|

బడ్జెట్‌ సమావేశాలలో 11 బిల్లులకు ఆమోదం

tsmagazine
అసెంబ్లీ, కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశాలు 13 రోజుల పాటు కొనసాగి, మార్చి 29న నిరవధికంగా వాయిదా పడ్డాయి. మార్చి 12న ప్రారంభమైన సమావేశాలు సెలవులు పోను 13 పనిదినాలలో కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ సమావేశాలలో బడ్జెట్‌ ఆమోదించడంతో పాటు అతి ముఖ్యమైన మొత్తం 11 బిల్లులను ఆమోదించాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసెంబ్లీ, కౌన్సిల్‌లలో బడ్జెట్‌ పైనా, పంచాతీరాజ్‌, మున్సిపల్‌ బిల్లుల పైనా సుదీర్ఘంగా మాట్లాడారు.

ఈ సమావేశాలలో మొదటి రోజు మార్చి 12వ తేదీన ఉభయ సభలను

ఉద్దేశించి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగి ప్రసంగించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ మార్చి 15వ తేదీన 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. 1,74,453.84 కోట్ల రూపాయలు ఖర్చు కాగల అంచనాలతో బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. కౌన్సిల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈమేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సెలవుల అనంతరం మార్చి 19న బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులు అసెంబ్లీలో బడ్జెట్‌ గురించి మాట్లాడగా కౌన్సిల్‌లో బీజేపీకి ఉన్న ఒకేఒక సభ్యుడు, ఎంఐఎం సభ్యుడు మాట్లాడారు. వ్యవసాయానికి ఎకరాకు నాలుగువేల చొప్పున రెండు పంటలకు 8వేల రూపాయలు పంట సాయంగా ప్రభుత్వం ఇవ్వడం విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలపై చర్చ జరిగింది. బడ్జెట్‌లో అన్ని శాఖలకు పుష్కలంగా నిధులు సమకూరాయని అధికార పక్ష సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.

బడ్జెట్‌పై జరిగిన చర్చకు అసెంబ్లీ, కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమాధానమిచ్చారు. శాఖల వారీగా ప్రాధాన్యాలను గుర్తుపెట్టుకుని ఆయా శాఖలకు కేటాయింపులు చేసినట్లు సీఎం సభ్యులకు వివరించారు. వ్యవసాయ రంగానికి జవసత్వాలు కలిగే విధంగా, రైతులు నష్టపోకుండా ఉండడానికి సంవత్సరానికి ఎకరానికి ఎనిమిదివేలు పంట సహాయం ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఈ సమావేశాలలో పలు ముఖ్యమైన బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. ఇందులో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ బిల్లులను, ప్రైవేట్‌ యునివర్సిటీలకు అనుమతించే బిల్లును, తెలుగును 10వ తరగతి వరకు తప్పనిసరిగా భోదించే బిల్లును, రాష్ట్ర డీజీపీని నియమించుకునే అధికారాన్ని రాష్ట్రా లకే ఇస్తూ చేసిన చట్ట సరవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. 500 జనాభా కలిగిన పలు తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టారు.

చిన్న గ్రామపంచాయతీ అయినా కూడా సంవత్సరానికి రూ. 3 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం సమకూర్చే విధంగా బిల్లులో పొందుపరిచారు. అదేవిధంగా కొత్త పంచాయతీలు కావాలంటే తప్పకుండా అసెంబ్లీ ఆమోదం కావాలనే చట్టాన్ని అందులో పొందుపరిచారు.

వీటితో పాటు రాష్ట్ర అసైన్డ్‌ భూములను ఖాస్తు చేస్తున్న భూమిలేని పేదలకు వారికే హక్కు కల్పించే విధంగా అసైన్డ్‌ భూముల బదిలీల నిషేధ సవరణ బిల్లును, గ్రామీణ ప్రాంతాలలో ఒక సంవత్సరం తప్పనిసరి వృత్తి నిర్వహించాలనే నిబందనను సడలిస్తు వైద్య విద్యార్థులకు ఊరట కలిగించే బిల్లును ఉభయసభలు ఆమోదించాయి. అలాగే న్యాయవాదుల, వారి గుమాస్తాల సంక్షేమ నిధి సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. అనంతరం మార్చి 29న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఆమోదించిన బిల్లులు

1. తెలంగాణ అసైన్డ్‌ భూముల సవరణ బిల్లు

2. తెలంగాణ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌

రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లు

3. తెలంగాణ అడ్వొకేట్స్‌ క్లర్క్స్‌ సంక్షేమ నిధి సవరణ బిల్లు

4. తెలంగాణ అడ్వొకేట్స్‌ సంక్షేమ నిధి సవరణ బిల్లు

5. తెలంగాణ డిజిపి ఎంపిక, నియామక బిల్లు

6. పదవ తరగతి వరకు తెలుగు బోధనను

తప్పనిసరిచేస్తూ బిల్లు

7. ద్రవ్య వినిమయ బిల్లు

8. ద్రవ్య వినిమయ బిల్లు (నంబర్‌-2)

9. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు బిల్లు

10. తెలంగాణ పంచాయతీరాజ్‌ బిల్లు

11. తెలంగాణ మునిసిపల్‌ చట్ట సవరణ బిల్లు