|

బంజారాల కల బంగారం

kcrrrహైదరాబాద్‌ నగరం గురించి చెప్పుకోవలసి వస్తే, ఆధునిక హంగులు అద్దుకున్న కొన్ని ప్రదేశాలైన బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్‌ సిటీలని చెప్పుకుంటారు. వీటిలో కూడా హైద్రాబాద్‌లో సినీ పరిశ్రమ వేళ్ళూనుకునే కాలంనుండి ఇప్పటివరకు బంజారాహిల్స్‌కు ఒక ప్రత్యేక స్థానమున్నది. పేరుకు బంజారాహిల్స్‌ అని గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఈ ప్రాంతమంతా ఒకప్పుడు బంజారాలు నివసించేవారు. సంచార జాతులవడం, స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఆదివాసీలు, బంజారాలు కనుమరుగయ్యారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో బంజారాల జాడే కానరాదు.

‘ఈ ప్రాంతాల్లో మా అస్తిత్వం ఉండేది అది అంతా అడుగంటి పోయింది. మాకు కొంత స్థలం కేటాయిస్తే అస్తిత్వ చిహ్నంగా భవనాలు నిర్మించుకుంటాం’ అని గిరిజన సంఘాలెన్నో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులెందరికో తమ గోసని వినిపించుకున్నా, అప్పటి నాయకులెవ్వరికీ ఆ యాస అర్థం కాలేదు.

సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇక్కడి ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ సర్కారు ఏర్పడిన వెంటనే బీద, దీన, దళిత, ఆదివాసీ, బంజారాల ఆర్తిని అర్థం చేసుకున్నది. వారివారి అభీష్టాన్ని అర్థం చేసుకుని అందుకనుగుణంగా అడుగులువేస్తూ అందరినీ అక్కున చేర్చుకుంటున్నది.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నది. అధికారం చేతికొచ్చి ఆరు నెలలే అయ్యింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టి బిల్లును ఆమోదింపజేసుకున్న వెంబడే జూబ్లీహిల్స్‌లో ఆదివాసీ, బంజారాభవన్‌లకు రెండెకరాల స్థలం కేటాయించింది.

ఆ తెల్లారే ఒక్కొక్క భవన నిర్మాణం కోసం 2.5 కోట్ల రూపాయల చొప్పున 5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌ నిర్మాణం కోసం మరో 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

స్థలం కేటాయించడం, అందుకు కావలసిన నిధులను విడుదల చేసి సరిపో యిందిలే అని అనుకోకుండా రోజుల వ్యవధిలోనే ఆయా భవనాల శంకుస్థాపనచేసి మాటలన్నింటినీ అమలుచేసి చూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.
బంజారాహిల్స్‌లో బంజారాల గుండెల చప్పుడు వినిపించింది. అరవై ఏండ్లనుంచి కలగా వుండిపోయిన అంశం నిజమైన సారాంశం అది 11 డిసెంబర్‌ 2014 రోజు. అట్టడుగువర్గాల ఆనందం ఆకాశాన్నంటింది. బంజారా డప్పుల చప్పుళ్ళు బంజారాహిల్స్‌ వీధులలో ప్రతిధ్వనించాయి.

ఎంత బతిమిలాడి అడిగినా 500 గజాల జాగా కూడా యియ్యని జాగల ఏకంగా ఎకరం జాగల బంగ్లలు కట్టుకుంటున్నామన్నారు గిరిజనులు. భవనాల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభావేదిక మీదికి రాగానే రాములునాయక్‌, సీతారాం నాయక్‌లు, 24 తులాల బరువుతో చేయించిన రెండు వెండి కడియాలను కేసీఆర్‌ రెండు చేతులకూ తొడిగారు. వాటిని చూసి మురిసిపోయిన ముఖ్యమంత్రి వీటిని మా గిరిజన అక్క చెల్లెండ్లకు ఇస్తా, పిల్లల పెండ్లిలో వాళ్ళకు పెట్టమంటా అని అన్నారు.

banjara

 

ఈ సభా కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్‌. బంజారా, ఆదివాసీ భవన్‌లకు భూములు, నిధులను యిచ్చినం. ఇవి సాలకపోతే యింకొన్ని నిధులనిస్తం అన్నారు. ఈ భవనాలు వట్టి కమ్యూనిటీ హాళ్ళలెక్కనే వుండుడుకాదు, గిరిజనుల సమస్యల పరిష్కారాలకు వ్యూహ కేంద్రాలుగా తీర్చిదిద్దుదాం అన్నారు. ఇక్కడ మేధావులు మేధోమథనం చేసి గిరిజనుల సమస్యలను ప్రభుత్వానికి చెప్పాలి. అప్పుడే ఈ భవనాల నిర్మాణానికి సార్థకత కలుగుతుంది అన్నారు.

ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితి పోవాలి, పెండ్లిండ్లకు మా దగ్గర లక్షల రూపాయలు కట్నం అడుగుతున్నారని గిరిజన ఆడపడుచులు అంటుంటే విన్నాను. కాబట్టే ఈ సమస్యకు పరిష్కారంగా 51వేలు అందించే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. చిన్నతనంలో పెండ్లి చేయడం వద్దని, 18 ఏండ్లు నిండిన తర్వాతనే ఆడపిల్లల పెండ్లిండ్లు చేయాలన్నారు. బయట ప్రపంచం గ్రహాలవైపు ఉరుకుతుంటే, మనం ఎనకపడొద్దని అన్నారు. ఏదయినా మొదలుపెట్టి ముందుకు అడుగు వేస్తే మొదలయితదన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం బయల్దేరినపుడు గీ బక్కోడు ఏం తెలంగాణ తెస్తడు? అన్నారు. ఆంధ్రోళ్ళు ఎప్పుడో బొండిగె పిస్కేస్తరన్నరు. ఎవ్వరూ ఏం చేయలే. మీరు బొట్టుపెట్టి ఆదరించిండ్రు. రాత్రి, పగలులేదు. అన్నం తిన్నా… అటుకులు బుక్కినా… 10, 20, 30 లక్షలమందితో మహాసభలు ఏర్పాటు చేసుకున్నం. వాటిని మీరే (గిరిజనులు) బలోపేతం చేసిండ్రని పేర్కొన్నారు. మన తెలంగాణల ఎవరి వాటా వారికొస్తది, మీ ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నిధులు మీకే అందుతయి. ఒక్క రూపాయి కూడా పక్కతొవ్వ పట్టకుండా చూస్తాననన్నారు కేసీఆర్‌. పార్టీ ఏదయినా గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుదామని ఇతర రాజకీయపక్షాలనుద్దేశించి అన్నారు. గిరిజనుల్లో ఎందరో గొప్పవాళ్లున్నారు. వారి సేవలను ఏరకంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు కేసీఆర్‌.
ఈనాటివరకు చాలామంది కంప్యూటర్‌ నివేదికలు చూపెట్టి అందరికీ అన్నీ వున్నయ్‌ అని చెప్పిండ్రు కాని మా ఎమ్మెల్యే మదన్‌లాల్‌తో మాట్లాడుతున్నప్పుడు, ఇంకా 220 తండాలకు రోడ్లే లేవని చెప్పిండ్రని వివరిస్తూ, దీనికి పరిష్కారం సూచించారు. వచ్చే బడ్జెట్‌లో ఏదో ఒక పేరు పెట్టుకుని తండాలన్నింటికి రోడ్లు వచ్చే విధంగా ఒక ప్రత్యేక స్కీం ఏర్పాటు చేయిస్తామని అన్నారు.

banjara2

గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు సేవాలాల్‌ మహరాజ్‌ జయంతికి 10 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించే వారని పేర్కొన్నారు. కానీ ఇపుడు మన రాష్ట్రంలో 9 జిల్లాలకు ఒక్కో జిల్లాకు 10 లక్షల చొప్పున 90 లక్షలు ఇస్తామని అన్నారు. గిరిజన, మైనార్టీ, దళిత, బీసీ వర్గాలందరి కళ్ళల్లో కాంతిని చూసినపుడే తెలంగాణ రాష్ట్రం అక్షరాలా సార్థకమైనట్లని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ప్రజలకోసమే అని గుర్తు చేశారు. సమస్యలుంటే వాటి పరిష్కారానికి పోరాడాలి అని అన్నారు. ఎవ్వరు కూడా నోరు మూసుకుని ఊరుకోవద్దని ప్రజలందరికీ అడిగే హక్కుందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వున్న ఎంపీ సీతారాం నాయక్‌ తమ ప్రసంగంలో 60 ఏండ్లుగా సాధ్యంకాని దాన్ని కేసీఆర్‌ ఆరు నెలల్లో చేసి చూపెట్టారని అన్నారు. నిజాం ఇచ్చిన ఫర్మానాలో బంజారాహిల్స్‌ వున్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్‌ ఎంపీ నగేష్‌, ఎమ్మెల్సీ రాములునాయక్‌ కూడా హాజరయ్యారు. సభా కార్యక్రమానికి ముందు బంజారా, గుస్సాడీ, థింసా, కోయకొమ్ము, డప్పు కళారూపాల కళాకారులు సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. కేసీఆర్‌కు కోయ గుస్సాడీ, సంప్రదాయ కిరీటాలు పెట్టి సన్మానించి సంబరపడ్డారు గిరిజన బృందంవారు.