ప్రపంచానికి బౌద్ధమే శరణ్యం బౌద్ధ సంగీతి ముగింపు సభలో మంత్రి జగదీష్‌ రెడ్డి


ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి బౌద్ధిజమే శరణ్యమని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. బౌద్ధిజం మొదలైన కాలానికి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉందని, నిజానికి అప్పటికంటే కూడా ఇప్పుడున్న సమజానికి బౌద్ధిజం పరిమళాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర రాజధాని నగరంలోని యం.సి.హెచ్‌.ఆర్‌.డిలో రెండు రోజులపాటు జరిగిన బౌద్ధ సంగీతి-2019 ముగింపు సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. థాయ్‌ లాండ్‌, నేపాల్‌, భూటాన్‌, తదితర 17 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ ప్రపంచ స్థాయి సదస్సులో మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రసంగిస్తూ, బౌద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుండి ఉన్న సారూప్యాన్ని వివరించారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బౌద్ధిజానికి ప్రతీకలుగా ఆయన వర్ణించారు. మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా, ప్రాశస్త్యం తగ్గినట్లు కనిపించినా, తెలంగాణ సమాజం పుట్టుకలోనే బౌద్ధిజం కలిసి పోయిందన్నది యదార్ధం అని ఆయన స్పష్టం చేశారు.

బౌద్ధిజానికి ఆనవాళ్లుగా నిలిచిన సూర్యాపేట జిల్లాలోని అయిదు ఆరామాల ప్రత్యేకతను కాపాడుకుంటామని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. ఫణిగిరి, వర్ధమానకోట, నాగరంలతో పాటు తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బౌద్ధిజానికి తెలంగాణ ప్రతీక అనేందుకు తార్కాణమన్నారు. శిధిలాల కింద కప్పబడిన విగ్రహాలు బయటకు రావడం కంటే కూడా బౌద్ధిజం ఆలోచనలు బయటకు తీసుకరావాల్సిన చారిత్రిక అవసరం ఉందన్నారు.

తాను జన్మించిన నాగారం మండల కేంద్రంలోనీ ఫణిగిరిలో బౌద్ధిజానికి సంబంధించిన అనవాళ్లను తరలించే ప్రక్రియను విద్యార్థి దశలోనే అడ్డుకున్న ఉదంతాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డి గుర్తు చేశారు. ఆ తరువాత కాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి చరిత్రను అంతర్జాతీయ సమాజం ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో నాగార్జున సాగర్‌ వద్ద బుద్ధ వనం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిశోర్‌ కుమార్‌ మాట్లాడుతూ, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఆరామాలు ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శిథిలాలు బయట పడినప్పటి వాటి చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని గుర్తు చేశారు. అందుకు అవసరమైన నిధులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముగింపు సభకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షత వహించగా ప్రొఫెసర్‌ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.