|

ప్రవాహ వేగంతో.. వాటర్‌ గ్రిడ్‌

kcrఇంటింటికీ సురక్షిత త్రాగునీటిని అందించాలనే అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నవంబర్‌ 25న వాటర్‌గ్రిడ్‌పై పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష జరిపారు. ప్రతీ ఇంటిలో నల్లా ఏర్పాటు చేసి మంచినీళ్లు ఇచ్చే వాటర్‌ గ్రిడ్‌ పథకం వైపు దేశమంతా ఆసక్తిగా చూస్తున్నదని, వచ్చే ఎన్నికల్లోపు సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగం అని తాను మాట ఇచ్చానని, ప్రజలు కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. వాటర్‌ గ్రిడ్‌ పథకానికున్న ప్రాధాన్యతను గుర్తెరిగి అధికారులు పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా, సాంకేతిక అంశాలను ద ష్టిలో పెట్టుకుని, పనులు ఎక్కువ సంవత్సరాలు ఉపయోగపడేలా చేయాలని సిఎం సూచించారు. ఎం.సి.ఆర్‌.హెచ్‌.ఆర్‌.డిలో బుధవారం వాటర్‌ గ్రిడ్‌ పై ముఖ్యమంత్రి విస్త త సమీక్ష జరిపారు.

నీటి పారుదల ప్రాజెక్టులంటేనే జాప్యానికి మారుపేరుగా వుందని, పది పదిహేనేళ్లు సాగదీసే అలవాటుందని సిఎం అన్నారు. పెద్ద స్కీములంటే ఏళ్ల తరబడి సాగదీస్తారన్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలన్నారు. భూసేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు తదితర విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చిందని, దానిని సానుకూలంగా తీసుకుని పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. జిల్లాల వారిగా పనుల పురోగతిని ఆయా జిల్లాల అధికారులతో, వర్కింగ్‌ ఏజన్సీలతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. స్థానికంగా వుండే ఇబ్బందుల గురించి చర్చించి, అక్కడికక్కడే పరిష్కారం చూపారు. పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలను కూడా సమీక్షించి, పనుల్లో వేగం పెంచే విధంగా సిఎం సూచనలు చేశారు. ఇన్‌ టేక్‌ వెల్స్‌ నిర్మాణం, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు తదితర పనులను కూడా సిఎం సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యత కూడా అధికారులదే కాబట్టి, నీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైల్వేక్రాసింగ్‌ ల వద్ద త్వరితగతిన అనుమతులు ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వేశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కతజ్ఞతలు తెలిపారు.

రైల్వేశాఖ, నేషనల్‌ హైవేస్‌, ఆర్‌ అండ్‌ బి, విద్యుత్‌, నీటి పారుదల తదితర శాఖల ముఖ్య అధికారులను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి, పరస్పర సహకారంతో ముందుకు పోవాలని వారిని కోరారు.

వాటర్‌ గ్రిడ్‌ పథకానికి అవసరమయ్యే విద్యుత్‌ సరఫరా చేయడానికి అనుగుణంగా సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. విద్యుత్‌ శాఖ చేస్తున్న ప్రయత్నాలను జెన్కో సిఎండి ప్రభాకర్‌ రావు వివరించారు.

నిర్ణీత సమయంలో వాటర్‌ గ్రిడ్‌ పనులు చేసే కాంట్రాక్టర్లకు 1.5 శాతం ఇన్సెంటివ్‌ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్‌ కు మంచినీరు సరఫరా చేసే పైపులైను ద్వారా అనుసంధానం అయ్యే 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2016 ఏప్రిల్‌ 30వ తేదిలోగా మంచినీళ్లు అందివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పైపులైన్లు వేయడానికి అవసరమయ్యే అనుమతులు త్వరగా పొందడానికి అటవీ శాఖ ఒక డిఎఫ్‌ఓను నియమించాలని సిఎం చెప్పారు. రైట్‌ ఆఫ్‌ వే చట్టం అనుసరించి ఆరు అడుగుల లోతున పైపు లైను వేయాలని, ఎవరి భూముల నుంచైనా పైప్‌లైన్లు వేసుకోవచ్చన్నారు. మెదక్‌ జిల్లాలో వేసే పైపులైను తన వ్యవసాయ భూమి (ఎర్రవెల్లి) నుంచే పోతున్నదని, చట్టానికి ముఖ్యమంత్రి మొదలుకుని ఎవరూ అతీతులు కాదని చెప్పారు.

ఈ సమావేశంలో మంత్రులు కె. తారకరామారావు, హరీష్‌ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునిత, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఇ.ఎన్‌.సి సురేందర్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇ.ఎన్‌.సి మురళీధర్‌ రావు, జెన్‌ కో సిఎండి ప్రభాకర్‌ రావు, సీనియర్‌ అధికారులు, వివిధ జిల్లాల అధికారులు, వర్కింగ్‌ ఏజన్సీ ప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారుడు (ఆర్‌.డబ్ల్యు.ఎస్‌) జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.