|

భాషా సంస్కృతుల పరంపర

అన్నవరం దేవేందర్‌

మన భాషల మనం మాట్లాడుకోవాలె, మన యాసల మనం నవ్వుకోవాలె. మన కైత్కాలు మనయి. అట్లని ఇరుగు పొరుగు భాష వద్దని కాదు. అన్ని నేర్చుకోవాలె అన్నిటిని అర్సుకోవాలె. మన సంస్కృతిల మనం జీవనం ఎల్లదియ్యాలె. మన భాష అచ్చ తెలుగు. ఇంకో తీరుగ మాట్లాడేది ఆంధ్రం కావచ్చు. కొన్నేల్లుగ పొత్తులున్నందున మనకు అబ్బింది మన తెలంగాణ తెలుగు. కొంత సదువుకున్నోల్ల తాన తెల్లబట్టలు ఏసుకునేటోల్ల తాన మరుగున పడ్డది. సదువు శాత్రం తెల్సినోల్లు బువ్వను అన్నం అంటండ్రని అందరు అన్నం తినుడు మొదలు పెట్టిండ్రు. ఇక నుంచి మన బువ్వ మనం తినాలె. ఎనుకట మా సడ్డకుడు అని ముచ్చట పెట్టేది. ఈ నడుమ శానిగ మా తోడల్లుడు అంటుండ్రు, ఇగ నుంచి సడ్డకుడే అనాలె. ఎందుకంటే ఊర్లల్ల ఇప్పటికి అట్లనే అంటరు. యారండ్లను సుత తోటి కోడలు అంటుండ్రు. తాత, తాతయ్య అయ్యిండు. మామ మామయ్య, అన్న అన్నయ్య అయ్యిండు. అయ్య అంటె పురుష లింగం, అత్త పొయ్యి అత్తయ్య ఎట్ల అయ్యింది, లేకుంటే అత్తమ్మ కావాలె గని. ఇదంత టీవిలు సిన్మలల్ల అనవట్టి మన మెదడుల పారింది కని ఏది ఏమైన తేట తెలుగు సంస్కృతి తెలంగాణకు మన మాటలు, మన పాటలు, మన సామెతలు ఈ సందుల మస్తు వాడకం అయితన్నయి. అయినా సుత మన ఇత్తనంల మనమే మొలకెత్తాలె అనే సోయిని ఇంకా పెంచుకోవాలె.

అయితే దీన్నంత మాండలికం అని పేరు పెట్టి ప్రమాణిక భాష వేరే ఉంటది. అదే అసలైన భాష అని కొందరు అంటరు. మనుషులు మొదలు మాట్లాడినంకనే, అక్షరాలకు, రాత పూతలకు ఎక్కినై. అదే భాష గని పుస్తకంల చూసి, తాళ పత్రం చదివి భాష ఎవ్వలు నేర్చుకోరు. మాట్లాడిందే భాష అదే రాయాలె అదే మాట్లాడాలె, అదే ఆ ప్రాంతంకు, ఆ మనుషులకు ప్రామాణికం. ఎవలు ఎక్కడ మాట్లాడినా ఏ పేరుతో పిలుచుకున్నా ఎవలకూ ఆక్షేపనీయం కావద్దు. అన్నీ సరియైనవి ఆంధ్రలో దీర్ఘం తీసి మాట్లాడినా తెలంగాణ వస్తండ్రు, పోతండ్రు అని మాట్లాడినా రెండు సమానమైన గౌరవాలె పొందాలె.

అంతేగని ఒకటి అసలైనది ఇంకొకటి ప్రామాణికమైనదని అనుడు వల్లనే ఇదంత కథ మొదలైంది. ఒక్క భాష ముచ్చటనే కాదు పండుగలు, పబ్బాలు అన్నీ మనయి మనకు వుంటయి. వాటినే అనుసరించాలె. దక్కన్‌ పీఠభూమిలో కట్టు, బొట్టు వ్యవహారం ఇండ్ల నిర్మాణం, వస్తువుల అలంకరణ సామాగ్రి అన్ని అలగ్‌ ఉంటాయి. తినే ఆహారం సుత ప్రాంత ప్రాంతాలకు తీరుతీరుగా ఉంటయి. ఒక్క తెలంగాణలనే ఒక్కో జిల్లాలల్ల రకరకాలు కన్పిస్తాయి. మనం ఇదివరకు

ఉప్పుడు పిండి తినేది. గడ్క, సర్వపిండి, రొట్టెలు తినేది. ఇప్పుడు అవన్నీ పోయి ఇడ్లీ, వడలు వచ్చినయి. మల్లా ఈ మధ్య తెలంగాణ ఉద్యమం వల్ల సర్వపిండి మల్లా వెలుగులోకి వచ్చింది. ఆ మాటకు వస్తే ఒక ప్రాంతంలో ఆయా వర్ణాల ప్రకారం కూడా ఆచారాలు వ్యవహారాలు వేరు వేరుగానే ఉంటాయి. అయితే అన్నిటినీ గౌరవించుకొని అందరిని సమాన స్థాయిగ చూడటమే ప్రజాస్వామికత.

అక్షరమే అందరికీ చైతన్యం. పుస్తకమే సమస్త ప్రజానీకానికి విలువలు నేర్పేది. చరిత్ర సంస్కృతి, సంప్రదాయం వారసత్వం అన్నీ పుస్తకాల ద్వారనే పరంపరంగ వస్తున్నాయి. పుస్తకాల కంటే పూర్వం మౌఖిక సాహిత్యం, కథలు, పాట ద్వారా గాథల ద్వారా ఆయా చరిత్రలు గాథలు ముందు తరాల వారికె తెలిసేవి. తర్వాత తాళ పత్ర గ్రంథాలు ఇంకా ముందు బండ మీద లిఖించిన అక్షరాలు చరిత్రను తెలుపుతున్నాయి. ఎవరి చరిత్ర అయినా ఆయా కాలాల సంస్కృతిని పట్టిస్తుంది. అయితే ఒక సంస్కృతి, భాష ఇంకో ప్రాంతం మీద ఆధిపత్యం చేయడం ఇదే గొప్పదని డైరెక్ట్‌గా చెప్పకున్నా ప్రామాణికం అని నిర్ధారించ చూపడం సరియైనదికాదు. అయితే ఎవల సంస్కృతి మూలాల్లో వాల్లు తిరిగి ప్రవేశించాలి. మన మ్యానమామ, మన తాత ముత్తాతలు మాట్లాడిన భాషను సంస్కృతిని మాటలను శాత్రాలను మనం అనుసరిస్తూ మన వారసులకు అందచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.