|

ప్రాజెక్టుల పరుగులు సాగునీటి గలగలలు!

tsmagazineశ్రీధర్‌ రావు దేశ్‌ పాండే
తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం సాగునీటి రంగ అభివద్ధిపై కూలంకషమైన సమీక్ష జరిపింది. తెలంగాణలో ఏర్పడి ఉన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలని నివారించడానికి సాగునీటి సౌకర్యం అత్యవసరమని భావించింది. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని వనరుల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు, మొత్తంగా రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం నాలుగంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నది. 1) గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వలన పూర్తి కాకుండా పెండింగ్‌లో ఉండిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, వాటిలో కొన్నింటిని తెలంగాణా అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్‌ చేసుకొని పూర్తి చేసుకోవడం. 2) గత ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం.3) గత ప్రభుత్వాల కాలంలో నిర్లక్ష్యానికి గురికాబడి శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం. 4) తెలంగాణ గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు అనాది ఆధారాలుగా ఉన్న చెరువులను పునరుద్దరించడం.

భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా సాధించిన ఆయకట్టు :
ఈ లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణలో వివిధ సమయాల్లో ప్రారం భించిన 23 భారీ ప్రాజెక్టులని , 13 మధ్యతరహా ప్రాజెక్టులని పూర్తి చేయ డానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకిగా నిలచిన, గత ప్రభుత్వాలు పరిష్కరించక వదిలేసిన అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం నిర్దేశిత ఆయకట్టు 68.19 లక్షల ఎకరాలు , స్థిరీకరణ పొందే ఆయకట్టు 8.45 లక్షల ఎకరాలు. ఈ మూడేండ్ల కాలంలో ప్రభుత్వం 10 పెండింగ్‌ ప్రాజెక్టులని పూర్తి చేసింది. మరో 13 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నది. వీటి ద్వారా కొత్తగా 13.67 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం, మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది.

చిన్ననీటి చెరువుల కింద సాధించిన ఆయకట్టు :
మిషన్‌ కాకతీయలో పునరుద్ధరణ చేపట్టిన చెరువుల కింద మొదటి దశలో 6.70 లక్షల ఎకరాలు, రెండవ దశ చెరువుల కింద 3.60 లక్షల ఎకరాలు, మొత్తం 10.30 లక్షల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. 57,965 ఎకరాలు చెరువుల కింద కొత్తగా సాగులోకి వచ్చినాయి. 165 చిన్న నీటి ఎత్తిపోతల పథకాల కింద గడచిన మూడేండ్లలో కొత్తగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం, లక్ష ఎకరాల ఆయకట్టుని స్తిరీకరించడం జరిగింది.

అవరోధాలు, సమస్యలతొలగింపు:
ఇక పెండింగ్‌ ప్రాజెక్టులు 10 సంవత్సరాలు గడిచినా అనేక సమస్యల్లో కూరుకుపోయి నత్తనడక నడిచినాయి. భూసేకరణ జరగక, అటవీ అనుమతులు పొందక, రైల్వే, రోడ్డు క్రాసింగులను పూర్తిచేయక,అంతర రాష్ట్ర సమస్యలను పరిష్కరిం చక, కాంట్రాక్టు ఏజెన్సీల ఒప్పంద సమస్యలు, బిల్లుల చెల్లింపులు, కేంద్ర జల సంఘం, కేంద్రపర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు లేవనెత్తిన సాంకేతిక అంశాలపై నివేదికలు సమర్పించక, ప్రాజెక్టుల డిజైన్లను సకాలంలో పూర్తి చేయక ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. ప్రాజెక్టులుప్రతిపాదిత లక్ష్యాలను అందుకోలేకపోయినాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చుఅయినా ప్రాజెక్టులు ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకోలేకపోయినాయి.

ప్రాజెక్టులు నత్తనడక సాగడానికి ప్రధాన అవరోధమైన భూసేకరణ సమస్యని పరిష్కరించి ల్యాండ్‌ ప్రొక్యూర్‌ మెంట్‌ పాలసీ జి ఒ 123 తేదీ 30 జూలై 2015న ప్రభుత్వం జారీ చేసింది. ఈ సవరణ చట్టం ద్వారా భూసేకరణ వేగవంతంగా జరిగి ప్రాజెక్టుల పనులు పుంజుకున్నాయి.

రైల్వే శాఖ వారితో, రోడ్డు భవనాల శాఖతో ప్రతీ నెల ఉన్నత స్థాయి సమావేశాలు జరిపినందున రైల్వే క్లియరెన్స్‌లు , రోడ్డు క్లియరెన్స్‌లు పొందడంతో పనులు వేగంగా ముందుకు సాగుతున్నవి.11 ప్రాజెక్టుల క్రాసింగ్‌ సమస్యలు పరిష్కారం అయినాయి..

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో మహారాష్ట్రతో పదేండ్లుగా అపరిష్క తంగా ఉన్న అంతర రాష్ట్ర వివాదాలను తెలంగాణా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించింది. ప్రాణహిత, గోదావరి, పెన్‌గంగా నదులపై ప్రాజెక్టులని నిర్మించుకోవడానికి మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు జరిగినాయి. ఈ ఒప్పంద ఫలితంగా ప్రాణహితపై తమ్మిడి హట్టి వద్ద, గోదావరిపై మేడిగడ్డ వద్ద, పెన్‌ గంగా నదిపై చనాక కోరాట వద్ద బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఈ బ్యారేజీల నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ వానాకాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సరఫరా చేయడానికి పనులు ప్రణాళికా బద్దంగా జరుగుతున్నాయి.

పెండింగ్‌ ప్రాజెక్టుల అటవీ , పర్యావరణ , వన్యప్రాణి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. అటవీ శాఖతో వారం వారం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుక పోయింది. ఈ మూడేండ్లలో కల్వకుర్తి, ప్రాణహిత, కాళేశ్వరం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(చిన్న కాళేశ్వరం), పాలమూరు రంగారెడ్డి , పెన్‌గంగా కాలువ, చనాక కోరాట బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ లాంటి కీలక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు సాధించడంలో పురోగతి సాధించి నాము. డిండీ, సీతారామా ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను వేగంగా ముందుకు సాగుతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క సంవత్సరంలోనే 9 కీలక అనుమతులు పొందడం ఒక రికార్డు. కాంట్రాక్టు సంబంధిత సమస్యల కారణంగా గత 7,8 సంవత్సరాలుగా పెండింగ్‌లో పడిపోయిన ప్రాజెక్టుల పనులను తిరిగి వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. జి ఓ 146 జారీ చేసి కాంట్రాక్టరు తప్పిదాల వలన కాకుండా ఇతరత్రా కారణాల వలన పనులు కొనసాగని కేసుల్లో ధరల పెరుగుదలను అనుమతించి పనులని ప్రారంభింపజేసింది. ఈ చర్య ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది.

ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్‌ :
జలయజ్ఞంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల్లో సాంకేతిక అపసవ్యతలు, మరికొన్ని డిజైన్ల లోపాలు, నీటి లభ్యత, అమలులో ఎదురవుతున్న సమస్యలు, అంతర రాష్ట్ర సమస్యలు, వన్యప్రాణి కేంద్రాలు, బొగ్గు గను లు ప్రాజెక్టులకు అవరోధాలుగా మారను న్నాయని ప్రభుత్వం గ్రహించింది. వీటిని రీ ఇంజనీరింగ్‌ చేస్తే తప్ప మరో పరి ష్కారం లేదని ప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని నెలల పాటు ఇంజనీరింగ్‌ నిపుణులతో, రిటైర్డ్‌ ఇంజనీర్లతో సమావేశమై సర్వే ఆఫ్‌ ఇండియావారి మ్యాపులు, గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో అధ్యయనం చేసిన అనంతరం ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి, ఖమ్మం జిల్లాలో చేపట్టిన రాజీవ్‌ దుమ్ము గూడెం, ఇందిరాసాగర్‌, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్‌ చేసి కొత్త ప్రతిపాదనలని సిద్దం చేయడం జరిగింది.

ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్‌ చేసి రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు, శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద ఉన్న 18.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరుగుతుంది. రీ ఇంజనీరింగ్‌ లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వద్ద గోదావరిపై బ్యారేజీల నిర్మాణం అవుతున్నాయి. సిడబ్ల్యుసి సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాన్ని 11 టిఎంసిల నుంచి 147 టి ఎం సి లకు పెంచుకున్నాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరాసాగర్‌ రుద్రమకోట ప్రాజెక్టు రాష్ట్ర విభజన అనంతరం అంతర రాష్ట్ర ప్రాజెక్టుగా మారిపోయింది. రాజీవ్‌ దూమ్ము గూడెం ప్రాజెక్టు కిన్నెరసాని అభయారణ్యంలో చిక్కుబడి పోయింది. వీటిని యధాతతంగా ఆములు చేయడం సాధ్యం కాదని గ్రహించి ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను సమీకతం చేసి సీతారామ ప్రాజెక్టును రూపొందించింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా పాత ఖమ్మం జిల్లాలో 3.87 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు సాగునీరు, 6.44 లక్షల ఎకరాలను స్తిరీకరించడానికి సాగునీరు అందించడం జరుగుతుంది.

1.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీరాంసాగర్‌ వరద కాలువ పథకాన్నిఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినారు. ఇందులో 25 టి ఎం సి నిల్వ సామర్థ్యంతో మిడ్‌ మానేరు జలాశయం నిర్మాణం ప్రధానమైనది. మిడ్‌ మానేరు జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఒక ప్రధానమైన కూడలిగా మారినందున నీటి లభ్యత పెరిగింది. అందువలన వరద కాలువ కింద ఆయకట్టుని 2.2 లక్షల ఎకరాలకు పెంచడం జరిగింది. అదే సమయంలో మరో 2 లక్షల ఎకరాల దేవాదుల ఆయకట్టుకు నీరందించాలని రీ ఇంజనీరింగ్‌ లో ప్రతిపాదించడం జరిగింది. అందుకు వీలుగా గౌరవెల్లి, గండిపెల్లి జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం జరిగింది. ముంపు భారీగా ఉన్న తోటపల్లి జలాశయాన్ని రద్దు చేయడం జరిగింది. 25 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన మిడ్‌ మానేరు జలాశయం గత పదేండ్లుగా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, ముంపు గ్రామాల పునరావాసం సమస్యలను పరిష్కరించి మిడ్‌ మానేరు జలాశయాన్ని 100% పూర్తి చేసింది. 2017లో ఈ జలాశయంలో 5 టిఎంసిల నీటిని తాగు నీటి కోసం నిల్వ చేయడం జరిగింది.

దేవాదుల ప్రాజెక్టు కింద ఉమ్మడి ప్రభుత్వం 5.43 లక్షల ఎకరాలను ప్రతిపాదించింది. అయితే 38 టిఎంసిల నీటిని మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం దేవాదుల నీటి కేటాయింపులని 60 టిఎంసిలకు పెంచింది. దేవాదుల పంపులు పని చేయాలంటే గోదావరి నదిలో 71 మీ వద్ద నీరు ప్రవహిస్తూ ఉండాలి. దిగువన ఎటువంటి బ్యారేజీ లేకపోవడంతో 71 మీ మట్టం సంవత్సరానికి 90నుంచి 100 రోజులకు మించి ఉండదు. దేవాదుల నిర్దేశిత లక్ష్యం నెరవేరదు. ఉమ్మడి ప్రభుత్వం కాంతానపల్లి వద్ద 85మీ ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఒక బ్యారేజీని ప్రతిపాదించినా ఆదివాసీల గ్రామాలు, వేల ఎకరాల భూమి మునిగిపోతున్న కారణంగా ముంపు లేకుండా ఉండే విధంగా ఎగువన తుపాకులగూడెం వద్దకు బ్యారేజీ స్థలాన్నిమార్చడం జరిగింది. 83 మీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద 6 టిఎంసిల జాలాశయం ఏర్పాటు అవుతుంది. దేవాదులకు ఎల్లప్పుడూ నీరు అందుబాటులోకి వస్తుంది. స్థలం మార్పుతో ముంపు పూర్తిగా తగ్గిపోయింది. కాంతానపల్లి కింద గతంలో ప్రతిపాదించిన ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి రెండో దశ ఆయకట్టు స్థిరీకరణ ఇప్పుడు కాళేశ్వరం ద్వారా జరగనున్నందున దేవాదులకు నీటి నిలువ సాధించడమే ఈ బ్యారేజీ లక్ష్యం. దేవాదుల ప్రాజెక్టులో ఒక్కటైనా పెద్ద జలాశయం లేదు. రీ ఇంజనీరింగ్‌లో మల్కాపూర్‌ వద్ద 10 టి ఎం సి జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. త్వరలోనే ఈ జలాశయం పనులు మొదలవుతాయి.

భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు:
తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు పదేళ్లలో వివిధ భారీ ప్రాజక్టుల నుంచి 5 లక్షల 83 వేల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది. 93 వేల ఎకరాలను స్థిరీకరిం చినారు. ఇందులో ఒక్క ఎ ఎం ఆర్‌ పి కింద 2.21 లక్షల ఎకరాల సాగు ఉన్నది. తెలంగాణా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ నాలుగేండ్లలోనే 10.95 లక్షల ఎకరాలను కొత్తగా సాగు లోనికి తీసుకొచ్చాం. 9.81 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాం.

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌ ) ఎత్తిపోతల పథకాల కింద 2016-17 సంవత్సరంలో 4.5 లక్షల ఎకరాలకు, 2017-18 సంవత్సరం రబీపంట కాలంలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినందున, 700 పైబడి చెరువులని నింపినందున ఆ జిల్లాలో అద్భుతమైన ఫలితాలు కానవస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పంట దిగుబడి రైతులకు వచ్చింది. జిల్లా నుంచి వలసలు ఆగిపోయినాయి. వలసలు వెళ్ళిన వారు ఊరికి తిరిగి వస్తున్నారు. జిల్లాలో ఒక స్పష్టమైన ఆర్ధిక, సామాజిక మార్పు కనబడుతున్నది. ఇదంతా తెలంగాణా ప్రభుత్వం మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై చూపించిన శ్రద్ద వల్లనే సాధ్యమయ్యింది. ఈ సంవత్సరం మొదటిసారిగా కల్వకుర్తి నియోజకవర్గంలో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది.

అట్లనే మెదక్‌ జిల్లాలో సింగూరు కాలువలని పూర్తి చేసి 2017 లో 30 వేల ఎకరాలకు, 2018 రబీలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించినాము. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు నుంచి మెదక్‌ జిల్లాలో మొదటిసారి నీరివ్వడం జరిగింది.tsmagazine

కరీంనగర్‌ జిల్లాలో ఎల్లంపల్లి ఎత్తిపోతల నుంచి 25 వేల ఎకరాలు, చెరువులని నింపినందున మరో 37000 ఎకరాలు స్థిరీకరించబడినాయి.

ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ కాలువల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీటిని తరలించి వందలాది చెరువులను నింపారు.

ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చెరువులను నింపినందున 6 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ణదీవీ-60 కాలువ పనులు ఈ సంవత్సరం జూన్‌ కల్లా పూర్తి చేసి 2018 ఖరీఫ్‌ లో భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా 58,958 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాము. పాలేరు పాత కాలువను 4 నెలల్లో పునరుద్దరించి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాము.

2018 ఖరీఫ్‌ నాటికి అన్ని ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులని పూర్తి చేసి వాటి కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించడానికి పనులు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి-మిడ్‌ మానేరు లింక్‌ పనులు 2018 ఆగస్టు నాటికి పూర్తీ చేసి, మిడ్‌ మానేరు జలాశయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానం చేసి 2018 ఖరీఫ్‌లో మొదటిదశ 4.5 లక్షల

ఎకరాలు, రెండో దశలో మరో 4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నికరంగా నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఎస్సారెస్సీ కాలువల మర మ్మతు, ఆధునీకీకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవన పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే కాళేశ్వరం నీళ్ళు వరదకాలువ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాశయానికి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా చేరుతాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి దిగువ మానేరు వరకు ఉన్న 5 లక్షల ఎకరాలకు , సరస్వతి కాలువ కింద 40 వేల ఎకరాలకు , లక్ష్మి కాలువ కింద ఉన్న 25 వేల ఎకరాలకు, అలీ సాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఒక లక్ష ఎకరాలకు నికరంగా నీరు అందుతుంది. మిడ్‌ మానేరు జలాశయం కింద మరో 70,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నాగార్జునసాగర్‌ పంపు హజ్‌ పనులు పూర్తిఅయిన కారణంగా గత రబీలో అనేక చేరువులని నింపి చెరువుల కింద ఆయకట్టును కాపాడినాము. వచ్చే ఖరీఫ్‌లో 50,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతో కాలువ పనులు జరుగుతున్నాయి.

2018 వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, పంప్‌హౌజ్‌, టన్నేళ్ళ పనులని పూర్తి చేసి మేడిగడ్డ నుంచి మిడ్‌ మానేరు జలాశయానికి పాక్షికంగా నీటి సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం.

పాత సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ:
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల కాలంలో తెలంగాణ ప్రాజెక్టులు దారుణమైన నిర్లక్ష్యానికి లోనై నిర్వహణ లేక కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయకట్టు సగానికి సగం పడిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. కాలువల్లో పూర్తి మోతాదులో డిస్చార్గ్‌ పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం తెలంగాణలో పాత సాగునీటి ప్రాజెక్టులను పునరుద్దరించాలని సంకల్పించింది. నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, ఘన్‌ పూర్‌ ఆనకట్ట కాలువల ఆధునికీకరణ పనులని పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరందిస్తున్నాం. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల ఆధునీకీకరణ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. సదర్‌ మాట్‌ ఆనకట్ట ఆధునీకరి స్తున్నాం. సాత్నాల, చెలిమేలవాగు, స్వర్ణ, ఆధునికీకరణ పనులు పూర్తి అవుతున్నాయి. పాలేరు పాత కాలువను రికార్డు సమయంలో 4నెలల్లో పూర్తి చేసి ఈ ఖరీఫ్‌లో 10 వేల ఎకరాలకు నీరిచ్చాం.

మిషన్‌ కాకతీయ :
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురి అయి విధ్వంసం అయిన చెరువుల వ్యవస్థని పునరుద్దరించడానికి ప్రభుత్వం మన వూరు మన చెరువు నినాదంతో ” మిషన్‌ కాకతీయ ” కార్యక్రమాన్ని మార్చ్‌ 2015 లో ప్రారంభించింది. 5 దశల్లో 46,500 చెరువుల పునరుద్దరణ పూర్తి చెయ్యాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికి మూడు దశల్లో చెరువుల పునరుద్దరణ కార్యక్రమం జయప్రదంగా అమలు అయ్యింది. జనవరి 2018 నాలుగో దశ ప్రారంభం అయ్యింది.

చెరువుల పునరుద్దరణలో ఒక కీలకమైన పని పూడిక తొలగింపు కార్యక్రమం. ఇది రైతుల భాగస్వామ్యంతో అధ్భుతంగా జరిగింది. రెండు దశల్లో మొత్తం 18.25 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పూడిక మట్టిని (దాదాపు 7.3 కోట్ల ట్రాక్టర్‌ ట్రిప్పులు) రైతులు తరలించుకుపోయినారు. అందుకు వారు సుమారు 700 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు అంచనా. ఇది నిజంగా అపూర్వం. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్‌ కాకతీయ కొనసాగిందనడానికి ఇది ప్రభలమైన దాఖలా.

మిషన్‌ కాకతీయ అమలు వలన రాష్ట్రంలో మైనర్‌ ఇర్రిగేషన్‌ కింద 10.30 లక్షల ఎకరాలు చెరువుల కింద అదనంగా స్థిరీకరణ పొందినాయి. మిషన్‌ కాకతీయ అమలు తర్వాత 2016-17 లో 51.5శాతం సాగు విస్తీర్ణం చెరువుల కింద పెరిగింది నాబార్డు అనుబంద సంస్థ నాబ్కాన్స్‌ సర్వే ద్వారా తేల్చింది.

సాగునీటి శాఖలో చేపట్టిన సంస్కరణలు :
ప్రాజెక్టుల్లోఅనేక సమస్యలకు కారణమైన ఇ పి సి కాంట్రాక్ట్‌ పద్దతిని ప్రభుత్వం రద్దు చేసి ఎంత పని చేస్తే అంత పనికి బిల్లులు చెల్లించే కాంట్రాక్ట్‌ పద్దతిని పునరుద్దరించింది. 382 మంది జూనియర్‌ స్థాయి ఇంజనీర్ల నియామకాలు చేపట్టి ప్రాజెక్టుల్లో పనులను వేగవంతం చేసింది. ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా మేజర్‌ ప్రాజెక్టులకు కొత్త చీఫ్‌ ఇంజనీర్లను నియమించింది. సాగునీటి శాఖలో ఎస్టిమేట్ల అనుమతులు పొందే ప్రక్రియను సరళతరం చేసింది. వివిధ స్థాయిల ఇంజనీర్ల అధికారాలను పెంచింది. సర్వే, డిజైన్‌, క్వాలిటీ, హైడ్రాలజీ, అంతర రాష్ట్ర విభాగాలను పటిష్టం చేసింది.

రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు రాష్ట్ర బడ్జెట్‌ లో సాగునీటి శాఖకు 25 వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌ నుంచే కాక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ూవీఖ్‌ూ, === , ణ=Iూ పథకాల నుంచి నిధులు రాబడు తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్‌ నేత త్వంలోని జాతీయ బ్యాంకుల ద్వారా 7400 కోట్ల రుణాన్ని, లింక్‌ 2 పనులకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నేత త్వంలోని జాతీయ బ్యాంకుల షశీఅరశీత్‌ీఱబఎ ద్వారా మరో 11,400 కోట్ల రుణాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ రుణాలు కాళేశ్వరం కార్పోరేషన్‌ ద్వారా సమకూరుతున్నాయి. నిధుల లేమి లేకపోవడంతో కాళేశ్వరం పనులు న భూతో న భవిష్యత్‌ అన్న పద్దతిలో పురోగమిస్తున్నాయి.tsmagazine

నదీ జలాల వినియోగం :
కష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నది తెలంగాణా ప్రభుత్వం. కష్ణా జలాల పున: పంపిణీ కోసం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు, సుప్రీంకోర్టు ముందు వాదనలు కొనసాగుతున్నాయి.

ఈ లోపున గత ప్రభుత్వాలు పరిపాలనా అనుమతులు ఇచ్చి అటకెక్కించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండీ ఎత్తిపోతల పథకాలని వరద జలాల ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు, డిండీ ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో 4.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. గోదావారి నదీ జలాల్లో తెలంగాణాకు ఉన్న 954 టీఎంసీల నీటి కేటాయింపులని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం కాళేశ్వరం, సీతారామా, దేవాదుల సహా అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నది.
ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల పెంపు :
తెలంగాణా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వాలు అనాలోచితంగా చేసిన నీటి కేటాయింపులని సవరించింది. 5,43,750 ఎకరాలకు సాగునీరు అందించే దేవాదులప్రాజెక్టుకు గత ప్రభుత్వం కేటాయించిన నీరు 38 టి ఎం సి లు. తెలంగాణా ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టుకు 60 టిఎంసిల నీటిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి గత ప్రభుత్వం కేటా యించిన నీరు 25 టిఎంసి లు. తెలంగాణా ప్రభుత్వం కల్వకుర్తికి 40 టిఎంసిలను కేటాయించింది. 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఉమ్మడి ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు కేటాయించిన నీరు 160 టిఎంసిలు. ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే నీరు కలుపుకుంటే 180 టిఎంసిలు. తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం నీటి కేటాయింపులని 180 టిఎంసిలకు పెంచింది. ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే నీరు కలుపుకుంటే 200 టిఎంసిలు. ప్రాణహితకు వేరేగా 20టిఎంసిలు ఆదిలాబాద్‌ తూర్పు జిల్లా కోసం కేటాయించింది.
రీ ఇంజనీరింగ్‌ తో గోదావరి నది సజీవం :
తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన రీ ఇంజనీరింగ్‌ ప్రతిపాదనల వల్ల గోదావరి నదిపై కొత్త బ్యారేజిల నిర్మాణం జరుగుతోంది. మొత్తం గోదావరి నదిలోనే 146.30 టిఎంసిల నీటి నిల్వ సాధ్యపడుతున్నది. గోదావరి నది సజీవం అవుతున్నందున ఉత్తర తెలంగాణ రూపు రేఖలు మారబోతున్నాయి. వ్యవసాయం, చేపల పెంపకం, టూరిజం, జలరవాణా, పరిశ్రమల స్థాపన వంటి రంగాలలో అనూహ్యమైన ఆర్ధిక ప్రగతి జరగనుంది. బయో డైవర్సిటీ పెంపొందనున్నది. స్థానిక ప్రజానీ కానికి ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. తెలంగాణా ప్రజల సాగు నీటి ఆకాంక్షలు నెరవేరే దారిలో ప్రాజెక్టుల పురోగతి సాగుతున్నది. తెలంగాణా కోటి ఎకరాల మాగాణంగా మారడానికి మరెంతో కాలం పట్టదు.