|

బోదకాలు బాధితులకు పెన్షన్‌ సీఎం నిర్ణయం

tsmagazine

బోదకాలు బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి పెన్షన్‌ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. ‘ప్రివెంటివ్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌’ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్‌గా ప్రజలందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే రోగ నిర్ధారక పరీక్షలు చేయించాలని కూడా సీఎం నిర్ణయించారు. గ్రామస్థాయిలో పనిచేసే వైద్యాధికారులు, సిబ్బంది సేవలను మరింత ప్రభావవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆశా వర్కర్లకు మరోసారి జీతాలు పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌, సెకండ్‌ ఏఎన్‌ఎంలకు కూడా జీతాలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం సూచించారు.

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ప్రగతిభవన్‌’లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతాకుమారి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ వాకాటి కరుణ, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ లలితకుమారి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, మిషన్‌భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, కార్పొరేషన్ల ఛైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

తుమ్మల, కవిత చొరవతో కదలిక

తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో బోదకాలు బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు కాలుతీసి కాలు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రికి విన్నవించారు. ప్రభుత్వం వారికి అండగా నిలవాలని, సరైన వైద్యం అందించాలని, బోదకాలు వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వ అధికారులపై కూడా ఒత్తిడి తెచ్చారు. వారి చొరవతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తన సొంత జిల్లాలో కూడా బోదకాలు బాధితులు ఎక్కువగానే ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత

ఉందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. బోదకాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. బోదకాలుతో బాధపడుతున్న వారిని ఆదుకునే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. బోదకాలు బాధితులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. బోదకాలు వ్యాధి గ్రస్తులకు అవసరమైన మందులు, ఇతర వైద్య సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణవ్యాప్తంగా బోదకాలు బాధితుల సమగ్ర సర్వే నిర్వహించాలని, గ్రామాల్లో వారి వివరాలు తీసుకోవాలని సీఎం కోరారు.

రోగ నిర్ధారక పరీక్షలు

అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతీ ఒక్కరు ఎప్పటికప్పుడు రోగ నిర్థారక పరీక్షలు చేయించుకుంటారని, తెలంగాణ రాష్ట్రంలోకూడా ప్రతీ ఒక్కరికి అలాంటి ఆరోగ్య అవగాహన అలవాటు చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగినవారు పరీక్షలు చేయించుకుంటు న్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు, ముఖ్యంగా పేదలు రోగమొచ్చినప్పుడు తప్ప ఆసుపత్రులకు వెళ్ళరు. వైద్య పరీక్షలు చేయించుకోరు. దీనివల్ల చాలా వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోతున్నారు. వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నయం చేయడం తేలిక అవుతుంది. ముదిరిన తర్వాత నయం చేయడం చాలా కష్టం. బోదకాలు కూడా అలాంటిదే. ప్రారంభదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కానీ ముదిరే దాకా గుర్తించరు. చాలా రోగాల విషయాల్లో ఇలాగే జరుగుతుంది. ఇకపై అలా జరగడానికి వీలులేదు. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరికి ప్రభుత్వమే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తుంది. రక్త నమూనాలు సేకరించి, అన్నిరకాల రోగ నిర్ధారక పరీక్షలు చేయించాలి. రోగం గుర్తించిన వెంటనే ప్రభుత్వ పరంగానే చికిత్స చేయాలి. మందులు అందించాలి. దీనికోసం ఎంత ఖర్చయినా వెనుకాడేదిలేదు. పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంకన్నా మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి ఏదీలేదు. ముందస్తు పరీక్షలు చేయడంతోపాటు వివిధ రకాల రోగాలు ప్రబలకుండా ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యం తీరు మారింది. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎంతో మెరుగయ్యాయి. కేసీఆర్‌ కిట్స్‌ పథకం అద్భుతంగా అమలవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. వైద్యాధికారులు, సిబ్బంది పనితీరుపై సర్వత్రా సంతృప్తి, సంతోషం వ్యక్తమవుతున్నది. వైద్యాధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా మలేరియా, డెంగ్యూ మరణాలు తగ్గాయి. ఈ ఒరవడి, స్ఫూర్తి కొనసాగాలి. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదల ముంగిట్లోకి వైద్యం చేరాలి. స్థానికంగానే వారికి వైద్య సేవలు అందాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పలువిధాలైన వైద్యాధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఆశా వర్కర్లకు ఒకసారి జీతాలు పెంచాం. మరోసారి కూడా జీతాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. వర్కర్లను విలేజ్‌ హెల్త్‌ అసిస్టెంటుగా గుర్తిస్తాం. సెకండ్‌ ఏఎన్‌ఎం జీతాలు కూడా పెంచుతాం. వారి సేవలను మరింత సమర్థ వంతంగా వినియోగించుకుంటాం. పీహెచ్‌సీలలో కూడా సౌకర్యాలు పెంచుతాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యం విషయంలో దేశానికే దారిచూపే విధంగా తయారు కావాలన్నది లక్ష్యం” అని సీఎం ప్రకటించారు.
tsmagazine

కేసీఆర్‌ కిట్స్‌ పథకం ప్రైవేటుకు లేదు: కేసీఆర్‌

కేసీఆర్‌ కిట్స్‌ పథకం అద్భుతంగా అమలవుతున్నది. పేదలకు ఎంతో మేలు కలుగుతున్నది. అనవసర ఆపరేషన్లు బాగా తగ్గాయి. అదనపు భారం పడినా సరే వైద్యులు, సిబ్బంది ఓపికగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇన్సెంటివ్‌ ఇస్తాం. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కేసీఆర్‌ కిట్స్‌ పథకం వర్తింపజేయాలనే వినతులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవసరమైన సౌకర్యాలు పెంచుతాం. సిబ్బందిని పెంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసుకుంటాం తప్ప, ప్రైవేటు ఆసుపత్రులకు కేసీఆర్‌ కిట్స్‌ పథకం వర్తింపజేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు’ అని సీఎం స్పష్టం చేశారు.