భువిని కైలాసంగా మార్చేపండుగ మహాశివరాత్రి

tsmagazine

ఎందరో ఆస్తిక జనులకు అపురూపమై, పుణ్యప్రదమైన రాత్రి ‘మహాశివరాత్రి’. పేరులోనే పరమేశ్వరుని సాక్షాత్కారాన్ని స్మరింపజేసే ఈ పర్వదినం వేదకాలం నుండి నేటి దాకా లోకాన్ని తరింపచేస్తోంది. భువిని కైలాసంగా మార్చివేస్తోంది. ప్రతి యేటా మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశీ తిథినాడు ఆచరించే ఈ పండుగకు వేదాది వాజ్ఞయంలోనూ, అనేక పురాణేతిహాసాలలోనూ, కావ్యాలలోనూ అనేక కథలు విరాజిల్లుతున్నాయి. ఇవన్నీభక్తులలో పరమేశ్వరునిపై అచంచల శ్రద్ధాసక్తులను కలిగిస్తూ, ఈ ప్రపంచమంతా శివమయం అనే భావనను కలిగిస్తున్నాయి.

శివశబ్దం మంగళప్రదం. శివం అనే మాటకు శ్రేయస్సు, రక్షణ, కల్యాణం, మంగళం, శుభం, కుశలం మొదలైన ఎన్నో అర్థాలున్నాయి. ఇవన్నీ శివునివల్ల కలిగినవే. శివుడు నిరంతరం లోకాలను క్షేమంగా ఉంచడంకోసం ఎన్నో అద్భుత కృత్యాలు చేశాడు. భగీరథుని తపఃప్రయత్న ఫలంగా భువికి అవతరించబోతున్న ఆకాశగంగను తన జటాజూటంలో బంధించి, భుమిని కాపాడాడు. జటాజూటంలో బంధింపబడిన గంగను లోకాన్ని అనుగ్రహించడంకోసం హిమాలయాలలో ప్రవహింపజేశాడు. తలపై నెలవంకను ధరించి, ఆ నెలవంకను ఆరాధ్య దైవంగా తీర్చిదిద్దాడు. మేనిపై శ్మశానభస్మాన్ని ధరించి ఈ సృష్టిఅంతా చివరికి భస్మీభూతం అయ్యేదే అని తెలియజేశాడు. అమృతంకోసం దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు తొలుత వెలువడిన మహా భయంకర కాలకూట విషాన్ని లోకరక్షణంకోసం మ్రింగి, తన గొంతులో దాచుకొన్నాడు. ఎవరు తనను పిలిచినా ఆశుతోషుడై కాపాడి, భోళాశంకరుడైనాడు. భక్తులు కోరితే కోరిన వరాలను ఇచ్చి, తాను కష్టాలపాలైన కరుణామయుడు శంకరుడు. అలాంటి పరమేశ్వరుడు లోకానికి లింగాకృతిలో సాక్షాత్కరించిన పుణ్యదినం మహాశివరాత్రి!

ఈ మహాపర్వదిన ప్రాశస్త్యాన్ని తెలిపే కథలెన్నో పురాణేతిహాసాలలో లభిస్తాయి. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఆధిపత్య విషయంలో తగవు ఏర్పడింది. ఎవరికివారు తామే గొప్ప వారమని వాదించుకున్నారు. వారి వాదం యుద్ధం వరకు విస్తరించింది. ఇరువురూ తమతమ వాహనాలైన హంస, గరుడులపై అధిరోహించి పోరాడసాగారు. ఒకరిపై మరొకరు అస్త్రాలను ప్రయోగించుకొన్నారు. బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని సంధించగా, విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని సంధించాడు. అత్యంత మహిహగల దివ్యాస్త్రాలు లోకాలను దహించివేస్తాయని భయపడిన దేవతలు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మ విష్ణువుల మద్య భీకరయుద్ధం వలన లోకాలకు వినాశం తప్పదనీ, నీవే ఈ ఆపదనుండి కాపాడాలనీ వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు యుద్ధరంగంలోకిదిగి వారి దివ్యాస్త్రాలకు మధ్య అగ్నిస్తంభరూపంలో ఆవిర్భవించాడు. బ్రహ్మ విష్ణువుల అస్త్రాలను తనలో లీనం చేసుకొన్నాడు. అప్పుడు అగ్నిస్తంభరూపంలో ఊర్ధ్వ లోకాలకూ, అధోలోకాలకూ విస్తరిస్తున్న పరమేశ్వరుని ఆద్యంతాను తెలుసుకొనేందుకు బ్రహ్మ హంసవాహనంపై ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. విష్ణువు దరహంపై నేలను త్రవ్వుతూ అధోలోకాలకు ప్రయాణిస్తాడు. ఎంతదూరం వెళ్లినా పరమశివుని శక్తికి ఆద్యంతాలను కనుగొనలేక బ్రహ్మవిష్ణువులు విఫలప్రయత్నులై తిరిగి వచ్చి, పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని, తమ అహంకారాన్ని ఉపసంహరించుకొటారు. ఇలా మాఘమాస కృష్ణ చతుర్దశినాటి అర్థరాత్రివేళ లింగరూపంలో పరమేశ్వరుడు లోకాలను అనుగ్రహించిన కారణంగా లోకమంతా మహాశివరాత్రినాడు లింగోద్భవకాలంలో శివార్చనలతో పునీతమవుతున్నది. ప్రాచీనస్తోత్రాలు ఇదే విషయాన్ని ఇలా స్పష్టం చేస్తున్నాయి.

‘బ్రహ్మమురారి సుదార్చితలింగం
నిర్మల భాసిత శోభితలింగం
జన్మజదుఃఖవినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగమ్‌’

శివుని సర్వాంతర్యామిగా వర్ణిస్తూ యజుర్వేదంలోని రుద్రాధ్యాయం ఎన్నో విషయాలను ఆవిష్కరించింది. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఈ సృష్టి అంతా శివమయం అని వేదవాక్కు. శివార్చనలో రుద్రాధ్యాయంలోని నమక చమకాలు ప్రధానపాత్రను పోషిస్తున్నాయి. రుద్రాభిషేకంలో నమకచమకాలు లేకుండా పూజ ఉండదు. శివుని రుద్రమూర్తులన్నీ ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయనీ, ఆ రుద్రత్వం చెడును నశింపజేయాలనీ, మంచిని కాపాడాలనీ కోరడం ఈ అర్చనలో కనబడుతుంది. శివార్చన సమయంలో ప్రతి వ్యక్తి, తనను తాను శివునిగా భావించుకోవాలని ‘నా7రుద్రోరుద్రమర్చయేత్‌’ అనే వేదమంత్రం ప్రబోధిస్తోంది. తనలో శివత్వాన్ని ఆపాదించుకోవడం అంటే తనలో శివుని మంచి గుణాలను నిలుపుకోవడమే. శివగుణాలుగలవాడే శివార్చనకు అర్హుడని పరమార్థం. ఇలా మహా శివరాత్రినాడు ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్ర భావనతో పుణ్య స్నానాలను ఆచరిస్తారు. రోజంతా ఉపవాసం చేస్తారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రాలైన పవిత్రజలాలను సేకరించి అభిషేకాలు చేస్తారు. ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం’ అన్నట్లు భక్తితో యథాశక్తిగా పూజాద్రవ్యాలను శివునికి అర్పిస్తారు. అభిషేక జలాలను తీర్థంగా స్వీకరిస్తారు. శివరాత్రినాడు జాగరణచేస్తూ, శివనామాలను జపిస్తారు. రాత్రంతా భజనలతో, స్తోత్రాలతో కాలక్షేపం చేస్తారు. శివాలయాలను సందర్శిస్తారు. యథాశక్తిగా దానధర్మాలను ఆచరిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన శివక్షేత్రాలకు కొదువలేదు. ముక్తిని ప్రసాదించే మహాకాళునిక్షేత్రం కాళేశ్వరం, భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే రాజరాజేశ్వరుని మహాక్షేత్రం వేములవాడ, అభీష్టాలను తీర్చే కీసలగుట్టలోని రామలింగేశ్వరాలయం, ఝరాసంగంలోని కేతకీసంగమేశ్వరాలయం, రామప్పగుడిలోని రామలింగేశ్వరక్షేత్రం, మహాదేవుని వేయిస్తంభాలగుడి, అష్టసిద్ధులను ప్రసాదించే బిక్కనూరు సిద్ధరామేశ్వరక్షేత్రం ఇలా అడుగడుగునా, అణువణువునా వేలకొలది శివాలయాలకు నెలవైన పవిత్రభూమి తెలంగాణ రాష్ట్రం మహాశివరాత్రి పర్వదినాన భూకైలాసంవలె వెలిగిపోతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన శివక్షేత్రాలకు కొదువలేదు. ముక్తిని ప్రసాదించే మహాకాళునిక్షేత్రం కాళేశ్వరం, భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే రాజరాజేశ్వరుని మహాక్షేత్రం వేములవాడ, అభీష్టాలను తీర్చే కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, ఝరాసంగంలోని కేతకీసంగమేశ్వరాలయం, రామప్ప గుడిలోని రామలింగేశ్వరక్షేత్రం, మహాదేవుని వేయిస్తంభాలగుడి, అష్టసిద్ధులను ప్రసాదించే బిక్కనూరు సిద్ధరామేశ్వరక్షేత్రం ఇలా అడుగడుగునా, అణువణువునా వేలకొలది శివాలయాలకు నెలవైన పవిత్రభూమి తెలంగాణ రాష్ట్రం మహాశివరాత్రి పర్వదినాన భూకైలాసంవలె వెలిగిపోతుంది.

శివుడు అభిషేక ప్రియుడు. ‘హరిహరా!’ అంటూ జలాలతో అభిషేకం చేస్తే చాలు, ప్రసన్నుడై, భక్తుల కోరికలను తీర్చే భక్తివశ్యుడు స్వామి!

ఈ ప్రపంచమంతా పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపం. ప్రపంచానికే జననీజనకులు ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులు. వారి సంతానమే ఈ ప్రపంచం. వారు అర్థనారీశ్వరులై ఎన్నటికీ విడిపోని జంటగా లోకానికి ఆరాధ్యులైనారు. భార్యాభర్తలు తమవలె అన్యోన్యంగా ఉండాలనీ, అలా ఉంటేనే సంతానం క్షేమంగా ఉంటుందనీ, లోకమంతా శాంతిమయం అవుతుందనీ తెలిపే స్వరూపం అర్థనారీశ్వరరూపం.

శివార్చన సమయంలో పఠించే నమకచమకాలలోనూ ఈ ప్రపంచంలోని చరాచరాలన్నింటిలోనూ నేనే నిండి ఉన్నానని ఈశ్వరభావన చేయడం ఈ ప్రపంచమంతా శివమయమని సందేశాన్ని అందిస్తోంది. శివపూజలోని నిరాడంబరత్వం, సర్వసమర్పణభావం, మానసికధ్యానాలు మానవుణ్ణి లోకోత్తరునిగా నిలిపేందుకు దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ పుడమి ఒక శివలింగం వంటిది. ఈ శివలింగంపై వర్షాకాలంలో ఆకాశంలో ఉద్భవించే మేఘాలు వర్షాన్ని కురిపించి అభిషేకం చేస్తాయి. అప్పుడు ఈ ప్రపంచం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఇదంతా శివార్చన వంటిదే. శివుని ప్రాకృతిక పూజను వర్ణించే నా ‘ఋతుగీత’ పద్యాన్ని ఉదాహరించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను-

‘పుడమియె శైవలింగమని పూజలు చేసేదవీవు భక్తితో
వడివడి వానలందడిపి వార్షిక వార్షుక వేళలందు
నీయొడలభిషేకప్రాత్రగ నియుక్తముగాగ, తటిల్లతారుచుల్‌
మృడునికి తైజసాత్మక సమృద్ధిగ గంధపు పూతలయ్యెడిన్‌!

– ఓం నమశ్శివాయ! –

డా|| అయాచితం నటేశ్వరశర్మ