ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి – డాక్టర్‌ పాలెపు సుబ్బారావు

ప్రాచీన తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమైన విషయాలను వెలుగులోకి తేవాలని, ప్రాచ్యలిఖిత గ్రంథాలయం ద్వారా ప్రచురింపబడిన ప్రచురణలన్నింటిని ప్రభుత్వ గ్రంథాలయాలకు చేర్చాలని, వాటిని అధ్యయనం చేయటం ద్వారా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఉన్న విషయాలు అందరికీ తెలుస్తాయని డా. రమణాచారి అన్నారు. తెలుగు భాషా ప్రాచీన హోదా కోసం ప్రభుత్వాల కంటే భాషాభిమానులే ఎక్కువగా కష్టపడ్డారన్నారు. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని మైసూర్‌ నుంచి హైదరాబాదుకు తరలించాలని, తద్వారా మన భాషను మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (మైసూరు) ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం (హైదరాబాదు) సంయుక్తంగా నిర్వహించిన ”తెలుగు శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులపై శిక్షణ శిబిరం” సమాపనోత్సవ సభకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి సభనుద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాలు ప్రాచ్యలిఖిత సంస్థలను పట్టించుకోలేదని తెలంగాణ ప్రభుత్వం వాటిని వెలుగులోకి తెస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులు డా|| అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ, తెలుగు భాషా చరిత్ర, సంస్కృతిపై పనిచేసే శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలన్నారు. వెలుగులోకి రాని చరిత్రపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాచ్యలిఖిత గ్రంథాలయ సహాయ సంచాలకులు డా|| పాలెపు సుబ్బారావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా వాటిని ఆడియో, వీడియోల రూపంలో రికార్డు చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని, నేటి అత్యాధునిక సాంకేతికత విధానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకుని ఉపయోగించుకోవాలన్నారు.

ఆచార్య మునిరత్నం నాయుడు మాట్లాడుతూ, ఈ సదస్సుకి సంబంధించిన విషయాలను పై అధికారులకు సూచిస్తామన్నారు. భవిష్యత్తులో శాసనాలు, చరిత్రకి సంబంధించిన, వ్రాతప్రతులకు సంబంధించిన కార్యశాలలను విడివిడిగా నిర్వహిస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక విధానాల్లో కార్యక్రమాన్ని భద్రపరిచి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. చిట్టచివరగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, మైసూర్‌లో అసోసియేట్‌ ఫెలో డా|| బి. నాగశేషు వందన సమర్పణతో సమాపనోత్సవ సభ ముగిసింది.

వ్రాత ప్రతులను డిజిటలైజ్‌ చేయాలి

ప్రారంభోత్సవ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆచార్య ఎస్‌.రామచంద్రం (ఉపాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం) ప్రారంభకులుగా ఆచార్య ఎస్వీ సత్యనారాయణ (ఉపాధ్యక్షులు, తెలుగు విశ్వవిద్యాలయం) కీలకోపన్యాసకులుగా ఆచార్య ఆర్వీయస్‌ సుందరం, (విశ్రాంతాచార్యులు, మైసూరు విశ్వవిద్యాలయం) గౌరవ అతిథులుగా ఆకునూరి మురళి ఐ.ఎ.ఎస్‌., (సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం) ఆత్మీయ అతిథులుగా ఆచార్య రవ్వాశ్రీహరి (పూర్వ ఉపాధ్యక్షులు, ద్రావిడ విశ్వవిద్యాలయం) ఆచార్య జయధీర్‌ తిరుమలరావు (పూర్వసంచాలకులు, తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం) హైదరాబాదు విచ్చేశారు. సంస్థలో ఉన్న వ్రాతప్రతులను డిజిటలైజ్‌ చేయాలని, వాటిలో నిక్షిప్తమై ఉన్న శాస్త్రాలను పరిష్కరించి, ప్రచురించి భావితరాలకు అందజేయాలని, తెలుగు ఉపాధ్యాయులకు, పరిశోధకులకు, తగు శిక్షణనిచ్చినట్లయితే భావితరాలవారికి బోధించగలరన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అంతేకాకుండా మిగతా భాషల్లో వ్రాయబడిన వ్రాతప్రతులను తెలుగు భాషలోకి అనువాదం చేయవలసి ఉంటుందని, తద్వారా ఇతర భాషల్లో ఉన్న వ్రాతప్రతుల్లోని మనకు తెలియని విషయాలను తెల్సుకోగల్గుతామని, రెండు తెలుగు రాష్ట్రాలూ గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్నవన్నీ సాధించగల్గుతామన్నారు.

ఈ కార్యాలయంలో తాళపత్రగ్రంథాల, రాతప్రతుల పరిశీలన, ఆవశ్యకత అన్న అంశంపై ఆచార్య రవ్వాశ్రీహరి, తాళపత్రగ్రంథ పరిష్కరణకు-బ్రౌన్‌ సేవలు అన్న అంశంపై ఆచార్య నిత్యానందరావు, ప్రాచీన వ్రాతప్రతుల ప్రాధాన్యత, అవగాహనలకు సంబంధించి సంస్థ సహాయ సంచాలకులు డా|| పాలెపు సుబ్బారావు ప్రాచీన నాణాలు- పుట్టుపూర్వో త్తరాలు అన్న అంశంపై డా||డి రాజారెడ్డి, చిత్రభారతం, రంగనాథ రామాయణం గ్రంథాల పరిష్కరణలకు సంబంధించి డా|| సంగనభట్ల నర్సయ్య, శాసనాల పరిశీలన-సంస్కృతి, విజయనగర తెలుగు శాసనాలు- సాంకేతిక అంశాలు అన్న విషయాలపై డా|| ఎన్‌.ఎస్‌. రామచంద్రమూర్తి, లిపులు పూర్వాపరాలు అన్న అంశంపై డా|| మిరియాల సత్యనారాయణ, చిత్రకవిత్వం-బంధకవిత్వం ఆవిర్భావ వికాసాలు, స్వరూపస్వభావాలు అన్న విషయాలపై డా|| వైద్యం వెంకటాచార్యులు, తెలుగు శాసనాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి లిపి, భాషాపరిణామం మొదలగు విషయాలపై డా|| ఈమని శివనాగిరెడ్డి, యక్షగానం రాతప్రతుల పరిష్కరణ, రూపక విశ్లేషణకు సంబంధించి డా|| పి. ఎల్లారెడ్డి, తాళపత్ర గ్రంథాల పరిరక్షణ పద్ధతులపై డా|| జితేంద్రబాబు, కావ్య వ్యాఖ్యాన రచన- పాఠనిర్ణయం, తాళపత్ర పునఃపరిశీలన, అన్న విషయంపై ఆచార్య బి.రామబ్రహ్మం, డా|| సూర్యకుమార్‌, తెలంగాణ తెలుగు శాసనాల్లో తెలుగుభాష స్వరూపాన్ని గురించి వివరించారు.