భాగ్యనగరానికి మణిహారం రీజనల్‌ రింగ్‌రోడ్‌

రూ. 12వేల కోట్ల ఖర్చు..338 కి.మీ. పొడవు
tsmagazine

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్ట్‌ అయిన ప్రాంతీయ వలయ రహదారి (రీజనల్‌ రింగ్‌ రోడ్‌) భాగ్యనగరానికి మణిహారంగా రూపుదిద్దుకోబోతోంది. రూ. 12వేల కోట్ల ఖర్చుతో, 338 కి.మీ. పొడవున, నాలుగు వరసల్లో, పది జంక్షన్‌లతో, 10 టోల్‌ ప్లాజాలతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. భవిష్యత్తులో దీనిని ఆరులైన్ల రహదారిగా మార్చనున్నారు. ఈ హైవే నిర్మాణం వల్ల హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోను అభివృద్ధి జరుగబోతోంది. రోడ్డు నిర్మాణం వల్ల నగరంలోకి వాహనాల వత్తిడి తగ్గుతుంది. నగరం చుట్టు శాటిలైట్‌

టౌన్‌షిప్‌లు వెలుస్తాయి. నగర రూపురేఖలే మారనున్నాయి.

తెలంగాణ పార్లమెంటు సభ్యుల వత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూమి సేకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌. నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీని ఎంపీలు జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవితలతో పాటు మిగతా ఏంపీలు కలిసి వినతిపత్రం సమర్పించడంతో పాటు డీపీఆర్‌ను అందచేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ భూసేకరణ చేపట్టాల్సిందిగా ఎంపీలకు సూచించారు.

ఈ రింగ్‌రోడ్‌ నిర్మాణం పూర్తయితే సరుకురవాణా సులభమవుతుంది. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కూడా కిక్కిరిసి పోతున్నది. భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. ఈ రద్దీని తట్టుకోవడానికి మరో ప్రాంతీయ వలయ రహదారి అవశ్యకత గుర్తించిన సీఎం కేసీఆర్‌ వెంటనే ప్రాంతీయ వలయ రహదారికి రూపకల్పన చేశారు. అధికారులతో డీపీఆర్‌ తయారుచేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి మంజూరు మన ఎంపీల చొరవతో నిర్మాణానికి నోచుకున్నది.

ఎలా వెళుతుంది..

నగరం చుట్టు నిర్మించనున్న ప్రాంతీయ రహదారి పూర్వపు మెదక్‌జిల్లా సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌ మీదుగా పూర్వపు నల్లగొండ జిల్లా భువనగిరి, చౌటుప్పల్‌, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌, షాద్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ, పూర్వపు మెదక్‌ జిల్లా శంకర్‌పల్లి, కంది గ్రామాల ద్వారా తిరిగి సంగారెడ్డి వరకు రింగురోడ్డు నిర్మాణం కానున్నది. రీజనల్‌ రింగురోడ్డు నిర్మాణంతో నాగపూర్‌, బెంగుళూరు, ముంబై, విజయవాడ జాతీయ రహదారుల అనుసంధానం జరగనున్నది.

జంక్షన్‌లు ..

ప్రాంతీయ వలయ రహదారిలో పది జంక్షన్‌లు ఉండనున్నాయి. తూప్రాన్‌, నర్సాపూర్‌, కౌలంపేట, చేవెళ్ళ, షాద్‌నగర్‌, కొత్తూరు, ఆగ్రాపల్లి, మల్కాపూర్‌, భువనగిరి, ములుగు దగ్గరల్లో జంక్షన్‌లు ఏర్పడనున్నాయి. మొత్తంగా ఈ హైవే నిర్మాణంతో హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల వెలుపల కూడా మహత్తరమైన అభివృద్ధి జరగనుంది. ఈ ప్రాంత ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడనున్నాయి.