భగవంతుణ్ణి పూర్తిగా నమ్మితేనే కాపాడతాడు: సీఎం కేసీఆర్‌


భగవంతుణ్ణి పూర్తిగా నమ్మినప్పుడే ఆయన సహాయం చేస్తారని, మన స్వంత బలం, తెలివితో సమస్యల నుంచి బయటపడాలని చూసినప్పుడు భగవంతుడు మనవైపు చూడడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఇందుకు పురాణాలు, ఇతిహాసాలలోని కొన్ని సంఘటనలను ఉటంకించారు. ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో ద్రౌపది దయనీయ స్థితి గురించి, గజేంద్రమోక్షంలలోని గజేంద్రుని పోరాటం గురించి వివరించారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో ఏర్పాటుచేసిన భాగవత సప్తాహంలో చివరిరోజు సీఎం సతీసమేతంగా హాజరయ్యారు. సీఎం దంపతులు చాగంటి కోటేశ్వరరావును సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

ద్రౌపదీ వస్త్రాపహరణం గురించి వివరిస్తూ ఆయన నిండుసభలో ద్రౌపది వస్త్రాలు లాగేస్తుంటే ఒక చేతిని అడ్డంపెట్టుకుని తనను కాపాడాలని మరో చేత్తో దీనంగా అర్థిస్తుంటుందన్నారు. అప్పుడు కృష్ణపరమాత్మను ద్రౌపదిని కాపాడడానికి వెళ్ళమని ఆయన అర్ధాంగి కోరగా, ద్రౌపది తన ప్రయత్నం తాను చేస్తున్నదని, ఆమె అశక్తురాలైపుడు తప్పకుండా వెళతానని అంటారని సీఎం పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన స్వశక్తి చాలదనుకుని, అశక్తురాలై, రెండు చేతులు జోడించి పరమాత్మా, పరంజ్యోతి.. నీవు తప్ప నాకు ఇంకెవ్వరులేరు.. ఇక మీరే వచ్చి ఆదుకోవాలి అని ప్రార్థించినప్పుడు తక్షణం బయలుదేరి వెళ్ళి ఆమెను రక్షిస్తాడని వివరించారు. గజేంద్రమోక్షం గురించి చెప్తూ.. గజరాజు మొసలి నోటిలో చిక్కి పెనుగులాడుతూ ఉంటాడని, తన శక్తిచాలదనుకున్నప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాడన్నారు, ప్రార్థన కూడా సంశయాత్మకంగా ఉంటుందని అన్నారు. కలడందురు దీనుల యెడ.. కలడందురు పరమయోగి గణముల పాలన్‌.. కలడందురన్ని దిశలన్‌.. కలడు కలండనెడువాడు కలడోలేడో అంటూ భగవంతుడు ఉన్నాడో లేడో అనే సందేహంతో గజరాజు ప్రార్థించినప్పుడు భగవంతుడు రాడని, చివరకు నీవే తప్ప నాకు ఇంకే దిక్కులేదని గజేంద్రుడు ప్రార్థిస్తే అప్పుడు వెంటనే వచ్చి కాపాడుతాడని చెప్పారు. గజేంద్రుణ్ణి కాపాడాలనే ఆత్రుతలో సిరికించెప్పడు.. శంఖచక్రయుగముల్‌ చేదోయి సంధించడున్‌ అని పద్యం ఉందని చెప్పారు. భగవంతుడికి భక్తుణ్ణి కాపాడాలని ఎంతగా ఆత్రుత ఉందో అందులో మనకు తెలియచేశారని పేర్కొన్నారు. భగవంతుడి కరుణ మనకు కలుగాలంటే మనం లీనమై వినాలని, లీనమై ప్రార్థించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. భగంతుణ్ణి తాను పూర్తిగా నమ్ముతానని, దాన్ని బాహాటంగా వెల్లడిస్తానని అన్నారు. భగవంతుని విషయంలో ఎవరో ఏమో అనుకుంటారని సంశయంతో పూజలు చేయవద్దని, మనస్ఫూర్తిగా నమ్మి మాత్రమే కొలవాలని అన్నారు.


భక్తి, ఆధ్యాత్మికత అలవర్చుకోగలిగితే శాంతి, సుఖం లభిస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చెప్పారు. భగవంతుడి కరుణ కలుగాలంటే లీనమై వినాలని, ప్రార్థించాలని అన్నారు. దేవుడిని ధైర్యంగా, విశ్వాసం, ప్రేమభావంతో పూజించాలని చెప్పారు. భగవంతుని గురించి చదివినా, విన్నా, ఇతరులకు చెప్పినా చాలా పెద్ద పుణ్యం వస్తుందనేది మనందరి విశ్వాసమన్నారు. దేవాలయాలు కూడా కమ్యునిటీ సెంటర్ల లాంటివన్నారు. గుళ్ళకు వెల్లగానే స్వీయ క్రమశిక్షణ అలవడుతుందన్నారు. దేవాలయానికి వెళ్ళగానే చిన్నపిల్లలు కూడా చెప్పులు విడిచి వెళతారని, అది ఎవ్వరూ చెప్పాల్సిన పనిలేదని అన్నారు. అందుకే దేవాలయాలకు వెళితే మనసు నిర్మలంగా మారిపోతుందన్నారు.

సమాజసేవ గురించి చెబుతూ సీఎం కేసీఆర్‌ డొక్కా సీతమ్మ గురించి ఉదహరించారు. చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో డొక్కా సీతమ్మ గురించి చెప్తుంటారని, ఎవరూ ఆకలితో ఉండకూడదనే భావనతో జీవితమంతా అన్నదానం చేసిన మహత్తరమైన వ్యక్తి అని అన్నారు. ఆమె గురించి తెలిసినవారు ఆమెను దైవస్వరూపంగా చూశారని చెప్పారు. ఇలాంటి ఉత్తమమైన లక్షణం మనుషులకు, భవిష్యత్‌ తరాలకు మంచిదనే ఉద్దేశంతో చాగంటిలాంటివారు తమ ప్రవచనాల్లో ఆమె గురించి చెప్తుంటారని పేర్కొన్నారు. భక్తి, ఆధ్యాత్మికత మనం కూడా అలవర్చుకోగలిగితే మనకు శాంతి, సుఖం లభిస్తాయని చెప్పారు. భగవంతుడి కరుణ కూడా తప్పకుండా లభిస్తుందన్నారు.

కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు..

ఈ మధ్య మనసుకు చాలా బాధ కలిగించే విషయాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తంచేశారు. ఎందుకో మానవ ప్రవత్తి మారిపోతున్నదని, కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.


చాగంటి అద్భుతమైన ప్రవచనకర్త

సంస్కారం, మంచి, సద్గుణాలు, భక్తిభావాన్ని పెంపొందించే ప్రవచనం గొప్పగా అందించిన చాగంటి కోటేశ్వరరావుకు రాష్ట్రం తరఫున, కుటుంబపక్షాన సీఎం ధన్యవాదాలు తెలిపారు. చాగంటి అద్భుతమైన ప్రవచనకర్త అని కొనియాడారు. మానవజాతికి దొరికిన గొప్ప మణిపూస అని అభివర్ణించారు. తాను కూడా చాలా సందర్భాల్లో ఆయన ప్రవచనాలు విన్నానని తెలిపారు. చాగంటి ద్వారా సమాజానికి మేలు, లాభం తప్పక జరుగుతాయని చెప్పారు.

స్ఫూర్తిమంత నేత కేసీఆర్‌

రాష్ట్రం చక్కటి పురోభివృద్ధి పొందాలని ఆశిస్తూ, తాను ధార్మికుడై, చక్కటి అనురక్తి కలిగిన ముఖ్యమంత్రి ఉండటం ఎంతో సంతోషకరమని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. సమకాలీన సమాజంలో స్ఫూర్తిమంత నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడిని చూడాలని అందరూ అనుకుంటారని, తాను కూడా సీఎం కేసీఆర్‌ను దగ్గరగా చూడాలని కోరుకునేవాడినని తెలిపారు. ఈరోజు ఆ అవకాశం దొరికిందని సంతోషం వ్యక్తంచేశారు.

తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో భాగవత సప్తాహం చివరిరోజు ఆయన అభిభాషణ చేస్తూ.. ధర్మంపట్ల, దైవం పట్ల తిరుగులేని నమ్మకాన్ని ప్రకటించిన కేసీఆర్‌ను చూసి సంతోషిస్తున్నానని చెప్పారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ఉండేవారైనా అలవోకగా ఒక్క తప్పు లేకుండా కలడందురు దీనుల యెడ.. అనే పద్యాన్ని చెప్పి భగవంతుని పట్ల విశ్వాసంలో మొహమాటాలు లేకుండా త్రికరణశుద్ధితో ఎలా ఉండాలో చెప్పారని కొనియాడారు. వారు వృద్ధిలోకి రావాలని, వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు ధార్మికులై, శాంతిభద్రతలతో సంతోషంగా ఉండే అదృష్టాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించాలని ప్రార్థించారు. అన్నింటికీ ఆలంబనం ధర్మమేనని, ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే ఎవరూ ఎవరి జోలికి వెళ్లే పరిస్థితి ఉండదని చాగంటి చెప్పారు. అందుకే ధర్మప్రచారం జరుగాలని, ధర్మాత్ము లు రక్షింపబడాలని అన్నారు.

ప్రభువు ధర్మాత్ముడు అయితే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. సమకాలీన సమాజంలో శాసన సభ్యులు, ముఖ్యమంత్రులే ప్రభువులని అన్నారు. రాష్ట్రంలో ధర్మంపట్ల అనురక్తి కలిగిన ధర్మాత్ములను కాపాడాలని చెప్పారు. ఒక వ్యక్తి శరీరం వదిలేసివెళ్తే కనీసం నాలుగు ఇండ్లల్లోనైనా ఆయన వెళ్లిపోయారా! అని బెంగపెట్టుకొని ఆ రోజు అన్నం వండుకోలేని పరిస్థితి కలుగకపోతే ఆ వ్యక్తి సమాజంలో అంతకాలం బతికి ప్రయోజనం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, తదితరులు పాల్గొన్నారు.