బాధితులకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ఎస్‌.సి, ఎస్‌.టి కమిషన్‌ అండగా నిలిచింది. సిద్ధిపేట జిల్లా వర్గల్‌ మండలం వేూరు గ్రామానికి చెందిన యువరైతు బ్యాగరి నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్‌.సి, ఎస్‌.టి కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ ఆ గ్రామానికి వెళ్ళి నర్సింహులు కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అంతేగాక, ఆ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన ఎకరం ఇరవై గుంటల భూమికి సంబంధించిన ధృవీకరణ పత్రాను కూడా అందజేశారు. దీనితోపాటుగా ఆ భూమి చదునుచేసుకోవడానికి 50 వేల రూపాయలు కూడా మంజూరు చేశారు. ఈ భూమిలో బోర్‌ కూడా వేయిస్తామని ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నర్సింహులు మృతితో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారం కోసం కడదాకా పోరాడాలని, ఆత్మహత్య పరిష్కారం కాదని శ్రీనివాస్‌ హితవు పలికారు. దళితుల సమస్యలు పరిష్కారానికి తమ కమిషన్‌ అన్నివేళలా సంసిద్ధంగా ఉంటుందని, అందరికీ అందుబాటులో
ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు విద్యాసాగర్‌, రాంబల్‌ నాయక్‌, ఎఫ్డీసీ ఛైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఏసీపి నారాయణ, ఆర్డీఓ విజయేందర్‌ రెడ్డి, డి.డి చరణ్‌ దాస్‌, తదితరులు పాల్గొన్నారు.