|

బడిబాట సాగుబాట అంతా సందడి సందడి

tsmagazine
అన్నవరం దేవేందర్‌
ఆయిటి పూని వాన చినుకులు పడంగనే ఎవుసం చేసేటోల్ల ఇండ్లడ్ల సందడి మొదలైతది. అదే సమయాన బడికి పోయే పొలగాండ్లు పై తరగతులకు పోవుడు కొత్త పుస్తకాలు, కొత్త బడులు, ఫీజులు, కోర్సులు గప్పుడే ఎవుసం కోసం ఇత్తనాలు తెచ్చుడు.. మొలుక మండె పోసుడు.. ఎరువులకు పిండి బస్తాలకు పోవుడు, పొలం, శెల్క దున్నెతందుకు ట్రాక్టర్‌ మాట్లాడుడు వాళ్ళకోసం అడ్వాన్స్‌ ఇచ్చుడు.. అంతా ఇప్పటినుంచే సుర్వు అయితది. ఓ దిక్కు వానలు సుర్వు, గాలి దుమారం మరో దిక్కు, పొలగాండ్లకు వయ్యిలు కొనుక్కవచ్చుడు, హాస్టల్లల్లనో, గురుకులాల్లనో ఎయ్యన్నంటే సందుగ సామాన కొనుక్కవచ్చుడు, పిల్లగాడు కొత్త బల్లె ఎట్ల మెదులుతడో, ఎట్ల సదువుతడోననే దిగులు కొంత తల్లిదండ్రులకు ఉంటది.

ఇయ్యాలరేపు సదువు చెప్పే బడులు ఎక్కువ అయితన్నయి. పోరగాండ్లు తక్కువ అయితన్నరు. మండలానికి మూడు, నాలుగున్న సర్కారివి గురుకుల పాఠశాలలు కన్పిస్తయి. అండ్లనే అన్నం, అండ్లనే నాస్త, పండుకునేతందుకు మంచం, ఫ్యాన్‌, వారంవారం నీసు కూర, పండ్లు, లేపి సదివిచ్చేంతందుకు సార్లు, ఆటలాడిచ్చేందుకు సార్లు, ఎంతో బేత్రీన్‌ సౌలత్‌లు ఉన్నయి. ఎన్కటికాలం గివన్నీ ఉన్నయా? ఏదో బడికి పోయినం అంటే అట్లపోయి రావాలె, అంటే సదువు అబ్బుతె అబ్బుతది, లేదంటే లేదు, ఇంతే సంగతులు, సదువు ఎక్కకుంటే ఎవసం చేసుడు, లేకుంటే కులవృత్తి పట్టుడు, ఇంకా లేకుంటే చికెన్‌ సెంటర్‌, చిన్న కిరాణం, బట్టల షాపుల పనిచేసుడు, ఆటో కొనుక్కొని నడుపుడు, ట్రాక్టర్‌మీద పోవుడు, హార్వెస్టర్‌ నడుపుడు, ఇట్ల సవాలక్ష పనులు ఊరునిండ ఉన్నయి. ఏదో పని చేసుకుని బతుతున్నకాలం.

ఈ కాలంల మండల కేంద్రంల బడులే బడులు. మల్ల ఇంగ్లీష్‌ మీడియంల నడుస్తున్నయి. ఎనుకటికి ఇప్పటికి మస్తు మార్పులు వచ్చినయి. పది అయిపోంగనే ఇంటర్‌.. అక్కడ హాస్టల్ల సదువే తపనగా నడుస్తున్నయ్‌. తర్వాత ఇంజినీరింగ్‌, డిగ్రీ ఏదో ఒకటి పోలగాండ్లు ఒగలను చూసి ఒగలు ఏం సదువాలనో వాల్లే నిర్ణయం చేసికుంటున్న కాలం. పూర్వం సర్కారు బడికి పోవాల్నంటే సీటుకోసం పంతుల్ల సుట్టు తిరుగాల్సిన కాలం పోయి, సార్లే ఇండ్ల సుట్టు బడిపోరగాళ్లు కావాలని తిరుగుతుండ్రు. ఎందుకంటే అందరు సదువుతుండ్రు, అందరు బడికె పోతండ్రు. పిల్లగాడు కడుపుల పడంగనే అంగన్‌వాడి సెంటర్‌లపేరు ఎక్కుతది. పుట్టేదాకా లెక్కలు ఉంటయి. పుట్టినంక టీకాలు, సూదులు, మందులు అట్లనే అంగన్‌వాడీల ఏసుడు, అక్కన్నే తల్లికి, పిల్లకు అన్నం తినిపిఇచ్చుడు, పాలు తాపిచ్చుడు. ఆ తర్వాత అదే ఊరి బల్లె ఏసుడు లేకుంటే పక్కపొన్న ఊరి బడివాల్లు వ్యాన్‌ పెట్టినం మా బడికి రమ్మంటే మా బడికి రాండ్రని పిలుసుడు, ఇదంత జూన్‌ నెలలో జరిగే ఇంటి వాతావరణం. ఊరి వాతావరణం అంత గమ్మత్తుగనే ఉంటది. జూలై నెల వరకు అంతా సర్దుకుంటది.

ఇగ ఎవుసం కోసం దుక్కి దున్నుడు ఎన్కటనైతె నాగండ్లు అమిరిచ్చుడు, కర్రుమొన పెట్టిచ్చుడు, గొర్రు సాపుజేసుడు, ఎడ్లబండి తెచ్చి పెంట బారగొట్టుడు, చెర్ల మన్ను తెచ్చి పోసుడు, పనులు నడుస్తుంటయి. ఇప్పుడు అవన్నీ ఊర్లల్ల లేవు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వ్యాన్‌లు తిరుగుతున్నయి. బాయిలకాడికి పోయి వచ్చేతందుకు, చిన్నచిన్న బండ్లు వచ్చినయి, ఎవసానికి సమాయత్తం అవుడు, దుక్కులు సాపుచేసి నారుమల్లు దున్ని పొలం పొతం చేసే యాల్ల సుత గిదే ఊరు ఇల్లు సందడి సందడిగ ఉండేకాలం. వానలు కొట్టుడు, చెరువులు నిండుడు, లేకుంటే కాలువలు పారుడు, కాలువల ద్వారా చెర్లు నిండుగ రామసక్కదనమోలే కన్పిస్తయి. ఇయ్యేడు బడులు ఎవుసాలే గాకుంట ఇంక సర్పంచ్‌ ఓట్లకాలం. సుత సందడి చేస్తంది. ఊరికి ఎవలను ఎన్నుకోవాలనేది ఆలోచన. అయితే ఊరు దేనికి రిజర్వేషన్‌ అయ్యిందో తెలిస్తేగాని ఆ సంబురం సుర్వుకాదు. ఊరన్నకాడ ఎన్కట ఒక్కలే రాజ్యం చేసేది, ఇప్పుడు అట్లకాదు ఆడోల్లు, మొగోల్లు, అన్ని కులాలోల్లకు రాజ్యం చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎవల వంతుకు వస్తదోనన్న సందడి. ఎవలను గెలిపియ్యాలెననే మీమాంస పార్టీలలోనూ ఉంది.

ఓట్లు, నోట్లు, తాగుడు ఇవన్నీ ఉంటయి. అన్నిటితోపాటు కొత్తబడి, పాతబడి, కొత్త పెట్టుబడులు, పాత రాబడులు, పెట్టుబడికి సాయం తీసుకునుడు, భూమిలేనోల్లు దిక్కులు సూసుడు. కౌలుకు చేసేటోల్లు దిక్కులు సూసుడు ఊరంతా సందడి సందడి వాతావరణం నెలకొని ఉన్నది.