు నేర్చుకోవడం ద్వారా విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని గవర్నర్‌ అన్నారు. ఆత్మరక్షణ రంగంలో స్వదేశీ కళలు సమర్థవంతంగా ఉన్నాయని, వీటి ప్రాచుర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్న డా. శివను సైతం గవర్నర్‌ అభినందించారు.

ఆత్మరక్షణ కళల స్వదేశీ కళలు చాలా మెరుగ్గా ఉంటాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి యోగాకు గుర్తింపు తెస్తు జూన్‌ 21 ప్రపంచ యోగా దినొత్సవం నిర్వహించేలా కృషిచేసారని, అదే విధంగా దేశీయ ఆత్మరక్షణ కళలకు సైతం ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొని వచ్చే దిశగా కృషి చేయాలని గవర్నర్‌ అన్నారు. ఆత్మరక్షణ కళలతో పాటు విద్యార్థులు భోజన అలవాట్లను సైతం మెరుగుపర్చుకోవాలని, పౌష్టికాహారం అధికంగా తీసుకోవాలని, జంక్‌ ఫుడ్‌లైన పీజా, చిరుతిండ్లు ఆరోగ్యానికి మంచిది కాదని, పిల్లల ఆహారపు అలవాట్ల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గవర్నర్‌ సూచించారు.

పెద్దపల్లి జిల్లాలో తనకు మంచి అతిథ్యం అందించిన ఎన్టీపిసి అధికారులకు గవర్నర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మరక్షణ కళలను బాలికలకు అందించేందుకు కేరళ రాష్ట్రం నుండి 30 మంది శిక్షకులను ఎర్పాటు చేసి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న కలెక్టర్‌ శ్రీ దేవసేనను గవర్నర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కళరిపయట్టు మాస్టర్‌ ట్రైయినర్‌ శివను గవర్నర్‌ శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థులకు గవర్నర్‌ నిఘంటువులను అందించారు.

బసంత్‌ నగర్‌ వద్ద జిల్లా అటవీ అధికారి ఆధ్వర్యంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించిన గవర్నర్‌ మొక్కలు నాటారు. అనంతరం బసంత్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన బట్టసంచుల తయారీ కేంద్రాన్ని గవర్నర్‌ పరిశీలించారు. శాంతి నగర్‌లో స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన సబల శానిటరీ న్యాప్కిన్‌ తయారీ కేంద్రాన్ని గవర్నర్‌ పరిశీలించి, స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలించేందుకు పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామానికి గవర్నర్‌ బయలుదేరారు.

జిల్లా కలెక్టర్‌ శ్రీ దేవసేన, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి, జిల్లా ఇంచార్జి డిఆర్వో కె.నరసింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీఒ ఉపేందర్‌ రెడ్డి, మంథని ఆర్డిఒ కె.నగేష్‌, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.