|

‘బంగారు తెలంగాణ’ నిర్మాణానికి పునరంకితం

tsmagazineతెలంగాణా రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చరిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్‌ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించింది. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ నేడు పునరుత్తేజం పొందాయి. మనిషి కేంద్రంగా రూపొందిన ప్రణాళికలు పేద వర్గాలకు చేయూత ఇచ్చి నిలబెడుతున్నాయి. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండదండలు కల్పిస్తున్నాయి. సకల రంగాలలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణా ఆనతి కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదం చేస్తున్నది.

స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి పునరుద్ఘాటన

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ, అంధ్ర ప్రదేశ్‌ విభజన అనంతరం తెలంగాణా ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలోనే
సంపూర్ణంగా నిమగ్నమైందని, స్వయంగా ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే మనం చిల్లర మల్లర రాజకీయాలతోనో, వ్యర్థ వివాదాలతోనో పొద్దు పుచ్చలేదు. ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నం. గంభీరమైన దక్పథంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణా ప్రస్థానం సాగుతున్నది.

తెలంగాణాలో వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకున్నది. సమైక్య రాష్ట్రం లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా అత్యంత దయనీయంగా ఉండేది. నదీ జలాల పంపిణీలో అన్యాయం, ప్రాజెక్టుల నిర్మాణంలో వివక్ష, సాగునీటికి తాగునీటికి తీవ్రమైన కట కట.శిథిలమై పోయిన చెరువులు, ఎండిన బావులు, వెయ్యి మీటర్ల లోతున బోరు వేసినా చుక్క నీరు పడని దుస్థితి అలుముకుని ఉండేది. నిత్యం కరువు కాటకాలు. పడావు పడ్డ భూములు. పాడయి పోయిన పల్లెలు. వలస బాట పట్టిన ప్రజలు. ఎప్పుడన్నా కాలం కరుణిస్తే, అద్దెక రమో ఎకరమో పంట వేసుకుంటే … రెండు మూడు గంటలు కూడా కరెంటు రాక పంటలు ఎండిపోయేవి. దిక్కు తోచని స్థితిలో రైతులు ఎండిన పంటను కాలబెట్టిన సంఘటనలు కోకొల్లలు. చివరికి ఎక్కడా దారి కానరాక తెలంగాణా రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇదీ తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం.

ఈ దశలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించి, రైతులలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి, రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం కలిగించింది. సమైక్య రాష్ట్రంలో ఎగబెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చెల్లించింది. వ్యవసాయ ట్రాక్టర్ల కు రవాణా పన్ను రద్దు చేసింది. నాటి పాలకులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కేవలం లక్షన్నర రూపాయలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకునేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక వైపు శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతూనే మరోవైపు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచింది. గత పాలకుల హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు నానా అగచాట్లు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆ పరిస్థితిని నివారించింది. సకాలంలో ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తున్నది.

నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు వ్యవసా యానికి శాపంగా మారిన దశలో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేసింది, కల్తీ నేరాలన్నిటినీ పిడి యాక్టు పరిధిలోకి తీసుకువచ్చి , అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకున్నది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నకిలీ విత్తనాలు తయారుచేస్తున్న ఐదు కంపెనీలపై పీడీయాక్ట్‌ నమోదు చేసి, ఆ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నది. కల్తీ విత్తనాలు పంపిణీ చేస్తున్నందుకు 135 మంది డీలర్ల లైసెన్స్‌ల తో పాటూ, తొమ్మిది సెంట్రలైజ్డ్‌ సీడ్‌లైసెన్సులను ప్రభుత్వంరద్దు చేసింది. రానున్న రోజుల్లోనూ రైతాంగం ప్రయోజనాలు రక్షించే విషయంలో ఇదే విధంగా రాజీ లేని వైఖరితో ముందుకుపోతామని, కల్తీ వ్యాపారాలను ఉక్కుపాదం మోపి అణిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.

దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఈ అద్భుతం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా నిబద్ధతతో కృషి చేసింది. తెలంగాణా ఏర్పడితే చిమ్మ చీకట్లే అన్నవాళ్ళ అంచనాలను ప్రభుత్వం తలకిందులు చేసింది. వ్యవసాయానికి మొదట 9 గంటలు విద్యుత్‌ అందేట్టు చేసి, ఈ ఏడాది జనవరి ఒకటి నుండి 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును రైతులకు ఉచితంగా ఇస్తున్నది. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ను ఏర్పాటు చేసింది. ప్రతీ క్లస్టర్‌ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించడంతోపాటు, రైతు వేదికలను కూడా నిర్మిస్తుంది. రైతులు పరస్పరం చర్చించుకోవడానికి ఈ వేదికలు గొప్పగా ఉపయోగపడతాయి.
tsmagazine

వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు 50 నుంచి 90 శాతం సబ్సిడీపై ఇప్పటి వరకు రైతులకు 14వేల ట్రాక్టర్లు అందించింది. ఇతర ఆధునిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులకు సబ్సిడీపై వరినాటు యంత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది మండలానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,500 వరినాటు యంత్రాలు పంపిణీ చేస్తున్నాం. తక్కువ నీటి తో ఎక్కువ పంట తీయడానికి ఉపయోగపడే డ్రిప్‌ ఇరిగేషన్‌ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బిసిలకు, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. చిన్న, సన్న కారు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. పాలీ హౌస్‌, గ్రీన్‌ హౌస్‌ లను ఏర్పాటు చేసుకునేందుకు చిన్న సన్న కారు రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తున్నది. రాష్ట్రంలోపాలీ హౌజ్‌, గ్రీన్‌ హౌజ్‌ కల్టివేషన్‌ పెరిగింది.

రైతాంగం సంఘటితమైతే తమ సమస్యలు తామే పరిష్కరించుకో గలుగుతారు. సంఘటిత శక్తిలోని బలం రైతులకు తెలియజేయడం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమితులు విత్తనం వేసే దగ్గరి నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు, అన్ని దశల్లోనూ రైతుల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తాయి.

అధికార వ్యవస్థలలో అన్ని స్థాయిలలో సామాజిక న్యాయం అమలు కావాలని ప్రభుత్వం భావిస్తున్నది. దేశంలోనే మొదటి సారిగా మార్కెట్‌ కమిటీలలో రిజర్వేషన్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళా వర్గాల్లోని రైతులకు మార్కెట్‌ చైర్మన్లు అయ్యే హక్కును ప్రభుత్వం కల్పించింది.

పంటలకు గిట్టుబాటు ధర వచ్చేదాకా రైతులు ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తరువాత 364 గోదాములు నిర్మించింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో గోదాముల్లో నిల్వ సామర్థ్యం 22.47 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 3,285 ధాన్యం కొనుగోలు కేంద్రాలుంటే, వాటి సంఖ్యను 6,028కి ప్రభుత్వం పెంచింది. సిసిఐ కేంద్రాల సంఖ్యను 41 నుంచి 243కి పెంచింది. మక్కల కొనుగోలు కేంద్రాల సంఖ్యను 165 నుంచి 379 కి పెంచింది.

భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం,భూ రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండడం కోసం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన కృషితో దాదాపు 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. సాదా బైనామాల ద్వారా జరిగిన భూముల క్రయ విక్రయాలకు చట్టబద్ధత కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించింది. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఇకపై వందకు వంద శాతం పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం ‘ధరణి’ వెబ్‌ సైట్‌ కు రూపకల్పన చేసింది.tsmagazine

రైతును వేధిస్తున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పంట కాలంలో రైతులు పెట్టుబడి లేక, అప్పుల కోసం చేయిచాస్తున్నరు. రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులకు పెట్టుబడి సమస్యను పరిష్కరించాలని ‘రైతుబంధు’ పేరుతో అపూర్వమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి 4000 రూపాయల చొప్పున రెండు పంటలకు కలిపి 8000 రూపాయలు ఈ పథకం ద్వారా అందిస్తున్నది. రైతు బంధు చెక్కుల పంపిణీ పల్లెలలో పండుగ వాతావరణాన్ని సష్టించింది. పంట కాలంలో పెట్టుబడి సహాయం కోసం ఎకరానికి నాలుగువేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల మంది రైతులకు 5,111 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంత భారీ బడ్జెట్‌ నేరుగా రైతుల చేతికి అందించటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. వచ్చే నవంబర్‌ మాసంలో రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నద్దంగా ఉన్నదని రైతు సోదరులకు సంతోషంగా తెలియజేస్తున్నాను. రైతుబంధు పథకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నది.

రాష్టంలో ఏ రైతైనా ఏ కారణంగానైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడవద్దని ప్రభుత్వం యోచించింది. ఏ రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించేందుకు, రైతు బీమా పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తెస్తున్నది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున రైతులకు బీమా సౌకర్యం కల్పించిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సష్టిస్తున్నది. భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.సి.) ద్వారా ఈ పథకం అమలవుతుంది. ప్రతీ ఏటా చెల్లించా ల్సిన ప్రీమియం మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. 5లక్షల బీమా మొత్తం రైతు మరణించిన పది రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబానికి అందించే విధంగా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దష్టి సారించింది. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. గత పాలకులు లోపభూయిష్టంగా చేసిన ప్రాజెక్టుల డిజైన్లను నిపుణుల సలహాలతో ప్రభుత్వం రీడిజైన్‌ చేసింది. గోదావరి జలాల వినియోగం కోసం మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని, కేంద్రం ఆమోదాన్ని పొంది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో ఏటా 25 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తున్నది. బ్యాంకుల ద్వారా కూడా అదనపు నిధులు సమకూరుస్తున్నది.

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి
సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా పెండింగులో పడేసిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తున్నది. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. ఈ ఏడాది మరో 12లక్షల ఎకరాలకు సాగునీరు అంది స్తుంది. చనాఖా-కొరటా ప్రాజెక్టు, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్‌ మాట్‌ బ్యారేజి, మల్కాపూర్‌ రిజర్వాయర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అవసరం ఏర్పడిన సమయంలో కాళేశ్వరం ద్వారా శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు నీరందించడం కోసం వెయ్యి కోట్ల రూపాయ లతో ప్రభుత్వం ‘శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకం’ ప్రారంభించింది. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, నిరంతర నీటి లభ్యత కోసం గోదావరిపై తుపాకుల గూడెం బ్యారేజిని నిర్మిస్తున్నది. ప్రభుత్వం రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసింది.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను శరవేగంగా ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసమైన చెరువులను మిషన్‌ కాకతీయ పథకం ద్వారా ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నది. ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో 365 రోజులు చెరువులు నీటితో కళకళలాడుతాయనే సంతోషకరమైన విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్రాజెక్టులు పూర్తి కావడానికి రాత్రింబవళ్లు అంకితభావంతో పనిచేస్తున్న నీటి పారుదల శాఖకు అభినందనలు తెలియచేస్తున్నాను.

విద్యుత్తు రంగంలో ప్రగతి
తెలంగాణా ఏర్పడితే పెనుచీకట్లే అని విభజన సమయంలో అనేకమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, విద్యుత్‌ రంగంలో ప్రభుత్వం అనూహ్యమైన ప్రగతిని సాధించింది. వ్యవ సాయంతో పాటు అన్ని రంగాలకు నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా చేసి, విద్యుత్‌ రంగాన్ని అద్భుతంగా అభివృద్ది చేసినందుకు విద్యుత్‌ శాఖ ఉద్యోగులందరినీ నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నమై పోయింది. కులవృత్తుల మీద ఆధారపడి జీవించే బీ సీ కులాల జీవితాలు కుప్పకూలి పోయినాయి. ఈ వృత్తులకు ఆర్థిక చేయూత, ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని బిసిల స్థితిగతులను మార్చాలని, తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను తిరిగి నిలబెట్టాలని ప్రభుత్వం భావించింది. తెలంగాణా ప్రభుత్వం భారతదేశంలో మరే రాష్ట్రంలో కూడా అమలు చేయని గొప్ప కార్యక్రమాలను బిసిల కోసం రూపొందించి అమలు చేస్తున్నది. దీనికోసం మూడంచెల వ్యూహాన్ని ఎంచుకున్నది. అందులో మొదటి వ్యూహం నేటికీ మనుగడలో ఉన్న కుల వృత్తులకు తగిన ఆర్థిక మద్దతు ఇవ్వడం కాగా, ఇంకా పాత సాంప్రదాయక పద్దతులనే అనుసరిస్తున్న కులవృత్తుల వారికి ఆధునిక పరిజ్ఞానాన్ని, పరికరాలను, అందించి నిలబెట్టటం అనేది రెండవ వ్యూహం. ఇక మూడవది పరిణామ క్రమంలో పూర్తిగా అంతరించి పోయిన వృత్తుల మీద ఇంకా ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించటం. ఈ మూడు వ్యూహాలకు తగిన విధంగా వివిధ పథకాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

గొర్రెల పంపిణీ
గొల్ల, కురుమలు, మత్స్యకారులు, నేత కార్మికులు, విశ్వకర్మలు, చాకలి, మంగలి తదితర కులాల సోదరులు మన తెలంగాణకున్న గొప్ప మానవ సంపద. సమాజానికి వీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. గొల్ల కుర్మలకు పెద్దఎత్తున గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారభించాం. ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశాం. వాటి ద్వారా మరో 30 లక్షల గొర్రె పిల్లల ఉత్పత్తి జరిగింది. పెరిగిన జీవ సంపదతో ఇప్పటికే 1,200 కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనం గొల్ల కుర్మలకు చేకూరింది. గొర్రెలకు కావలసిన దాణా కూడా ప్రభుత్వం ఉచితంగా పంపిణీచేస్తుండటంతో గొల్లకుర్మలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ దేశంలో గొర్రెలతో పాటు ఇతర పశువులకు సత్వర వైద్య సేవలు అందించడం కోసం 100 సంచార పశువైద్యశాలలు నడుపుతున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.

బర్రెల పంపిణీ
రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సీడీ పై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీ ప్రారంభించింది. ఒక్కో యూనిట్‌ కు 80 వేల రూపాయలు కేటాయించింది. రవాణా ఖర్చుల కోసం మరో ఐదు వేల రూపాయలు అదనంగా అందిస్తున్నది. పాల సొసైటీల నుంచి కొనుగోలు చేసే పాలకు లీటరుకు నాలుగు రూపాయల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తున్నది.

చేపల పెంపకం
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిం చడం కోసం కావాల్సిన చేప పిల్లలను, రొయ్య పిల్లలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. అన్ని జలాశయాల్లో కోట్లాది చేప పిల్లలను వదులుతున్నది. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. భవిష్యత్తులో మత్స్య పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

చేనేతకు ప్రోత్సాహం
చేనేత కళకు తెలంగాణా పెట్టింది పేరు. గద్వాల, నారాయణ పేట, పోచంపల్లి, సిద్ధిపేట, సిరిసిల్ల నేత ఉత్పత్తులు నేటికీ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కాలమాన పరిస్థితుల వలన కొంత, సమైక్య పాలనలో ప్రదర్శించిన నిరాదరణ వల్ల కొంత చేనేత రంగం భయంకర సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత కార్మికులు ఆత్మహత్యల పాలయ్యారు. చేనేత, పవర్‌ లూం కార్మికుల స్థితి గతులు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వివిధ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. నేత కార్మికులు నేసే వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా పంచే చీరల కోసం చేనేత ఉత్పత్తులను, అదేవిధంగా పవర్లూం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. చేనేత వారికి మరియు మరమగ్గాల వారికి నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీని కల్పిస్తున్నది. మార్కెట్‌ సదుపాయాలను మెరుగుపరిచి, కార్మికులకు కనీస ప్రతిఫలం దక్కే విధంగా చర్యలు తీసుకున్నది. చేనేత ఉత్పత్తులకు మంచి ప్రచారం కల్పిస్తున్నది. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వరంగల్‌లో మెగా టెక్స్‌ టైల్‌ పార్కు నిర్మిస్తున్నది. సిరిసిల్ల, గద్వాలలో టెక్స్‌ టైల్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తున్నది.

ఇతర కులాలకు ప్రోత్సాహం
నవీన క్షౌరశాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మణులకు, బట్టలు ఉతికే అధునాతన యంత్రపరికరాలు కొనుగోలు చేసేందుకు రజకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టింది. అంతేకాకుండా చెట్ల పన్నును పూర్తిగా రద్దుచేసింది. ప్రమాదవశాత్తూ గీతకార్మికులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని 5 లక్షలకు పెంచింది. సంచార కులాలు, ఆశ్రిత కులాలు, తదితర వర్గాలవారికోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో ఎం.బి.సి కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేసింది.

బిసిలకు నేరుగా రుణాలు
వెనుకబడిన కులాల వారికి ఈ రోజు ఒక శుభవార్తను తెలిపేందుకు సంతోషిస్తున్నాను. బిసి కులాల వారు వారికి నచ్చిన పని చేసుకోవడానికి వీలుగా, తగిన ఆర్ధిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బ్యాంకులతో నిమిత్తం లేకుండా, లబ్ధిదారులు ఒక్క రూపాయి వాటాధనం చెల్లించ వలసిన అవసరం లేకుండా, వందకు వంద శాతం ఉచితంగా బిసిల కులాల వారందరికీ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించమని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.tsmagazine

అగ్రవర్ణాల్లోని పేదల కోసం పథకాలు
పేదరిక నిర్మూలనే పరమ లక్ష్యంగా భావించి తెలంగాణా ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను ఆదుకోవడానికి చిత్త శుద్ధితో కృషి చేస్తున్నది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో పేదరికాన్నే ప్రాతిపదికగా తీసుకొని అమలు చేస్తున్నది. ఆసరా పెన్షన్లు, రేషన్‌ బియ్యం, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్స్‌ లాంటి సంక్షేమ పథకాల ఫలాలను అన్ని కులాలలోని పేదలకు పంచుతున్నది. బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేక పథకాలను రూపకల్పన చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని తెలియజేస్తున్నాను.

సంక్షేమంలో స్వర్ణయుగం
దేశంలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రజలు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని చవిచూస్తున్నారు.. 40వేల కోట్ల రూపాయలతో 40కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణా ప్రజా సంక్షేమంలో దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచింది.

 •  రాష్ట్రంలోని వృద్దులు, వితంతువులతో పాటు కల్లుగీతకార్మికులకు, నేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. వికలాంగులు, పేద వృద్ధ కళాకారులకు నెలకు 1500 రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నది. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం మన రాష్ట్రంలోనే 4 లక్షల మంది బీడీ కార్మికులకు, 1.26 లక్షల మంది ఒంటరి మహిళలకు, 47 వేల మంది బోదకాలు బాధితులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్‌ అందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికి ఏడాదికి 964 కోట్ల వ్యయంతో 31.42 లక్షల మందికి మాత్రమే కొద్ది మొత్తంలో ఏదో విదిలించిన విధంగా పించన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో 5,367 కోట్ల రూపాయలను 41.78 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. అసహాయులకు కనీస జీవన భద్రత కల్పిస్తున్నది.
 • ప్రజలకు ఆహారం అందించే విషయంలోనూ గత ప్రభుత్వాలు సంకుచితంగా పిసినారితనం చూపిం చాయి. గత ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 4 కేజీల చొప్పున కుటుంబానికి పరిమితంగా 20 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చేది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 6 కేజీల చొప్పున కుటుం బంలో ఎంత మంది ఉంటే అంత మందికి రూపాయికి కిలో చొప్పున బియ్యాన్ని అందిస్తున్నది. పాఠశాలలలో విద్యార్థులకు మధ్యాహ్నభోజనం కోసం, అదే విధంగా హాస్టళ్ళలో ఉండే విద్యార్థులకు ఆహారం కోసం ప్రభు త్వం సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో, హాస్టళ్లలో, అంగన్‌ వాడీలలో చదివే లక్షలాది మంది విద్యార్ధులు ప్రతీ రోజు సన్నబియ్యంతో వండిన అన్నం తింటున్నారు. సన్న బియ్యంతో భోజనం పెడుతున్నప్పటి నుంచి పాఠశాలల్లో విద్యార్థుల హాజరీ గణనీయంగా పెరిగింది.
 • రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందించేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ పధకం ప్రారంభించింది. ఈ పధకం ద్వారా పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటిదాకా ఈ పథకం ద్వారా 4 లక్షల మంది లబ్దిపొందారు.18 ఏండ్లు నిండిన అమ్మాయిలే ఈ పథకానికి అర్హులు అనే ప్రభుత్వ నిబంధన వల్ల, బాల్య వివాహాలు గణనీయంగా తగ్గిపోయాయి.
 • ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలతో పాటు ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలకు విదేశీ విద్య కోసం ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 20 లక్షల రూపాయల వరకు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ అందిస్తున్నది.
 • వడగండ్లు, భారీ వర్షాలు, వరదల లాంటి ప్రకృతి వైపరీ త్యాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తు న్నది. పిడుగుపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నది.
 • రాష్ట్రంలో గుడుంబా మహమ్మారిని ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. గుడుంబా తయారు చేసే వారికి పునరావాసం కోసం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. 6,323 మందికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపింది.
 • ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తెచ్చి, పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు కేటా యించిన నిధులు వారి కోసమే ఖర్చు చేసే విధం గానూ, ఒక ఏడాది ఖర్చు కాని నిధులను మరుసటి ఏడాదికి బదలాయించే విధంగానూ చట్టంలో నిబంధన విధించి ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీని వల్ల నిధుల కొరత అనే మాట లేకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం సాధ్యమవుతున్నది.
 • దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం అమలవుతున్నది. ఇప్పటి వరకు 12,974 ఎకరాలు కొనుగోలు చేసి, 5,065 మంది దళితులకు పంపిణీ చేసింది. ఈ భూమిలో బోరు, మోటారు, కరెంట్‌ కనెక్షన్‌ లాంటి సదుపాయాలన్నిటితో పాటు, అవసరమైన పెట్టుబడిని కూడా ప్రభుత్వమే సమకూర్చింది. దళితులకు 3 ఎకరాల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగే కార్యక్రమం. ఈ ఏడాది దళితుల భూ పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 1,469 కోట్లు కేటాయించింది.
 • నిరుద్యోగులకు ఎస్సీ, ఎస్టీ స్టడీసర్కిళ్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దీనికితోడు ఆయా వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసి ఉద్యోగ అవకాశాలు దక్కనివారికి ప్రత్యేకంగా వృత్తినైపుణ్య శిక్షణ అందిస్తున్నది.
 •  ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ రాపిడ్‌ ఇంకుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ (ుూ ూ=Iణజు) అనే వినూత్న కార్యక్రమం అమలు చేస్తున్నది.కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారితోపాటు, ఇప్పటికే పరిశ్రమలను ఏర్పాటుచేసిన వారు వాటిని విస్తరించాలనుకున్నా ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నది. దీని ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌కు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీని రూపాయి నుంచి రూపాయిన్నరకు ప్రభుత్వం పెంచింది. చిన్నతరహా పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు వారు తీసుకున్న రుణాలపై కేవలం పావలా వడ్డీ మాత్రమే చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు శిక్షణనిచ్చి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్‌ కల్పించింది. ఎస్టీల విద్యుత్‌ బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. విజిలెన్సు కేసులు ఎత్తేసింది. 50 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే ఎస్సీ, ఎస్టీల కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
 •  మైనారిటీల సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించి, ఖర్చు చేస్తున్నది.
 • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీల కోసం ప్రత్యేకంగా 206 గురుకులాలు ఏర్పాటు చేసి, వారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య,మంచి భోజనం, వసతిని ప్రభుత్వం అందిస్తున్నది.
 • దేశంలో మరెక్కడాలేని విధంగా తెలంగాణలోని 5 వేల మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్‌, మౌజమ్‌ లకు నెలకు రూ.1500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భతి అందజేస్తున్నది.
 • రంజాన్‌, క్రిస్మస్‌ సందర్భంగా ప్రతీ సంవత్సరం రాష్ట్రంలోని నిరుపేద మైనారిటీ కుటుంబాలకు చెందిన 4 లక్షల మందికి ప్రభుత్వం కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నది. అన్ని ముస్లిం ప్రార్థనా మందిరాల్లో అధికారికంగా ఇఫ్తార్‌ విందులు, క్రిస్మస్‌ సందర్భంగా చర్చిలలో క్రిస్మస్‌ విందులు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడుతున్నది.
 • హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇస్లామిక్‌ సెంటర్‌ కమ్‌ కన్వెన్షన్‌హాల్‌ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణానికి రూ.40 కోట్లను మంజూరు చేసింది. ఇందుకోసం కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ముస్లింల కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే వేదికగా ఈ హాల్‌ ఉపయోగపడుతుంది. మైనారిటీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం టిఎస్‌ ప్రైమ్‌ పథకం ప్రవేశ పెట్టింది. దీని ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే రాయితీలు, ప్రోత్సహకాలు కల్పిస్తున్నది.
 • హైదరాబాద్‌లో మైనారిటీ ఐటి పారిశ్రామిక వేత్తల కోసం త్వరలోనే ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లిం అనాథలకు ఆశ్రయమిస్తున్న సంస్థ అనీస్‌ ఉల్‌ గుర్బాకు నాంపల్లిలో 4300 చదరపు గజాల అత్యంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నది.
 • మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం అందించే రుణాల సబ్సిడీని 50శాతం నుంచి 80 శాతానికి ప్రభుత్వం పెంచింది. పథకం విలువను రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచింది. రెండు, మూడు లక్షల విలువైన యూనిట్లకు వంద శాతం సబ్సిడీని బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం సాయం అందిస్తున్నది.
 • నాక్‌, ఇసిఐఎల్‌, సిఐపిఇటి, సెట్విన్‌ లాంటి సంస్థల ద్వారా మైనారిటీ యువత నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ అందిస్తున్నది. దాని వల్ల మైనారిటీ యువకులు వివిధ నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో రాణించడానికి అవకాశం కలుగుతుంది.
 • తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎక్కడైనా చర్చి నిర్మించుకోవాలంటే కఠిన నిబంధనలుండేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది.
 • రాష్ట్రవ్యాప్తంగా 52 షాదీఖానా కమ్‌ ఉర్దూ ఘర్‌లను ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్‌లో సిక్కు గురుద్వారా నిర్మాణానికి రూ. 5 కోట్లకు పైగా విలువైన 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
 • 17 మైనారిటీ జూనియర్‌ కాలేజీలు, నాలుగు మైనారిటీ డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోర్సులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉర్దూ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులున్న కాలేజీల్లో అధ్యాపకుల నియామకం చేపట్టింది.
 • జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.120 కోట్లు కేటాయిం చింది. జర్నలిస్టులకు హెల్త్‌ కార్డు సౌకర్యం కల్పించింది. రూ.100 కోట్ల నిధులతో ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది.

tsmagazine

మహిళా సంక్షేమం

సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్స్‌, షి టీమ్స్‌, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి, భద్రతకు దోహదపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్‌ కమిటీల్లో కూడా మహిళలకు ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

గర్భిణులను ప్రసవ సమయంలో దవాఖానకు తీసుకురావడానికి, ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డతోపాటు సురక్షితంగా, ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ‘అమ్మఒడి’ పథకం ద్వారా ప్రభుత్వం వాహనాలను సమకూర్చింది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అంగన్‌ వాడీ కేంద్రాల్లో తల్లీబిడ్డలకు ప్రతీరోజు పౌష్టికాహారం అందిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో ప్రభుత్వం రెండు సార్లు అంగన్‌ వాడీల జీతాలు పెంచింది. సమైక్య రాష్ట్రంలో అంగన్‌ వాడీ టీచర్లకు 4,200 రూపాయల జీతం ఉంటే, ఇప్పుడు వారి వేతనం 10,500 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. 2,200 రూపాయలున్న అంగన్‌ వాడీ హెల్పర్ల జీతాలను ఆరు వేలకు పెంచింది. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు నెలకు కేవలం రూ.1000 నుంచి రూ.1500 మాత్రమే పారితోషికం లభించడం సరికాదని భావించిన ప్రభుత్వం వారి జీతాన్ని 6 వేలకు పెంచింది.

దివ్యాంగులను పెళ్లి చేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. వికలాంగులకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం కల్పిస్తున్నది.

హోంగార్డులు, ఐకెపి, నరేగా, సెర్ప్‌ ఉద్యోగులు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, విఆర్‌ఎలు, విఎవోలు, ఎఎన్‌ఎంలు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పార్ట్‌ టైమ్‌ లెక్చరర్లు, జిహెచ్‌ఎంసిలో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. గ్రామ పంచాయితీల్లో పనిచేసే పారిశుద్య సిబ్బంది వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా ట్రాఫిక్‌ పోలీసులకు వేతనంలో 30 శాతం అదనంగా రిస్క్‌ అలవెన్సు ప్రభుత్వం అందిస్తున్నది. జర్నలిస్టులకు, డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నది.

మిషన్‌ భగీరథ
తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన ఒక అద్భుతం మిషన్‌ భగీరథ పథకం. శుద్ధి చేసిన నదీ జలాలను ప్రతీ ఇంటికీ, ప్రతీ రోజుఅందించడానికి లక్షా 40 వేల కిలోమీటర్ల పొడవైన భారీ పైపులైన్‌ నిర్మాణం జరిగింది. అడవులు, నదులు, రైల్వే లైన్లు, కాలువలు, రోడ్లు.. ఇలా దాదాపు 12వేల క్రాసింగ్స్‌ దాటుకుని నీళ్లు గ్రామాలకు చేరడానికి కావలసిన ఏర్పాట్లు పూర్తయినాయి. అనుకున్న వ్యవధిలో పనులు పూర్తి కావడానికి అధికార యంత్రాంగం ఎంతో సమన్వయంతో, సమగ్ర వ్యూహంతోపనిచేశారు. మెయిన్‌ పైపులైన్లు, ఇన్‌ టేక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, సంపులు, వాటర్‌ ట్యాంకులు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇప్పటికే 19 వేల పైచిలుకు ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేయబడిన నదీ జలాలు చేరుతున్నాయి. మిగతా గ్రామాల్లో పనులను వేగంగా పూర్తి చేస్తున్నది. అనుకున్న సమయం కన్నా ముందే ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడానికి కృషి చేస్తున్న మిషన్‌ భగీరథ యంత్రాంగానికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. మిషన్‌ భగీరథ కార్యక్రమం దేశ ప్రధానితో పాటు అందరి ప్రశంసలు పొందింది. తెలంగాణా చూపిన దారిలో ఈ పథకం అమలు చేయడానికి దేశంలోని 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా రాష్ట్రాల బందాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి. తాగునీటి వసతి కల్పనలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం.

ప్రజారోగ్యం
పేదలకు మెరుగైన వైద్యం లభించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో వసతులను ఎంతో అభివృద్ధి పరిచింది. ప్రభుత్వాసు పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేట్టు చేసింది. ప్రభుత్వ దవాఖానాలలో కావల్సిన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. 40 ప్రభుత్వాసు పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎం.ఆర్‌.ఐ, సిటీస్కాన్‌, డిజిటల్‌ రేడియాలజీ, టూడి ఎకో, తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాలలో అందుబాటులోకి తెచ్చింది. జిల్లా, ఏరియా ఆస్పత్రులలో ఐ.సి.యు కేంద్రాల సంఖ్య కూడా పెంచడం జరిగింది.

ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు మన రాష్ట్రానికి పలు జాతీయస్థాయి అవార్డులు కూడా లభించాయి.

హైదరాబాద్‌ నగరంలో వైద్యసేవలను మరింత విస్త రించి, పేదలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతీ పదివేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఈ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్థారణ పరీక్షలు, ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయి.

వైద్య విద్యను, సేవలను మరింత విస్తరించడం కోసం రాష్ట్రంలో కొత్తగా నాలుగు వైద్య కళాశాలలు మంజూరు చేశాం. సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. సూర్యాపేట, నల్గొండలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కో వైద్య కళాశాలకు అనుబంధంగా 750 పడకల ఆసుపత్రులు ప్రారంభిస్తున్నాం.

ఆసుపత్రిలో మరణించిన వారి మతదేహాలను ఉచితంగా తరలించడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ప్రవేశ పెట్టింది. ఈ సదుపాయం దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ ప్రభుత్వం మానవీయ దక్పథంతో ఈ వాహన సేవలను పేదలకు అందుబాటులోకి తెచ్చింది.

కేసీఆర్‌ కిట్స్‌
ఆసుపత్రులలో సురక్షిత ప్రసవాలు జరగాలనే ప్రధాన లక్ష్యంతో ప్రవేశ పెట్టిన పథకం కెసిఆర్‌ కిట్స్‌. ఈ పథకం క్రింద నిరుపేద గర్భిణులకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో 1,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. దీనితోపాటు నవజాత శిశువులకు, బాలింతలకు కావల్సిన 16 రకాల వస్తువులతోకూడిన 2,000 రూపాయల విలువైన కిట్‌ ను కూడా అందిస్తున్నది. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు, సమర్థవంతంగా మాతా, శిశు సంరక్షణ జరుగుతున్నది. ఇప్పటికే లక్షలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.

గర్భవతులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఒకపూట సంపూర్ణ ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలద్వారా అందిస్తున్నది. ఐరన్‌, తదితర మందుల పంపిణీ కూడా జరుగుతోంది.

విద్యారంగం రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలు విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం చక్కగా ముందడుగు వేస్తున్నది. కేజీ టు పిజి ఉచిత విద్యావిధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వర్గాలకి చెందిన విద్యార్థులకోసం కేవలం 296 గురుకులాలు మాత్రమే ఉండేవి. వీటిలో అరకొర వసతులతో విద్యార్థులు అనేక అగచాట్లు పడేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని హంగులతో, రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటుచేసింది. వచ్చే ఏడాది నుంచి బిసిల కోసం మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించింది. ఇంటిని మరపించేలా గురుకులాల్లో మంచి భోజనం, వసతి, సకల సౌకర్యాలు కల్పించింది.

ఇటీవల జరిగిన సివిల్స్‌ పరీక్షలలో ఎంతో మంది తెలంగాణ బిడ్డలు విజయం సాధించారు. దేశం మొత్తంమీద ప్రథమస్థానం సాధించింది కూడా తెలంగాణ బిడ్డే కావడం మనందరికీ గర్వకారణం. అనేకమంది క్రీడాకారులు, పర్వతారోహకులు మన రాష్ట్రం నుంచి వెలుగులోకిరావడం, రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొనిరావడం మనందరికీ సంతోషదాయకం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని బోధన, క్రీడలతో పాటూ వ్యక్తిత్వవికాసం కల్పించే విధంగా రాష్ట్రంలో గురుకులాలను తీర్చిదిద్దుతున్నాం. వీటితో పాటూ విదేశీవిద్య కోసం వెళ్ళేవారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నది.

తెలంగాణకు హరితహారం

భవిష్యత్‌ తరాలకు నిర్మలమైన, పచ్చని పర్యావరణాన్ని అందించాలి. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచా లనే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ కార్య క్రమంలో ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములు కావడం ఆనందదాయకం. హరితహారం ప్రారంభించిన మూడేళ్ళలో సుమారు 82 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమం సాగుతున్నది. ఇటీవలే గజ్వేల్‌ పట్టణంలో ఒకేరోజు, ఏక కాలంలో రికార్డు స్థాయిలో లక్షా 25 వేల మొక్కలు నాటడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి ఈ కార్యక్రమం స్థాయిని మరింత పెంచే ప్రణాళిక సిద్ధం అయ్యింది. ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతీ ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి, వాటిని పెంచి పెద్ద చేయాలని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

పరిపాలనా సంస్కరణలు

ప్రజలకుపరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలను విజయ వంతంగా అమలు చేసుకున్నాం. చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగాన్ని, పారదర్శకతను పెంచడం కోసం, 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో 8,690 గ్రామ పంచాయితీలుంటే, కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ప్రజలు ఇటీవలే కొత్త గ్రామ పంచాయితీల, కొత్త మున్సిపాలిటీల ప్రారంభోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

గామ పంచాయతీలుగా తండాలు

గిరిజన తండాలను, ఆదివాసీ గూడాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని ఎస్టీలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఆరు దశాబ్దాల కాలంలో వారి కల నెరవేరలేదు. గత ప్రభుత్వాలు ఎన్నికల మానిఫెస్టోలో హామీలు గుప్పించారే తప్ప, తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీల హోదా కల్పించ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీల కలను నిజం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 1,326 ప్రత్యేక ఎస్టీ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.వీటికి తోడు 1,311 గ్రామ పంచాయతీలు షెడ్యూల్డ్‌ ఏరియాలోనే ఉన్నాయి. ఇతర గ్రామ పంచాయితీల్లోనూ ఎస్టీలకు రిజర్వేషన్‌ కొనసాగుతుంది. దీంతో దాదాపు 3వేల మంది ఎస్టీలు రాష్ట్రంలో సర్పంచులుగా అయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

ప్రభుత్వం పోలీస్‌ శాఖలోనూ కూడా భారీగా పాలనా సంస్కరణలు తెచ్చింది. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం రెండే రెండు పోలీస్‌ కమీషనరేట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 9 కి పెంచుకున్నాం. పోలీస్‌ సబ్‌ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు పెంచుకున్నాం. సర్కిల్‌ కార్యాలయాలను 688 నుంచి 717కు పెంచుకున్నాం. పోలీస్‌ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు పెంచుకున్నాం. పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ కోసం ఇచ్చే నిధులను కూడా ప్రభుత్వం భారీ స్థాయిలో పెంచింది.

కొత్త జోనల్‌ వ్యవస్థ

తెలంగాణా సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా పొందాలంటే స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలి. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షించటం కోసం, ప్రభుత్వం కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్‌ కేడర్‌ ఉద్యోగాలలో 95 శాతం అవకాశాలు స్థానికులకే లభించే విధంగా చట్టం చేసింది. డిస్ట్రిక్ట్‌ కేడర్‌ తో పాటు ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించడానికి సానుకూలత వ్యక్తం చేసింది. కేంద్ర ఆమోదం లభించిన వెంటనే కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల నియామక ప్రక్రియ పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని తెలియచేస్తున్నాను.

పారిశ్రామికాభివద్ధి

రాష్టంలో పరిశ్రమల స్థాపనకోసం ముందుకువచ్చే వారికి టి.ఎస్‌ – ఐ.పాస్‌ సింగిల్‌ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా వుంది. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పరిశ్రమల స్థాపనకు లభిస్తున్నాయి. ఇప్పటి దాకా 7,697 పరిశ్రమలకు ఈ విధానం ద్వారా అను మతులు లభించగా అందులో 5,570 పరిశ్రమలుఉత్పత్తిని ప్రారంభించినాయి. లక్షా ముప్ఫై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చినయి. 8.37 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఖాయిలాపడిన కాగజ్‌నగర్‌ సిర్పూర్‌ మిల్లును ప్రభు త్వం పూనుకొని పునరుద్ధరించింది. వేలాది మంది కార్మికుల చిరకాల వాంఛను నేరవేర్చింది. నల్లగొండలో భీమా సిమెంట్‌, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, ఆదిలాబాద్‌ లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ములుగులోని బల్లార్పూర్‌ పరిశ్రమలను త్వరలోనే తిరిగి ప్రారంభించుకోనున్నాం.

ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్‌ ప్రముఖ ఐ.టి హబ్‌గా గుర్తింపు పొందింది. రాష్ట్రప్రభుత్వం రూపొందిం చిన నూతన ఐ.టి విధానంతోపాటు, సింగిల్‌ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐ.టి రంగం లో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నా యి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టి-హబ్‌ దేశవ్యాప్తంగా సంచలనం స ష్టించింది. ఐ.టి ఎగుమతులు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఐ.టి. పరిశ్రమను రాష్ట్రం లోని ఇతర నగ రాలకు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతోంది.

రహదారులు మెరుగైన రహదారులు దేశాభివద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి.దురదష్టవశాత్తూ అన్ని రంగాల్లో మాదిరిగానే రహదారుల విషయంలోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం, వివక్ష అమలయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండేది.

తెలంగాణ ఆవిర్భవించే నాటికి జాతీయ రహదారుల విషయంలో దేశ సగటు 2.80 కిలోమీటర్లుంటే, తెలంగాణ రాష్ట్రం సగటు కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవను చూపింది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ జాతీయ రహదారులను మంజూరు చేసింది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా 3,155 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగేళ్లలోనే అంతకన్నా ఎక్కువగా 3,155 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,682 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌ వర్క్‌ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా, దేశ సగటును మించింది.

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్‌ అండ్‌ బి, పంచాయితీ రాజ్‌ రోడ్లను, వంతెనలను ప్రభుత్వం దాదాపు 16వేల కోట్ల ఖర్చుతో అభివద్ది చేసింది. వేల సంఖ్యలో ఉన్న మట్టి రోడ్లను బిటి రోడ్లుగా మార్చింది. సింగిల్‌ లేన్‌ రోడ్లను డబుల్‌ లేన్‌ రోడ్లుగా మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1146 కొత్త వంతెనల నిర్మాణం చేపట్టింది.

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు

నిరుపేదలకు గహనిర్మాణం పథకం అమలు చేయ డంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ పథకం క్రింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నది. బలహీన వర్గాల గహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులు గతంలో చెల్లించ వలసి వున్న 4వేల కోట్ల రూపాయల రుణ బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది.

సజావుగా శాంతిభద్రతలు

పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్ల సమర్థ వంతంగా శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జనజీవనం సాగుతున్నది. అభివ ద్ధిలో శాంతి భద్రతలకున్న ప్రాధాన్యతను గుర్తించి, పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్‌ కేటాయించినం. 10,000 మంది సిబ్బందిని కొత్తగా నియమించాం. ఇప్పటికే 4,012 వాహనాలను సమకూర్చాం. మరో 11,557 వాహనాలను కొత్తగా సమకూరుస్తున్నాం. రాష్ట్రం అంతటా లక్షలాది సీ సీ కెమెరాలను పెట్టి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికపరిజ్ఞానాన్ని పోలీస్‌ శాఖ అందిపుచ్చు కుంటోంది. దేశంలోనే తొలిసారిగా అనుమానితుల ఫోటోలను క్షణాలలో సరిపోల్చే ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ను ప్రవేశ పెట్టాం. ఇది పోలీసుల చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా మారబోతోంది. నేరస్తులతోపాటు, అనాథ శవాలను, తప్పిపోయినవారిని కూడా ఈ విధానంలో గుర్తించవచ్చు. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలిస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం అవుతుంది. శాంతి భద్రతల తో పాటూ ప్రకతి వైపరీత్యాలు, జాతరలు, ఉత్సవాలను ఈ సెంటర్‌ ద్వారా నిశితంగా పర్యవేక్షించటానికి వీలవుతుంది. పోలీస్‌ శాఖ పేకాట, గుడుంబా వంటి దురాచారాలను సమర్ధవంతంగా అరికట్టగలిగింది. డ్రగ్స్‌, కల్తీల నిరోధానికి ఉక్కుపిడికిలి బిగించింది. షీ టీమ్స్‌ కషి ఫలితంగా మహిళలకు భద్రత ఏర్పడింది. శాంతిభద్రతల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలుపుతున్న పోలీస్‌ శాఖ ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక అభినం దనలు తెలుపుతున్నాను.

విశ్వనగరంగా హైదరాబాద్‌

విశ్వనగరంగా హైదరాబాద్‌ నగరాన్నితీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నది. 35 వేల కోట్ల రూపాయలతో వివిధ నిర్మాణ కార్యక్రమా లను చేపట్టింది. నగరంలో ట్రాఫిక్‌ సమస్య నివారణకు వ్యూహాత్మక రహదారుల అబివద్ధి పథకం కింద రూ. 25వేల కోట్ల రూపాయ లతో ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నది. ప్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు ఉపరితల రహదారులు, అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌ నగరాన్ని సిగ్నల్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఎస్‌.ఆర్‌.డి.పి ఊతమిస్తోంది. దీనిలో భాగంగా ఎస్‌.ఆర్‌.డి.పి ఫలితాలు హైదరాబాద్‌ నగర వాసులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయ్యప్ప సొసైటీ, మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌, చింతలకుంటలో మూడు అండర్‌పాస్‌లు, ఎల్బీనగర్‌-మన్సూరాబాద్‌ ఫ్లైఓవర్‌ను ఇటీవలే ప్రారంభించుకున్నాం. నగరంలో రోడ్లు, పారిశుధ్యం మెరుగు పరిచేందుకు ప్రణాళికలు అమలవు తున్నాయి. నగరంలో రహదారులు బాగుచేయడానికి, అభివద్ధిపరచడానికి 2,716 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. జి.హెచ్‌.ఎం.సి పరిధిలోని 185 చెరువులను అభివద్ధి పరచడంతోపాటు, రాబోయే 30 సంవత్సరాల దాకా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే విధంగా 20 టి.ఎం.సిల సామర్థ్యంతో రెండు జలాశయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. శాటిలైట్‌ టౌన్‌ షిప్‌ల నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొం దించింది. నగరంలో ఆహ్లాదకర వాతావరణం పెంచేం దుకు పార్కులు, బొటానికల్‌ గార్డెన్లు అభివద్ధి చేస్తున్నది. వచ్చే ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్‌ నగరంలో మౌలికవసతులను మెరుగుపరిచే ప్రణాళిక అమలవుతుంది.

హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగు రోడ్డు

హైదరాబాద్‌ చుట్టూ ప్రస్తుతం ఔటర్‌ రింగు రోడ్డు ఉంది. హైదరాబాద్‌ నగరం ఔటర్‌ రింగు రోడ్డును దాటుకుని శరవేగంగా విస్తరిస్తున్నది. హైదరాబాద్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు కూడా ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితిని దష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఔటర్‌ రింగు రోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజనల్‌ రింగు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజనల్‌ రింగు రోడ్డు సంగారెడ్డి-గజ్వేల్‌-చౌటుప్పల్‌-మాల్‌-కడ్తాల్‌-షాద్‌ నగర్‌- చేవెళ్ల-కంది పట్టణాల మీదుగా వలయాకారంలో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్‌ ప్రెస్‌ హైవేగా రీజనల్‌ రింగురోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రెండో దశ మెట్రో రైలు

హైదరాబాద్‌ నగర వాసులు ఎంతగానో ఎదురుచూసిన మెట్రో మొదటి దశ ప్రారంభమైంది. రోజుకు లక్షమందికి పైగా ఈ సౌకర్యాన్ని వినియోగిం చుకోవడం ఆనందాన్ని కల్గిస్తోంది. మిగిలిన దశల పనులు కూడా సత్వరం పూర్తిచేసి ప్రారంభించడానికి కషిచేస్తున్నాం. ప్రస్తుతం నాగోలు నుండి మియాపూరు వరకు 30 కిలో మీటర్ల మేర మెట్రో రైలు పరుగులు పెడుతున్నది. వచ్చే నెల నుండి అమీర్‌పేట్‌ నుండి ఎల్‌.బీ.నగర్‌ వరకు, నవంబర్‌ నెలలో అమీర్‌పేట నుండి హైటెక్‌ సిటీ వరకు మెట్రో రైలు నడిపించడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

ముగింపు

గతం మిగిల్చిన విధ్వంసాల విషాదాలను అధిగమిస్తూ తెలంగాణా వర్తమానంలో విజయ పరంపరను నమోదు చేస్తున్నది. అయితే ఇది అంత సులభంగా సాధ్య పడలేదు. ప్రజాపోరాటం ద్వారా సాధించిన తెలంగాణను విఫల రాష్ట్రంగా మార్చాలనే కుట్రలు కొనసాగినయి. ప్రజల ఇక్యతను విచ్చిన్నం చేయాలనే కుచ్చిత ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అభివద్ధి ఒక్కటే ధ్యేయంగా పని చేస్తుంటే, కొంతమంది కేవలం క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం అడుగడుగునా ఆటంకాలు సష్టిస్తున్నారు. ప్రతీపశక్తుల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నాం. సమస్యలను పరిష్కరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను చాకచక్యంగా అధిగమిస్తున్నాం. నూతన రాష్ట్రంలో అవాంఛనీయ పరిణామాలు తలెత్తకుండా అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరించాం. తెలంగాణాలో నిత్యం అలజడులు సష్టించే ప్రయత్నాలను తిప్పికొడుతూ రాజకీయ సుస్థిరతను నెలకొల్పినాం. రాజకీయ అవినీతి లేని పాలనను అందిస్తున్నాం. అగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, వద్ధి దిశగా నడిపిస్తున్నాం. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏడాదికి సగటున 17.12 శాతం ఆదాయ వద్ధి రేటును సాధించింది. పురోగామి రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఈ పెరుగుతున్న సంపదనంతా పేదరిక నిర్మూలనకు ఉపయోగించేందుకు ప్రభుత్వం కత నిశ్చయంతో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రంగా మనుగడ సాగిస్తుందా? అనే భయసందేహాలను తొలగించాం. తెలంగాణను దేశానికే మార్గనిర్దేశం చేసే రాష్ట్రంగా నిలబెట్టుకోగలిగాం.

ఆనాడు జలదశ్యంలో ఉద్యమానికి ఉద్యుక్తుడినవుతూ, నేను గనకపో రాటాన్ని మధ్యలో ఆపితే నన్ను రాళ్లతో కొట్టండి అని సాహసోపేతమైన ప్రతిజ్ఞను చేశాను. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసేవరకు విశ్రమించలేదు. నేడు అదే సంకల్ప బలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకిత మవుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండ దండ. వారి దీవెనలే ప్రేరణ. తెలంగాణ విజయయాత్ర ఇదే విధంగా కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.

జై తెలంగాణ జై హింద